- గులకరాయి డ్రామాలో పోలీసులు అభాసుపాలు
- సాక్షి తప్పుడు కథనాలనే దర్యాప్తులో అనుసరిస్తున్న పోలీసులు
- సంచలనాత్మక కేసుగా చిత్రీకరించేందుకు యత్నం
- అమాయకులలైన వడ్డెర బిడ్డలను ఇరికించే కుట్ర
అమరావతి(చైతన్యరథం): గులకరాయి డ్రామా హత్యాయత్నం కాదని.. అంతా జగన్నాటకమే అని.. సాక్షి మీడియాలో వస్తున్న కల్పిత కథనాలనే పోలీసులు అనుసరిస్తూ, దీనిని సంచలనాత్మక కేసుగా చిత్రీకరించేందుకు యత్నిస్తున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మండిపడ్డారు. మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ విషయంలో టీడీపీ అడుగుతున్న ప్రశ్నలకు పోలీసులు సమాధానం ఇవ్వకుండా పారిపోయారన్నారు. సంచలనాత్మక కేసును ఛేదించామంటున్న విజయవాడ పోలీసు కమిషనర్.. ఈ అంశంపై మీడియా ముందుకు రాకుండా, ఒక ప్రకటన విడుదల చేయటంతోనే పోలీసుల దర్యాప్తులోని డొల్లతనం తెలిసిపోతోందని వర్ల ఎద్దేవా చేశారు. నాలుగు రోజుల్లో సంచలనాత్మక వార్తలు వింటారని.. ఎన్నికల ప్రక్రియలో పెనుమార్పులు ఉంటాయని పాత నేరస్థుడు అవుతు శ్రీధర్‌రెడ్డి చెప్పినట్లే ముఖ్యమంత్రి జగన్‌పై హత్యాయత్నం అని పోలీసులు చెబుతున్నట్లుగా.. ఎవరో దుండగులు రాయి విసిరితే.. ఎందుకు పోలీసులు శ్రీధర్ రెడ్డిని కస్టడీలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. శ్రీధర్ రెడ్డిని పోలీసులు ఎందుకు విచారించలేదో జవాబు చెప్పాలన్నారు.
అమాయకుడైన వడ్డెర బిడ్డకు రిమాండ్
న్యాయమూర్తి ఈ కేసులో అమాయకుడైన వడ్డెర బిడ్డకు రిమాండ్ ఇవ్వకుండా తిరస్కరిస్తే బాగుండేదన్నారు. వడ్డెర బిడ్డకు ఇచ్చిన రిమాండ్‌పై అప్పీలు చేయాల్సిందిగా అతని తల్లిండ్రులకు సూచించినట్లు వర్ల రామయ్య తెలిపారు. ఇది హత్యాయత్నం నేరం కాదని, ముఖ్యమంత్రిని చంపాలన్న ఉద్దేశం ఎవరికీ లేదన్నారు. వారం రోజులుగా ఆడుతున్న గులకరాయి డ్రామా చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారని వర్ల అన్నారు.
ప్రెస్‌మీట్ ఎందుకు పెట్టలేదు
నేను అడిగిన ప్రశ్నలకు పోలీసులు ఎందుకు సమాధానం చెప్పటం లేదు? చిన్న, చిన్న కేసుల్లోనే ముద్దాయిలను ప్రెస్ ముందు ప్రవేశపెట్టే పోలీసులు ఇంతటి సంచలనాత్మక కేసును ఎందుకని ప్రెస్ ముందుకు తీసుకురాలేదు? చీకట్లో వచ్చిన రాయి ముఖ్యమంత్రికి తగిలి, పక్కన ఉన్న ఎమ్మెల్యేను గాయపరిచి ఎటో ఎగిరిపోయిందని చెప్పి అమాయకులను అరెస్ట్ చేసి విజయవాడ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో సంచలనాత్మక కేసుగా చిత్రీకరించేదుకు కుట్ర చేస్తున్నారని వర్ల రామయ్య మండిపడ్డారు.
భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిని ఒక రాయితో హత్య చేయడానికి ఒక ఆగంతకుడు ప్రయత్నిస్తే, అది నిజం అయితే, పెద్ద సంచలనాత్మక కేసు అవుతుంది. అటువంటి సంచలనాత్మకమైన కేసును యుక్తితో ఛేదించినప్పుడు పోలీస్ కమిషనర్ ప్రెస్‌మీట్ ఎందుకు పెట్టలేదు.? ప్రెస్‌మీట్‌లో మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేక దొంగచాటుగా ఒక ప్రకటన పంపించారా? ఆ ప్రకటన పంపడంలోనే పోలీసుల దర్యాప్తులోని డొల్లతనం బయటపడిరది. దర్యాప్తు తప్పులతడకగా ఉందని అర్థమయింది. సిమెంట్ రాయితో ముఖ్యమంత్రిపై దాడి చేశారని పోలీసులు చెబుతున్నదంతా కట్టుకథే అని స్పష్టం అవుతోందని వర్ల అన్నారు.
బొండా ఉమా బ్యాచ్ అంటూ కొత్త డ్రామాలు
ఏదో రకంగా ముఖ్యమంత్రిని సమాధానపరిచేందుకు పోలీసు అధికారులు ఒక అమాయకుడిని బలిచేశారు. దానికి రాజకీయ రంగు పులిమారు. టీడీపీ నాయకుడు బొండా ఉమా బ్యాచ్ స్కెచ్ అని పదే పదే సాక్షి మీడియాలో వస్తుంటే దానినే పోలీసులు అనుసరిస్తారా? బొండా ఉమా బ్యాచ్‌కు ముఖ్యమంత్రి పర్యటనలో కరెంట్ పోతుందని ఎలా తెలుస్తుంది. బొండా ఉమాను ఇబ్బంది పెట్టాలనుకుంటే ఇంకేదైనా తప్పుడు కేసు సృష్టించండి.. ఇలా బీసీ బిడ్డలను బలిచేయొద్దు. చీకట్లో ఎవరైనా రాయి తీసుకుని అంతదూరం నుండి కొట్టగలరా? ఆ విధంగా కొట్టాలంటే మరో ఏకలవ్యుడు అయ్యి ఉండాలి. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని హత్య చేయాలనుకునేవాడికి రాయిని మించిన ఆయుధాలు దొరకవా? చిన్న గులకరాయితో ఒక ముఖ్యమంత్రిని చంపడానికి ఎవరౖైెనా ప్లాన్ చేస్తారా? అధికారం దాహం కోసం అమాయకులపై హత్యాయత్నం కేసు పెట్టి బలిచేయడం కాకుంటే ఈ నాటకాలన్నీ ఏమిటని వర్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసు వ్యవస్థ అభాసుపాలు
ఈ కేసులో దర్యాప్తు సాగుతున్న విధానం పోలీసు వ్యవస్థనే అభాసుపాలు చేస్తోంది. అయినా దర్యాప్తు పోలీసులు చేస్తున్నట్లుగా కనిపించడం లేదు. అంతా సాక్షి మీడియా వాళ్లే చెబుతున్నారు. వాళ్లే దర్యాప్తు చేస్తున్నట్లున్నారు. పక్కా ప్రణాళికతోనే సీఎం జగన్‌పై హత్యాయత్నం అని సాక్షి చెబుతోంది. సీఎం మాత్రం ఆ విషయం ఎక్కడా చెప్పలేదు. పోలీసులు విడుదల చేసిన ప్రకటనలో రాలేదు. మరోపక్క ఇది ముమ్మాటికీ హత్యాయత్నమేనని సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నాడు. అలా చెప్పటానికి ఆయన వద్ద ఉన్న ఆధారాలేమిటి? పోలీస్ కమిషనర్ ఏమైనా సజ్జల చెవిలో చెప్పారా అని వర్ల ఎద్దేవా చేశారు.
చంపాలనే ఉద్దేశంతో సున్నితమైన ప్రదేశంలో రాయితో కొట్టాలనుకుంటే చిమ్మచీకట్లో ఎందుకు ప్రయత్నిస్తాడు. ముఖ్యమంత్రులను రాళ్లతో చంపిన ఘటన ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. పోలీసులు వ్యవస్థ గౌరవాన్ని దిగజార్చే చర్యలకు పాల్పడుతున్నారు. ఈ కేసు నిలబడదని వారికి తెలియదా? జగన్ కోసం పనిచేస్తే పోలీసులు తరువాత ఇబ్బందులు పడతారు. ఒకప్పుడు భారతదేశంలోనే నెంబర్ 1 గా ఉన్న ఏపీ పోలీస్ వ్యవస్థను దిగజారుస్తున్నారని వర్ల ధ్వజమెత్తారు.
పక్కా డ్రామా అని తెలిసిపోయింది
ఇది జగన్ ఆడిన జగన్నాటకం, పక్కా డ్రామా అని రాష్ట్ర ప్రజలకు అర్థమయింది. ప్రజలు అంత అమాయకులు కాదు. నాడు కొడికత్తి, గొడ్డలి వేటు డ్రామాలతో అధికారం చేపట్టి, మళ్లీ మరోసారి జనాన్ని మోసం చేయాలని చూస్తే నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేదు. వచ్చే ఎన్నికల్లో డ్రామాల పార్టీకి బుద్ధి చెప్పి భూస్థాపితం చేయడం ఖాయమని వర్ల స్పష్టం చేశారు.