- ఈ ప్రాంతాన్ని చంద్రబాబు మరింత అభివృద్ధి చేస్తారు
- గుడ్డనాయనిపల్లి మహిళలతో ముఖాముఖిలో భువనేశ్వరి
కుప్పం (చైతన్యరథం): ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళా పక్షపాతి అని ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. కుప్పం నియోజకవర్గంలోని గుడ్లనాయనపల్లి గ్రామంలో బుధవారం మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో భువనేశ్వరి మాట్లాడారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను అందించారన్నారు. జగన్ సీఎం అయ్యాక ఆ పథకాలన్నింటినీ రద్దు చేసి మహిళలను వేధించాడన్నారు. కుప్పం ప్రజల ఉత్సాహం, గౌరవం చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పార్టీకోసం మీరు చూపిస్తున్న అభిమానం చూసి నాకు ఆనందంగా ఉంది. దుర్మార్గపు పాలన నుండి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు 2024 ఎన్నికల్లో మహిళలు నడుం బిగించారు..ఆ స్ఫూర్తి నేడు స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రబాబును 53రోజులు వైసీపీ ప్రభుత్వం అక్రమంగా జైల్లో నిర్బంధిస్తే రాష్ట్రవ్యాప్తంగా మహిళలు రోడ్లమీదకు వచ్చి పోరాడారు… గతంలో ఎన్నడూ లేని విధంగా దేశవ్యాప్తంగా చంద్రబాబుకోసం ప్రజలు రోడ్లమీదకు వచ్చారు.
తెలుగు ప్రజల రుణం తీర్చుకోలేనిది…మీరు మా కుటుంబంపై చూపించే ప్రేమకు మేం ఇచ్చినా రుణం తీరదు. చంద్రబాబు తన చివరి నిమిషం వరకు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కష్టపడేందుకు సిద్ధంగా ఉన్నారు. రానున్న కాలంలో కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు ప్రకటించిన ప్రత్యేక మ్యానిఫెస్టోలోని అంశాలన్నింటినీ అమలు చేస్తారు. ఇప్పటికే కుప్పం ప్రాంతంలో కేంద్రీయ విద్యాలయాన్ని తెచ్చేందుకు చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేశారు..ఇక్కడితో ఆగకుండా ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో టీడీపీ కార్యకర్తలను అతి కిరాతకంగా వేధించారు…అక్రమ కేసులు బనాయించారు. ఒక్కొక్కరిపై 10 నుండి 30 కేసులు బనాయించి కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారు. పార్టీని నిలబెట్టేందుకు కష్టపడిన ప్రతి కార్యకర్తకు తెలుగుదేశంపార్టీ నిత్యం అండగా నిలుస్తుంది. కూటమి పాలనలో రాష్ట్ర సుభిక్షంగా ఉంటుంది…రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉంటారని భువనేశ్వరి అన్నారు.