- విసిరింది మాత్రం సతీష్ అట
- పోలీసుల అదుపులో నలుగురు?
- క్వార్టర్ ఇచ్చారు, కూలి ఇవ్వలేదు
- కోపంతో రాయి విసిరానంటున్న సతీష్?
- మా పిల్లలను అన్యాయంగా నిర్బంధించారు
- పోలీసులపై వడ్డెర కాలనీ వాసుల ఆగ్రహం
- ఆత్మహత్యలు చేసుకుంటామంటూ ఆందోళనలు..
- డామిట్.. కథ అడ్డం తిరుగుతోందా?
అమరావతి (చైతన్య రథం): సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రిపై రాయిపడి నాలుగు రోజులవుతున్నా గాయపర్చిన రాయి జాడ కనుక్కోలేకపోయారు పోలీసులు. సంఘటన జరిగిన ప్రదేశంలో గాయపర్చిన రాయినే కనుక్కోలేకపోతే `పెను ప్రమాదాల నుంచి ముఖ్య వ్యక్తులకు ఎలా రక్షణ ఇస్తారన్న ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. పోలీస్ అసమర్థతపై ఆదినుంచీ అపనమ్మకాలు ప్రబలుతున్న నేపథ్యంలో `ముఖ్యమంత్రిపై రాయి దర్యాప్తును సజావుగా ముందుకు నడిపించగలరా? కేసు నిగ్గు తేల్చగలరా? అన్న సందిగ్ధం రాష్ట్ర ప్రజల్లో ముసురుకుంటోంది. ‘మరేదైనా సాధారణ కేసైతే సమస్యను సాగదీయకుండా పరిష్కరించేవాళ్లం. ఇది ముఖ్యమంత్రికి సంబంధించిన కేసు. దర్యాప్తులో లోతైన వ్యవహాలు చాలా ఉంటాయి. ఆషామాషీగా తీసుకోలేం’ అంటూ కిందిస్థాయి పోలీస్ అధికారి ఒకరు వ్యాఖ్యానించడాన్ని చూస్తే, దర్యాప్తు వ్యవస్థ ఎంత వత్తిడికి గురవుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలావుంటే `మంగళవారంనాటి పరిణామాల్లో నలుగురు కుర్రాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్‌పైకి రాయి విసిరిన ఆకతాయిగా అనుమానిస్తూ అజిత్‌సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్, అతని వెంటవున్న ఆకాష్, దుర్గారావు, చిన్న అనే ముగ్గురు అనుమానితులను సిట్ దుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ముఖ్యమంత్రి పైకి రాయి ఎందుకు విసిరారన్న ప్రశ్నకు సతీష్ విస్మయకర సమాధానాన్ని ఇచ్చినట్టు చెప్తున్నారు. ‘ముఖ్యమంతి సభకు హాజరైతే క్వార్టర్ మందు, బిర్యానీ, 350 కూలీ ఇస్తామన్నారు. కూలి మాట్లాడిన నాయకులు మందు పోశారు, బిర్యానీ ప్యాకెట్ ఇచ్చారుగానీ, కూలి పగ్గొట్టారు. పొద్దంతా తిప్పించుకుని డబ్బు ఎగ్గొట్టే సరికి కడుపుమండిరది. దీనంతటికీ కారణం జగన్ కనుక `రాయి విసిరాను’ అంటూ సతీష్ విస్మయకర సమాచారం బయటపెట్టినట్టు తెలుస్తోంది. `ఫుట్‌పాత్‌మీద వేసే టైల్స్ పెంకు (చిల్ల పెంకు) విసిరానని సతీష్ సమాచారమిచ్చినట్టు పోలీస్ వర్గాలే లీకులిస్తున్నాయి. దీంతో `గులకరాయి ప్లేస్‌లోకి టైల్స్ పెంకు వచ్చినా.. సతీష్ చెప్పింది నిజమో కాదో నిర్థారించుకునే పనిలో పడ్డారు పోలీసులు. ఉద్దేశపూర్వకంగానే జగన్‌పై విసరడానికి టైల్స్ పెంకును జేబులో పెట్టుకుని వచ్చాడని, అకస్మాత్తుగా దాడి చేశాడనే పోలీస్ వర్గాలూ నమ్ముతున్నాయి.
డామిట్.. కథ అడ్డం తిరిగిందా?
సీఎం జగన్‌పై రాయి విసిరిన కేసులో తమవారిని అక్రమంగా నిర్బంధించారంటూ విజయవాడ వడ్డెరకాలనీ వాసులు ఆందోళనలతో రోడ్డెక్కారు. పోలీస్ తీరును నిరసిస్తూ డాబాకొట్ల సెంటర్లో రాస్తారోకో చేపట్టడం `నడుస్తున్న డ్రామాకు భంగం కలిగించే అంశమే. రూ.200 ఇస్తామని చెప్పి జగన్ రోడ్ షోకు పిల్లలను తీసుకెళ్లారని, ఇస్తామన్న డబ్బులు ఇవ్వకుండా తప్పుడు కేసులు బనాయించేందుకు ప్రయత్నిస్తున్నారని సతీష్, మిగిలిన కుర్రాళ్ల బంధువులు ఆరోపిస్తున్నారు. పైగా `తమ పిల్లలు ఎక్కడున్నారో కూడా పోలీసులు చెప్పడం లేదన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎంపై రాయి దాడి జరిగిన సమయంలో తమవారు ఆ ప్రాంతంలో లేకపోయినా తమ పిల్లలను మంగళవారం తెల్లవారుజామున పోలీసులు తీసుకెళ్లారని కుర్రాళ్ల బంధువులు చెప్తున్నారు. అక్రమంగా కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే విడుదల చేయకపోతే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యలకు పాల్పడతామని హెచ్చరించడం.. కాలనీలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తోంది.
ఏకిపారేస్తున్న విపక్షాలు!
‘గులకరాయి కథ’ పక్కా డ్రామా అని తేలిపోవడంతో `వైసీపీని విపక్షాలు ఏకిపారేస్తున్నాయి. రోజుకో కొత్త ప్రశ్నను లేవనెత్తుతూ దుమ్ము దులపడమే కాకుండా `మరుగున పడిన ‘కోతి కత్తి’ డ్రామాను తెరపైకి తెస్తుండటంతో.. వైసీపీకి మింగుడుపడటం లేదు. ‘జగన్ గులకరాయి డ్రామా ప్రజలకు తెలిసిపోయింది. సీఎంని గులకరాయితో ఎవరైనా చంపగలరా? నాడు కోడికత్తి డ్రామా ఆడారు. నేడు గులకరాయి డ్రామా ఆడుతున్నారు. దాడి జరిగిన రోజు ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా వైసీపీ నేతలు రోడ్లపై ధర్నాలెలా చేస్తారు? చట్టం, రాజ్యాంగం అంటే వైసీపీ నేతలకు గౌరవం ఉండదా? వాళ్లు ధర్నా చేస్తుంటే విజయవాడ ఏసీపీ, సీఐ కళ్లప్పగించి చూస్తున్నారు. అలాంటి అధికారులకు ఎన్నికలు సక్రమంగా నిర్వహించే సామర్ద్యం ఉందా?’ అంటూ విపక్షాలు దాడి చేస్తుండటంతో.. వైసీపీ సంకట స్థితిని ఎదుర్కొంటోంది.
ఇస్తానన్న రూ.350 ఇవ్వకపోతే మండదా అక్కా, మండదా చెల్లీ! : లోకేష్ సెటైర్లు
సీఎం జగన్‌పై ఎక్స్ వేదికగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్ పై విజయవాడలో రాయితో దాడి జరిగిన సంగతి తెలిసిందే. అయితే, సతీష్ అనే యువకుడు సీఎం జగన్ పై రాయి విసిరినట్టుగా మీడియాలో ప్రసారమవుతోంది. క్వార్టర్ బాటిల్, రూ.350 డబ్బులు ఇస్తామని వైసీపీ నేతలు తనను సీఎం సభకు తీసుకువచ్చారని, క్వార్టర్ బాటిల్ ఇచ్చి, డబ్బులు ఇవ్వలేదని ఆ యువకుడు పోలీసులకు చెప్పినట్టు కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయి. సీఎం జగన్ సోమవారం గుడివాడ సభలో మండదా అక్కా, మండదా చెల్లీ, మండదా తమ్ముడూ, మండదా అన్నా అంటూ తన ట్రేడ్ మార్క్ ప్రసంగం చేశారు. ఈ నేపథ్యంలో, ఆ ప్రసంగం స్టైల్‌లోనే లోకేష్ సెటైర్లు వేశారు. ఇది క్వార్టర్ మేటర్… ఇస్తానన్న రూ.350 ఇవ్వకపోతే మండదా అక్కా… మండదా చెల్లీ, మండదా తమ్ముడూ, మండదా అన్నా…! అంటూ ఎద్దేవా చేశారు.
‘నా’ అన్నాడంటే నాశనమే…
జగన్ ఎవరినైనా ‘నా’ అన్నాడంటే వారిని నాశనం చేస్తాడని అర్థమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. అధికారమే పరమావధిగా సాగుతున్న జగనాసుర రక్తచరిత్రలో తన, మన అనే తేడా లేదు. సానుభూతితో సీఎం సీటు దక్కించుకోవాలని బాబాయ్‌ని లేపేశాడు. అదే సమయంలో కోడికత్తి డ్రామాతో దళితులను వేధించాడు. తీవ్రమైన ప్రజావ్యతిరేకతలో ఓటమి ఖాయమైపోవడంతో గులకరాయి డ్రామాకి బీసీ బిడ్డలను బలి చేయాలని చూస్తున్నాడు. జగన్ ‘నా’ అన్నాడంటే నాశనం చేసేస్తాడని అర్థం. నా ఎస్సీలు అన్నాడు, వందలాది మందిని బలిచ్చాడు. నా బీసీలు అన్నాడు, వేలమంది బలైపోయారు. ఈ జగన్ నాటకానికి జనమే చరమగీతం పాడుతారని లోకేష్ స్పష్టం చేశారు.