2019 ఎన్నికల ప్రచారంలో జగన్ రెడ్డి వాడిన ప్రధాన ఎన్నికల అస్త్రం “కోడికత్తి కేసు”. ఆ ఎన్నికల్లో ఆయన అధికారంలోకి రావటానికి కోడికత్తి కేసు బాగానే ఉపయోగపడింది. తనపై కోడికత్తితో దాడికి యత్నించారని.. దాని వెనుక టీడీపీ హస్తం ఉందంటూ.. ఆనాడు ఊరూవాడా తిరిగిన జగన్ రెడ్డి నానాయాగీ చేశారు. టీడీపీని ఎంత డ్యామేజ్ చేయాలో అంత డ్యామేజ్ చేశారు. ఇక ఈ కోడికత్తి కేసు విషయానికి వస్తే.. విశాఖ ఎయిర్ పోర్టు క్యాంటీన్‌లో పని చేస్తున్న కోనసీమకు చెందిన జనుపల్లి శ్రీను అనే వ్యక్తి జగన్ రెడ్డిపై కోడికత్తితో హత్యాయత్నం చేశాడనేది ప్రధాన ఆరోపణ. అతను నిజంగా జగన్ పై హత్యాయత్నం చేశాడా..? లేక జగన్ రెడ్డే అతనితో అలా డ్రామా ఆడించారా..? అనేది నేటికీ సమాధానం దొరకని ప్రశ్నగానే మిగిలిపోయింది. అయితే.. ఆ కేసు విచారణ ప్రస్తుతం విజయవాడలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో కొనసాగుతోంది. 2018 లో కోడికత్తి కేసులో అరెస్టైన జనుపల్లి శ్రీను జైల్లో రిమాండ్ ఖైదీగా మగ్గుతుండగా.. ఆ ఘటనలో బాధితుడిగా ఉన్న జగన్ రెడ్డి ప్రస్తుతం ఏపీ సీఎంగా కొనసాగుతన్నారు. సుమారు 5 ఏళ్ళ నుంచి ఈ కేసు విచారణ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా సాగుతోంది. దీనికి కారణం.. ప్రస్తుతం సీఎం హోదాలో ఉన్న జగన్ రెడ్డి.. సాక్ష్యం చెప్పటానికి ముందుకు రాకపోవటమే అనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఇక.. విశాఖ ఎయిర్ పోర్టులో 2018 అక్టోబరు 25న అప్పటి ప్రతిపక్ష నేత జగన్‌పై శ్రీనివాస్ కోడికత్తితో దాడికి పాల్పడగా.. ఈ ఘటనకు సంబంధించి శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అయితే 2019, మే 25న న్యాయస్థానం అతడికి బెయిల్ మంజూరు చేయడంతో శ్రీనివాస్ బయటికి వచ్చాడు. ఇంతలోనే జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చింది. ఈ కేసు విచారణ స్థానిక పోలీసుల నుంచి NIA చేతుల్లోకి వెళ్ళింది. దీంతో కోర్టు శ్రీనివాస్ బెయిల్ రద్దు చేసింది. ఆనాటి నుంచి శ్రీను జైల్లోనే జీవితం గడుపుతున్నాడు. ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న శ్రీను నిజంగా తప్పు చేసి ఉంటే.. జగన్ రెడ్డి కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్పాలి. అతడికి కఠిన శిక్ష పడేలా చేయాలి. లేదా.. అతనికి బెయిల్ వచ్చేందుకు అభ్యంతరం పెట్టకూడదు. కానీ.. ఈ రెండు పనులను జగన్ రెడ్డి చేయటం లేదు.
జగన్ రెడ్డి కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్పటం లేదు.. అలాగని నిందితుడికి బెయిల్ వచ్చేందుకు NOC ఇవ్వటం లేదు. దీంతో.. కోడికత్తి కేసు విచారణ ఏళ్ల తరబడి సాగుతూనే ఉంది. మరోవైపు.. అమాయకుడైన తన కుమారుడిని కోడికత్తి కేసులో ఇరికించారని శ్రీను తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. జైలులో తన కుమారుడి ప్రాణాలకు హాని ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. గతంలో పరిటాల రవి హత్య కేసులో నిందితుడు మొద్దు శ్రీను జైల్లో హత్యకు గురైన ఘటన ఈ సందర్భంగా తెరపైకి వస్తోంది. మరోవైపు.. వివేకా హత్యకేసులో సైతం కీలక వ్యక్తులు చనిపోవటం, దస్తగిరి సైతం తనకు ప్రాణహాని ఉందని చెప్పటం ప్రాధాన్యం సంతరించుకుంటోంది. కోడికత్తి కేసులో సైతం.. తన కుమారుడిని కడతేర్చే కుట్రలు జరుగుతున్నాయని శ్రీను తల్లి కన్నీరు మున్నీరు అవుతోంది. విచారణ ముగిసే లోగా.. శ్రీనుకు ఏదైనా జరిగే అవకాశం ఉందని ఆమె అనుమానాలు వ్యక్తం చేస్తోంది.
కోడికత్తి కేసులో నిందితుడైన శ్రీనుకు బెయిల్ రాకపోవటం.. విచారణ ఏళ్ళ తరబడి సాగుతుండటాన్ని డిఫెన్స్ లాయర్ కోర్టు దృష్టికి తీసుకువెళ్ళారు. దీంతో.. ఈ కేసులో బాధితుడు మరియు సాక్షి అయిన జగన్ రెడ్డి కోర్టుకు వచ్చి సాక్ష్యం ఇవ్వాలంటూ న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు. దీనిపై వాయిదాలపై వాయిదాలు జగన్ రెడ్డి కోరటంతో.. తుది విచారణ ఏప్రిల్ 10కి కోర్టు వాయిదా వేసింది. ఆ రోజు ఖచ్చితంగా సాక్షిగా ఉన్న జగన్ రెడ్డి వచ్చి సాక్ష్యం ఇవ్వాలంటూ పేర్కొంది. అయితే.. విజయవాడ కోర్టుకు హాజరు కాని సీఎం జగన్ రెడ్డి.. తన లాయర్ ద్వారా రెండు పిటీషన్లను దాఖలు చేయించారు. ప్రస్తుతం తాను ఆంధప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఊపిరి సలపని పని ఒత్తిడిలో ఉన్నానని.. పేదల పథకాల కోసం అత్యవసర సమీక్షల్లో బిజీగా ఉన్నందువల్ల కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పలేనని జగన్ రెడ్డి పేర్కొన్నారు. అంతేకాదు… ముఖ్యమంత్రి హోదాలో భారీ కాన్వాయ్‌తో కోర్టుకు రావటం వల్ల.. ట్రాఫిక్ ఇబ్బందులు వస్తాయని.. కాబట్టి తన సాక్ష్యాన్ని అడ్వకేట్ కమిషనర్ సమక్షంలో వీడియోగా రికార్డు చేయాలని కోరారు. ఈ కేసులో విచారణను మరింత లోతుగా జరిపించాలంటూ మరో పిటిషన్ సైతం దాఖలు చేశారు. మొత్తం మీద.. విజయవాడలో NIA కోర్టుకు వచ్చి తాను వ్యక్తిగతం సాక్ష్యం ఇవ్వలేనని జగన్ రెడ్డి తేల్చి చెప్పారు.
జగన్ రెడ్డి చెప్పిన ఈ కుంటి సాకులను చూసి ఏపీ ప్రజలు మొత్తం నోరు వెళ్ల బెడుతున్నారు. ముఖ్యమంత్రి పోస్టులో ఉంటే.. కోర్టుకు వెళ్లి సాక్ష్యం చెప్పటానికి అడ్డంకి ఏంటని..? ప్రశ్నిస్తున్నారు. సమీక్షలు.. ట్రాఫిక్ ఇక్కట్లంటూ జగన్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారంటూ విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఒకవేళ జగన్ రెడ్డి కోర్టుకు వెళితే.. డిఫెన్స్ లాయర్ అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తుందని.. క్రాస్ ఎగ్జామినేషన్‌లో మొదటికే మోసం వస్తుందనే భయంతోనే.. జగన్ రెడ్డి ఇలా కుంటి సాకులు చెబుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
మొత్తం మీద ప్రతిపక్ష నేతగా ఆనాటి ప్రభుత్వంపై కోడికత్తి బురద జల్లిన జగన్ రెడ్డి.. ఇవాళ ఇలా వాయిదాలకు వెళ్ళకుండా తప్పించుకు తిరగటం..ఏంటని టీడీపీ నిలదీస్తోంది. కోడికత్తి కేసు జగన్ రెడ్డి ఆడిన డ్రామా కాకపోతే.. ఆయన స్వయంగా వెళ్లి సాక్ష్యం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు.. నిందితుడి తరపు న్యాయవాది కూడా ఇదేరకమైన అభిప్రాయన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి అయినా.. ప్రధానమంత్రి అయినా చట్టం ముందు అంతా సమానమే అని.. రూల్ ఆఫ్ లా అందరికీ వర్తిస్తుందని చెబుతున్నారు. ఈ విషయాన్ని తదుపరి విచారణలో కోర్టు దృష్టికి తీసుకు వస్తామని.. తెలిపారు. మొత్తం మీద.. కోడికత్తి ఘటనలోనే కాదు.. విచారణలో సైతం సీఎం జగన్ రెడ్డి డ్రామాలు ఆడుతుండటాన్ని రాష్ట్ర ప్రజలు తీవ్రంగా తప్పు పడుతున్నారు.