- ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయం, ఆమోదం
- సీఎం అధ్యక్షతన మంత్రిమండలి భేటీ
- అజెండాలోని 55 అంశాలపై చర్చ, ఆమోదం
- అభివృద్ధిని సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి..
- బాధ్యతాయుతంగా పనిచేయాలని మంత్రులకు హితవు
- రాజమండ్రి, శ్రీకాకుళం ఘటనలపై సీఎం సీరియస్
అమరావతి (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా సైన్స్. టెక్నాలజీ, ఇన్నోవేషన్ శాఖ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో మంగళవారం ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. సచివాలయం వేదికగా చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రిమండలి సమావేశం జరిగింది. కేబినెట్ భేటీలో మొత్తం 55 అజెండా అంశాలపై మంత్రిమండలి చర్చించింది. అనంతరం పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, చీరాల, తిరుపతి, సత్యసాయి జిల్లాలలో పర్యాటక ప్రాజెక్టులకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అలాగే సోలార్, హైడ్రో, హైబ్రిడ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు పచ్చజెండా ఊపింది. ఇక కేబినెట్ భేటీలో భాగంగా విశాఖపట్నంలో రూ.2,387 కోట్లతో సెమీకండక్టర్ పరిశ్రమ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. వివిధ సంస్థలకు భూకేటాయింపులపై మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. కొల్లేరు అభయారణ్య సరిహద్దుల ఖరారుపై కేంద్ర ప్రభుత్వానికి పంపే ప్రతిపాదనలకు కూడా ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించే ప్రతిపాదనకు కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ధ్రువీకరణ పత్రాలున్న దివ్యాంగులకు బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్లను ఫిబ్రవరి 28న పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఆరోజు అసెంబ్లీకి సెలవు ఇవ్వనున్నారు.
క్యాబినెట్ ముఖ్య నిర్ణయాలు:
అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోదం. ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖలను అభివృద్ధి చేయాలని నిర్ణయం. విశాఖలో రూ.2,387 కోట్లతో నిర్మించే సెమీకండక్టర్ పరిశ్రమకు ఆమోదం. వివిధ సంస్థలకు భూకేటాయింపులపై నిర్ణయం. సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ శాఖ ఏర్పాటు చేయాలని నిర్ణయం. కొల్లేరు అభయారణ్య సరిహద్దుల ప్రతిపాదనకు ఆమోదం. సరిహద్దుల ఖరారుపై కేంద్రానికి పంపే ప్రతిపాదనలకు ఆమోదం.
రాజమండ్రి, శ్రీకాకుళం ఘటనలపై ప్రభుత్వం సీరియస్
అజెండా అంశాలు ముగిసిన అనంతరం తాజా పరిణామాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. రాజమండ్రిలో పాలకల్తీ, శ్రీకాకుళంలో డయేరియా ఘటనలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని తెలిపారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అసెంబ్లీలో బుధవారం మధ్యాహ్నం 12 నుంచి 2వరకు ఒక్కో అంశంపై లఘు చర్చ చేపడదామని, దీనికి సంబంధించి అంశాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. సాగు రంగానికి చేస్తున్న కృషి అసెంబ్లీ వేదికగా ప్రజల్లోకి వెళ్లాలని, సందర్భం మేరకు తాను, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చర్చల్లో పాల్గొంటామని చంద్రబాబు తెలిపారు. శాఖలవారీగా పద్దులపై జరిగే చర్చలకు మంత్రులు బాగా ప్రిపేర్ కావాలన్నారు.
బాధ్యతాయుతంగా పని చేయాలి: సీఎం
ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు గ్రామస్థాయి వరకు చేరేలా మంత్రులు, అధికారులు సమన్వయంతో పని చేయాలని రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. మంత్రులు తమ శాఖల్లో జరుగుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఏడాది పొడవునా ప్రజల్లో తిరిగి చేసే సేవలను అసెంబ్లీలో ఒకరోజు సమర్థంగా వివరించగలిగితే, అది ప్రతి ఇంటికీ చేరినట్లే అవుతుందని అన్నారు. ప్రభుత్వానికి రోజూ ఒక పరీక్షలాంటిదని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం కోసం బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. శాఖలపై మరింత పట్టు సాధించి ప్రజలకు సరిగ్గా వివరించాల్సిన బాధ్యత మంత్రులదేనని స్పష్టం చేశారు. ప్రతిపక్షం నిర్మాణాత్మకంగా వ్యవహరించకుండా రాజకీయాలకే పరిమితమవుతోందని సీఎం విమర్శించారు. అసెంబ్లీ చర్చలు అర్థవంతంగా ఉండాలని, ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అవసరం ఉందని తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేల ప్రసంగాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో విశ్లేషిస్తున్నామని సీఎం వెల్లడించారు. అసెంబ్లీలో ఎవరు ఎలా మాట్లాడుతున్నారో, ప్రజలకు ఎంత ఉపయోగపడుతున్నారో పరిశీలిస్తున్నామని తెలిపారు. ప్రజల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని, అంతా సమర్థవంతంగా పనిచేయాలని సీఎం పిలుపునిచ్చారు.





