- ఎవ్వరైనా రూ.2 వేల కోట్ల ఆస్తిని రూ.12 కోట్లకు అమ్ముతారా?
- రూ.2,689 కోట్ల షేర్ విలువను రూ.494 కోట్లకే ఇచ్చేస్తారా?
- జగన్, విజయసాయి ఇళ్లు అలా అమ్ముతారా..?
- అమ్మితే.. కొనడానికి నేను రెడీ
- గన్నుపెట్టి బెదిరించి లాక్కుంటేనే అలా జరిగింది..
- గొంతుమీద కత్తిపెట్టి సీ పోర్టులో వాటా కొట్టేశారు
- రూ.494 కోట్లకే 41శాతం వాటా కొట్టేయడం మాఫియా పనే?
- ఏ1గా జగన్‌నూ చేర్చి.. అరెస్టులతో వాస్తవాలు బయటపెట్టాలి
అమరావతి (చైతన్యరథం): కేవీరావు గొంతుమీద కత్తిపెట్టి రూ. 2వేల కోట్ల విలువైన కాకినాడ సెజ్ భూములను రూ.12 కోట్లకు, కాకినాడ సీపోర్టులో రూ. 2,689 కోట్ల విలువైన షేర్లను రూ. 494 కోట్లకే కొట్టేసిన వైసీపీ దోపిడీ ముఠా, వారి వెనుకున్న జగన్‌రెడ్డిని తక్షణం అరెస్ట్ చేసి విచారించి వాస్తవాలను బయటపెట్టాలని ఏపీ స్టేట్ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణా రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగన్‌రెడ్డి జేబు దొంగని అనాడే చెప్పామని, నేడు సీఐడీ ఛార్జ్‌షీట్ ఓపెన్ చేసిన వైనం చూస్తే గజదొంగని అర్థమవుతుందన్నారు. కాకినాడ సెజ్ విస్తీర్ణం 8,320 ఎకరాల్లో ఉందని, 2012 ఫిబ్రవరి 28న భారత ప్రభుత్వం కాకినాడ సెజ్‌కు ఈ భూములను కేటాయించిందన్నారు. శ్రీ సిటీ తరువాత ఏపీలో కాకినాడే సెజే పెద్దదని వివరించారు. ఈ సెజ్‌పై జగన్ రెడ్డి కళ్లు పడ్డాయన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ముఠా వైవీ సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి, లిక్కర్ స్కాంలో జైల్లో ఉండి వచ్చిన శరత్ రెడ్డి, విజయసాయిరెడ్డిలతో బెదిరింపులకు దిగారన్నారు. దీంతో కేవీరావు ఫిర్యాదుపై వారి పేర్లను ఛార్జ్ షీట్ లో పెట్టారన్నారు. కత్తులు, గన్నులు పెట్టి అప్పుడే షేర్లు, భూములు కొట్టేసేందుకు కేవీరావును బెదిరించారన్నారు. భారత దేశంలో ఎక్కడైనా రూ. 29 వేలకే ఒక ఎకరా భూమి దొరుకుతుందా? అని ప్రశ్నించారు.
జగన్ రెడ్డి బెంగళూరులోని తన ప్యాలెస్ లేదా తాడేపల్లి ప్యాలెస్‌ను కోటిరూపాయలకు నాకు ఇస్తాడా? విజయసాయిరెడ్డికి హైదరాబాద్ లో ఒకటిన్న ఎకరాల్లో ఇళ్లు ఉంది దాన్ని 60 వేలకు నాకు అమ్ముతాడా? బెదిరించి కేవీరావు వద్ద లాక్కోకుంటేనే ఇలా జరుగుతుందన్నారు. 4 వేల ఎకరాలను ఎవరైనా రూ. 12 కోట్లకు ఇస్తారా? 12.10.2020 లో అగ్రిమెంట్ చేసుకుని 31.03.2021 లో చెక్కు పేమెంట్ ఇచ్చారన్నారు. ఎవరైనా ఆరు నెలల తరువాత పేమెంట్ ఇస్తారా? సాక్షిలో ఇష్టం వచ్చినట్లు రాయడం విడ్డూరంగా ఉందన్నారు. ఆరు నెలల తరువాత చెక్ పేమెంట్ ఇవ్వడానికి తాము సిద్ధమని, ఇలానే మీ ఆస్తులు కూడా రాసి తనకు రాసివ్వాలని సవాలు చేశారు. ఏదైనా కంపెనీ డబ్బులు సంపాదిస్తుందంటే చాలు ఆ కంపెనీని కైవసం చేసుకోవడానికి వైసీపీ నేతలు యత్నిస్తుంటారన్నారు. యజమానులను ఇంటికి పిలిచి బెదిరిస్తారన్నారు. విక్రాంత్ రెడ్డిలాంటి వ్యక్తులను పెట్టుకుని జగన్ రెడ్డి ఈ దారుణాలకు పాల్పడుతుంటాడన్నారు. అందుకే కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి భయపడి పారిపోయాయన్నారు.
ప్రముఖ కన్సల్టెంట్ రోహిత్ చతుర్వేది నివేదిక ప్రకారం కాకినాడ సెజ్ భూముల వ్యాల్యుయేష్ చూస్తే కళ్లు జిగేల్ మంటాయన్నారు. కాకినాడ సెజ్‌లో ఒక్కొక్క ఎకరా రేటు రూ. 50 లక్షల 20 వేల రూపాయల ధర ఉంటుందని రోహిత్ చతుర్వేది పేర్కొన్నారని, దీనిని బట్టి నాలుగువేల ఎకరాల రేటు ఎంతుంటుందో ప్రజలే అర్థం చేసుకోవాలన్నారు. దాదాపు రూ. 4వేల 135 కోట్లు ఉంటుందని, అందులో కేవీరావు వాటా రూ. 2 వేల కోట్లపైనే ఉంటుందన్నారు. రూ. 2 వేల కోట్ల ఆస్తులను రూ. 12 కోట్లు కొట్టేయడం బెదిరించి లాక్కోవడం కాక ఏమంటారని ప్రశ్నించారు. ఈ దోపిడీ వల్ల వైసీపీ ముఠా రూ. 1,900 కోట్లకు పైగా లాభం గుంజేసిందన్నారు. జగన్ రెడ్డి ఆజ్ఞతోనే విజయసాయిరెడ్డి, శరత్ రెడ్డి, విక్రాంత్ రెడ్డి ఈ దుర్మార్గాలకు తెరలేపారన్నారు. కాకినాడలో డీప్ సీ పోర్టు, కళింగా ఇంటర్ నేషనల్ పోర్టులు ఉన్నాయన్నారు. కళింగలో కూడా కేవీరావుకు షేర్లు ఉన్నాయన్నారు. కాకినాడ సీ పోర్టు ఒక్కదాంట్లోనే ఈ సంవత్సరం సగటు ఆదాయం రూ. 451 కోట్ల నుండి రూ. 530 కోట్ల మధ్య ఉందన్నారు. గతంలో రూ. 290 కోట్ల నుండి 330 కోట్లు సంపాదించిందన్నారు. ఇంత లాభాల్లో ఉన్న కంపెనీని ఎవరైనా తక్కువ రేటుకు అమ్మకుంటారా? అని ప్రశ్నించారు.
కాకినాడ డీప్ సీ పోర్టును కైవసం చేసుకోవడానికి గత ప్రభుత్వం నుండి ఎటువంటి సహకారం అందించకుండా శ్రీకాంత్ రెడ్డి, శరత్ రెడ్డిని జగన్ రెడ్డి రంగంలో దింపారన్నారు. పీకెఎఫ్ శ్రీధరన్ సంతానం, కోల్ ఇండియా అనే ఆడిట్ సంస్థలతో 28 రోజుల పాటు అక్రమ ఆడిట్ చేయించారన్నారు. దాని ప్రకారం ప్రభుత్వానికి రూ. 1000 కోట్లు కట్టాలని కేవీరావును బెదిరించారున్నారు. ఒకే కంపెనీని ఇద్దరు కన్సెల్టెంట్లతో ఆడిట్ చేసి ఒత్తిడి తెచ్చారన్నారు. రూ. 1000 కోట్లు కట్టకపోతే కేసులు పెడతామని బెదిరించి సీ పోర్టులో వాటాల బదిలీకి డిమాండ్ చేశారన్నారు. లేని పక్షంలో పోర్టును స్వాధీనం చేసుకుంటామని భయపెట్టారన్నారు. షిప్పింగ్ ఏజెంట్లను కూడా భయపెట్టారున్నారు. చివరకు కేవీరావు గొంతు మీద కత్తి పెట్టి 41% శాతం వాటాను కొట్టేశారన్నారు. షేర్లు వైసీపీ ముఠాకు బదిలీ అయిన వెంటనే పరిస్థితి మారిపోయిందన్నారు. ప్రభుత్వానికి రూ.1000 కోట్లు కట్టాలని చెప్పిన జరిమానా కాస్తా రూ. 8 కోట్లకు తగ్గిపోయిందన్నారు. అసలు చెన్నై నుండి ఆడిటర్లు ఇక్కడకు వచ్చి ఆడిట్ చేయడంలోనే కుట్ర అర్థమై పోతుందన్నారు. రాష్ట్రంలో ఆడిటర్లు లేరా, లేరనుకుంటే ప్రభుత్వ యంత్రాంగమే ఆడిట్ చేయవచ్చు కదా అని ప్రశ్నించారు.
ఆసలు ఆర్థిక శాఖలో ఆడిటర్లు ఏమయ్యారన్నారు. గతంలో విజయసాయిరెడ్డి చెన్నైలో ఛార్టర్డ్ అకౌంటెంట్‌గా ఉండేవాడన్నారు. సాయిరెడ్డి దింపిన సంస్థతోనే ఈ మోసాలకు తెరతీశాడన్నారు. మంత్రాంగం నడిపి రూ. 2,689 కోట్ల షేర్ విలువను రూ. 494 కోట్లకే పరిమితం చేసి కొట్టేశారన్నారు. వైసీపీ నేతలు పెట్టిన 494 కోట్ల పెట్టుబడిలో గత సంవత్సరమే రూ. 380 కోట్లు వారికి సీ పోర్టు నుండి డివిడెండ్ల సొమ్ము ఐసీడీ డిపాజిట్ల రూపంలో వారికి చేరిందన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో ఏ1 గా ఉండాల్సింది విక్రాంత్ రెడ్డి కాదని, జగన్ రెడ్డి అన్నారు. కర్త కర్మ క్రియ అన్ని కూడా జగన్ రెడ్టేనన్నారు. డీజీపీ, సీఐడీ దీన్ని గుర్తించి జగన్ రెడ్డిని ఏ1 గా నమోదు చేయాలన్నారు. ఈ కుట్ర జరిగింది తాడేపల్లి ప్యాలెస్ లోనేనని స్పష్ట మవుతోందన్నారు. వెంటనే డీజీపీ రంగంలోకి దిగి జనగ్ రెడ్డి నిజస్వరూపం బయటపెట్టి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. గత రాక్ష పాలనను చూసి కంపెనీలు ఏపీలో పెట్టుబడి పెట్టాలంటే వణికిపోతున్నాయన్నారు. నేడు వ్యాపార వేత్తల కాళ్లు పట్టుకుని బ్రతిమిలాడే పరిస్థితి దాపురించిందన్నారు. కేవీరావు నాడు నోరు తెరిస్తే భూమిమీద లేకుండా చేసేవారన్నారు. సాక్షిలో వచ్చిన వార్తలు చూస్తే విజయసాయిరెడ్డి మాటలు నీచులు నీజాయితీ సూక్తులు చెప్పినట్లుగా ఉంటాయన్నారు. అమెరికాలో ఉన్న వ్యక్తుల పేర్ల మీద కేవీరావుకు సంబంధించిన మిగిలిన షేర్లు ఉండడం వల్ల వాటినైనా ఉంచారన్నారు. లేదంటే ఆ సీపోర్టు ముందే కేవీరావును వాచ్‌మేన్‌గా నిలబెట్టేవారన్నారు. షేర్ ట్రాన్ఫర్స్ చట్ట విరుద్ధమని యాక్సిస్ బ్యాంకు నోటీసు ఇచ్చినప్పటికీ లెక్కచేయకుండా షేర్ల బదిలీలు జరిగిపోయాయన్నారు.