అమరావతి (చైతన్య రథం): ఎన్డీయే ప్రభుత్వ తొలి ప్రాధాన్యమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల డిజైన్లకు త్వరలోనే అనుమతులిస్తామని సీడబ్ల్యూసీ ఛైర్మన్ కుషేందర్ ఓహ్రా స్పష్టం చేశారు. ఢల్లీిలో మంగళవారం తన ఛాంమర్లో కలిసిన రాష్ట్ర జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడితో సమావేశం అనంతరం ఓహ్రా ఈమేరకు హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు సేఫ్టీకి రాజీ పడకుండా డిజైన్లకు త్వరితగతిన అనుమతులివ్వాలన్న మంత్రి విజ్ఞప్తికి కుష్వేందర్ సానుకూలంగా స్పందించారు. ఎన్డీఏ ప్రభుత్వ తొలి ప్రాధాన్యమైన ప్రాజెక్టు విషయంలో ఎలాంటి జాప్యాలు ఉండవని ఓహ్రా స్పష్టం చేశారు. ఓహ్రాను లాంఛనంగా కలిసిన మంత్రి రామానాయుడు పుష్పగుచ్చంతో సత్కరించి జ్ఞాపికను అందించారు. అనంతరం ఓహ్రకు మంత్రి రామానాయుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం రాష్ట్రానికి ఎంత అత్యవసరమో వివరించారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమయ్యేకొద్దీ ఏటా రూ.10వేల కోట్లమేర నష్టం వాటిల్లుతుందని వివరించారు. పంట ఆయకట్టు నష్టం రూ.3 వేల కోట్లు, జల విద్యుదుత్పత్తి లేకపోవడంవల్ల రూ.3వేల కోట్లు, వరద సమయంలో గోదావరి జిల్లాల పంట నష్టం రూ.2వేల కోట్లు, ప్రాజెక్టు అంచనా విలువ పెరగడం వల్ల రూ.2వేల కోట్లు.. మొత్తంగా ఐదేళ్లలో రూ.50వేల కోట్లమేర నష్టం వాటిల్లినట్టు సీడబ్ల్యూసీ చైర్మన్‌కు మంత్రి రామానాయుడు వివరించారు. త్వరితగతిన ప్రాజెక్టు పూర్తి చేయగలిగితే ఈ నష్టాన్ని కొంతమేర నివారించవచ్చని మంత్రి వివరించారు. త్వరితగతిన పాజెక్టు పూర్తి చేస్తే రాష్ట్రానికి దేశానికీ బహుళ ప్రయోజనాలు కలుగుతాయన్నారు. మంత్రి రామానాయుడి వెంట జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్, సలహాదారు వెంకటేశ్వరరావు ఉన్నారు.
సీఎం కృషికి నిదర్శనం:
కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన ప్రాధాన్యం చంద్రబాబు కృషేనని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. కేంద్ర బడ్జెట్‌పై ఆయన మాట్లాడుతూ రాష్ట్ర రాజధానికి రూ.15 వేల కోట్ల నిధులు కేటాయింపుతోపాటు పార్లమెంట్ సాక్షిగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యేందుకు ఎన్డీఏ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇవ్వడంపట్ల హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా విభజన చట్టంలోని అంశానికి సంబంధించి రాష్ట్రంలో వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలోని ఏడు నియోజకవర్గాలతోపాటు ప్రకాశం జిల్లాకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామని చెప్పడం సంతోషమన్నారు. ఈ ప్రాధాన్యతల వెనుక చంద్రబాబు కృషి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలుగుజాతికి మంచిరోజులు వచ్చాయని మంత్రి వ్యాఖ్యానించారు. జగన్ ప్రభుత్వంలో రాష్ట్రానికి జరిగిన నష్టం.. రాష్ట్ర విభజన కన్నా ఎక్కువన్నారు. గత ప్రభుత్వంలో జగన్ పలుమార్లు ఢల్లీివెళ్లినా, 31మంది ఎంపీలున్నా కేంద్ర నిధులు తెచ్చుకోలేకపోవడం చేతగానితనమేనని మంత్రి రామానాయుడు ఎద్దేవా చేశారు.