- మంత్రి నారాయణ వెల్లడి
- రైస్‌మిల్లులను ఇతర ప్రాంతాలకు తరలిస్తాం
- మిల్లర్ల యజమానులు, అసోసియేషన్ నాయకులు సహకరించాలి
- టీడీపీకి వస్తున్న మంచి పేరును చూడలేకే వైసీపీ ఆందోళనలు
నెల్లూరు (చైతన్యరథం): నెల్లూరుకి విమానాశ్రయం ఎంతో అవసరమని…త్వరలోనే విమానాశ్రయ పనులు చేపడతామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి పొంగూరు నారాయణ చెప్పారు. నెల్లూరు కలెక్టరేట్లో….రాష్ట్ర దేవదాయ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కలెక్టర్ ఆనంద్, జేసీ కార్తీక్‌లతో కలిసి రివ్వ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు జిల్లాలో ఎన్నో ఏళ్లుగా పెండిరగ్లో ఉన్న దగదర్తి ఎయిర్ పోర్ట్, రైస్ మిల్లులను ఇతర ప్రాంతాలకు మార్చడం వంటి అంశాలను చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ….నెల్లూరు జిల్లాకి ఎంతో కాలం నుంచి పెండిరగ్లో ఉన్న రెండు ముఖ్యమైన అంశాలను చర్చించేందుకే ఈ సమావేశం నిర్వహించామన్నారు. రైస్ మిల్లులు ఎక్కువగా కార్పొరేషన్ పరిధిలో ఉన్నాయన్నారు. అయితే ఇప్పుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) చాలా కఠినంగా ఉందని తెలిపారు. రైస్ మిల్లులు ఉన్న ఏరియాల్లో నాలుగు రెట్లు ఎక్కువగా పొల్యూషన్ ఉందన్నారు. ఈ క్రమంలో ఎన్జీటీ నిబంధనల మేరకు…ఆ రైస్ మిల్లులను ఆ ప్రాంతాల నుంచి మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గతంలో తాను మంత్రిగా ఉన్న సమయంలోనే ఈ సమస్యపై మూడు అసోసియేషన్లతో అప్పటి ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, సోమిరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, అధికారులతో చర్చించడం జరిగిందని గుర్తు చేశారు. ఇప్పుడున్న రైసు మిల్లులకు ఎటువంటి నష్టం జరగకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆయా ప్రాంత ఎమ్మెల్యేలు, కలెక్టర్‌తో చర్చించి వేరే ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. కిసాన్ ఎస్ఈ జెడ్, కృష్ణపట్నం పోర్ట్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. మిల్లర్లను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం లేదన్నారు. వారు వ్యాపారాలు చేసుకుంటేనే రాష్ట్రానికి జీఎస్టీ కూడా బాగా వస్తుందన్నారు. వ్యాపారస్తుల్ని ప్రోత్సహించడమే ఈ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమన్నారు. అందుకనే రైస్ మిల్లుల యజమానులు, అసోసియేషన్ నాయకులు అందరూ ఒక నిర్ణయానికి వచ్చి ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి నారాయణ కోరారు.
అభివృద్ధిలో విమానాశ్రయం కీలకం
ఏ దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ఇన్ఫ్రాస్టక్చర్ ముఖ్యమన్నారు. ఇన్ఫ్రాస్టక్చర్ అంటే రోడ్డు, రైలు, విమాన, ఓడరేవు కనెక్టివిటీ చాలా ముఖ్యమన్నారు. నెల్లూరుకి విమాన మార్గం కావాల్సిన అవసరం చాలా ఉందన్నారు. కృష్ణపట్నం పోర్ట్, ఇంకా మరి కొన్ని పోర్టులు కూడా వచ్చేశాయన్నారు. వాటిలో కార్గో రవాణా చాలా ముఖ్యమైందన్నారు. 2014-2019 టీడీపీ ప్రభుత్వంలోనే విమానాశ్రయాన్ని మంజూరు చేస్తే, గత వైసీపీ ప్రభుత్వం ఏవో కారణాలు చెబుతూ ఆపేసిందన్నారు. ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబునాయుడు నెల్లూరుకి వచ్చినప్పుడు మళ్లీ దగదర్తిలోనే విమానాశ్రయం పెడుతామని చెప్పారన్నారు. ఢల్లీి వెళ్లినప్పుడు ఈ విషయంపై కేంద్ర మంత్రిని కలిశామని..ఆయన కూడా మీరు స్థలం చూపిస్తే.. వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేస్తానని చెప్పారన్నారు. వచ్చే వారంలో దీని కోసం ఓ బృందాన్ని పంపిస్తారన్నారు. వీలైనంత త్వరలోనే నెల్లూరు విమానాశ్రయ పనులు చేపడతామని మంత్రి నారాయణ చెప్పారు.
ఇసుక అక్రమాలపై స్పందించిన మంత్రి
ఇసుక అక్రమాలంటూ వైసీపీ నాయకులు ఆందోళనలకు దిగటం విడ్డూరంగా ఉందని మంత్రి నారాయణ అన్నారు. గత ప్రభుత్వంలో ధరలు అధికంగా ఉన్నప్పుడు ఏమీ చేయలేదని…టీడీపీ ప్రభుత్వంలో ధరలు బాగా తగ్గిపోయాయని…అయినా వైసీపీ వాళ్లు ధర్నాలు చేయడం వింతగా ఉందన్నారు. టీడీపీకి మంచి పేరు వస్తుందని…దీనిని ఓర్వలేక, రాజకీయ ఎత్తుగడల కోసమే వైసీపీ నేతలు ధర్నా చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఇతర ప్రాంతాలకు రైసుమిల్లుల తరలింపు: మంత్రి ఆనం
అనంతరం రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ నెల్లూరు నగరం చుట్టూ ఉన్న రైస్ మిల్లులను ఇతర ప్రాంతాలకు తరలించాలని భావిస్తున్నామని చెప్పారు. ఒకప్పుడు నగర శివార్లలో ఉన్న ఈ మిల్లులు నేడు నగరం విస్తరించడంతో నడిబొడ్డులోకి వచ్చాయన్నారు. కృష్ణపట్నం పోర్టు… లేదా కిసాన్ ఎస్.ఈ.జెడ్ లోకి మార్చాలని భావిస్తున్నట్లు తెలియజేశారు. ఈ మేరకు రైస్‌మిల్ అసోసియేషన్లతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. జిల్లాకు ఎంతో అవసరమైన దగదర్తి విమానాశ్రయ పనులు కూడా త్వరలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లాలో కృష్ణపట్నం, రామయ్యపట్నం పోర్టులు.. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లు ఉన్నాయని, వీటికి అనుబంధంగా పరిశ్రమలు రానున్నాయని మంత్రి ఆనం తెలిపారు. వీటికి విమానాశ్రయం ఎంతో అవసరం ఉందన్నారు. విమానాశ్రయానికి 1379 ఎకరాలు అవసరమని గుర్తించామని చెప్పారు. కొంత భూమికి పరిహారం ఇచ్చామని, అయితే ఇంకా భూమిని సేకరించాల్సి ఉందన్నారు. ఈ విషయంపై కేంద్ర మంత్రి రామమోహన్ నాయుడుతో చర్చిస్తామని తెలిపారు. త్వరలోనే ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ప్రతినిధులు వచ్చి పరిశీలన చేస్తారని మంత్రి ఆనం తెలియజేశారు.