- కుప్పానికి నీళ్లిస్తున్నామంటూ జగన్నాటకం
- దీనికోసం రెండు జిల్లాలను ఎండగట్టారు
- నీళ్లడిగిన రైతులపై కేసులు పెట్టారు
- జగన్ హడావుడి కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమే
- చంద్రబాబు హయాంలో కుప్పం కాలువ పనులు 87 శాతం పూర్తి
- మిగిలిన 13 శాతం పూర్తిచేసేందుకు జగన్ ఆపసోపాలు
అమరావతి: కుప్పం సభలో జగన్‌రెడ్డి అబద్ధాలు, అసత్యాలతో బడాయి ప్రకటనలు చేశాడని టీడీపీ నాయకుడు, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో దేవినేని మాట్లాడుతూ జగన్ చేసిందేమీ లేకపోయినా కుప్పానికి నీళ్లు తెచ్చానని గొప్పలు చెప్పుకుంటున్నాడని ధ్వజమెత్తారు. రెండు జిల్లాలను ఎండగట్టి, రైతులను ఇబ్బందులకు గురిచేసి, వారిపై కేసులు పెట్టిమరీ కొద్దిగా నీళ్లుతెచ్చి డబ్బా కొట్టుకుంటున్నాడు. 672 కి.మీ. హంద్రీ నీవా కాలువ పనులు చేశానని సిగ్గు లేకుండా జగన్ రెడ్డి ఎలా మాట్లాడతాడు? కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు చంద్రబాబు హయాంలో 87 శాతం పూర్తి చేస్తే మిగిలిన 13 శాతం పెండిరగ్ పనులు చేయడానికి జగన్‌కు 57 నెలల కాలం పట్టింది. కుప్పం బ్రాంచ్ కెనాల్ మీద కేవలం రూ.30 కోట్లు పనులు చేసి డబ్బా కబుర్లు చెబుతున్నాడు. అదే టీడీపీ హయాంలో రూ.3వేల కోట్లు ఖర్చు చేసి అవుకు టన్నెల్ పనులు పూర్తి చేసి పులివెందులకు నీళ్లిస్తానన్న హామీని చంద్రబాబు నిలబెట్టుకున్నారని దేవినేని గుర్తు చేశారు.
ఎన్నికల ముందు హడావుడి
ఎన్నికల ముందు కుప్పం నియోజవర్గానికి నీళ్లిచ్చామని హడావుడి చేసి, చంద్రబాబునాయుడుని తిట్టాలనే దురుద్దేశ్యంతో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు చివరి వరకూ జగన్ పక్కనపెట్టాడు. కుప్పం బ్రాంచ్ కెనాల్లో మూడు లిఫ్ట్‌ల్లో రెండు లిఫ్ట్ ల పనులు టీడీపీ హయాంలో పూర్తయితే, మూడో లిఫ్ట్ పనులు చేయడానికి జగన్‌కు 57 పనులు పట్టింది.
టీడీపీ హయాంలో హంద్రీనీవా కాలువల్లో 45 టీఎంసీల నీళ్లు పారించాము. టీడీపీ హయాంలో తొలుత కర్నూలు రైతాంగానికి నీరందించాక అనంతపురం జిల్లాకు నీరిచ్చాం. కానీ నేడు జగన్ రెడ్డి 21 రోజులు ఆపసోపాలు పడి కర్నూలు, అనంతపురం జిల్లాలను ఎండగట్టి కుప్పం నియోజకవర్గానికి నీరు తెచ్చాడు. రైతులను ఇబ్బందులకు గురి చేసి, వారి మీద కేసులు పెట్టి, ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నారు. ఇంత చేసినా విడుదల చేసిన ఆ కొద్దిపాటి నీళ్లు రామకుప్పం మండలం దాటి ముందుకు వెళ్లలేదు. వచ్చిన కొద్దిపాటి నీళ్లు భూమిలో ఇంకిపోయాయి. మీ మోసాలను నమ్మడానికి జనం సిద్ధంగా లేరని దేవినేని స్పష్టం చేశారు.
జగన్ చేసిందేమీ లేదు
5 ఏళ్ల టీడీపీ హయాంలో రూ.68,293 కోట్లు ఖర్చు చేసి 62 ప్రాజెక్టులు చేపట్టి 23 ప్రాజెక్టులు పూర్తి చేసి 32 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించాం, 7 లక్షల ఎకరాల నూతన ఆయకట్టుకు నీళ్లిచ్చాం. ఈ ఐదేళ్లలో ఇరిగేషన్ రంగానికి జగన్‌రెడ్డి ప్రభుత్వం చేసిన మొత్తం ఖర్చు రూ.35,471 కోట్లు మాత్రమే. ఇందులో రూ.10,365 కోట్లు జీతభత్యాలకు, పెండిరగ్ బిల్లులకు మరో రూ.3వేల కోట్లు పోతే నికరంగా ప్రాజెక్టులకు పెట్టిన ఖర్చు రూ.22,106 కోట్లు మాత్రమే. సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీలకు పేర్లు మార్చుకోవడం తప్పించి జగన్ రెడ్డి చేసింది ఏమీ లేదు. ఉత్తరాంధ్రలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు. పోలవరం ప్రాజెక్టును గోదావరిలో ముంచేశారు. 72 శాతం పనులు పూర్తి చేస్తే జగన్ రెడ్డి పెండిరగ్ పనులు పూర్తి చేయలేకపోయాడు. పట్టిసీమ పంపులకు బూజు పట్టించారు. పురుషోత్తమపట్నం ప్రాజెక్టును గాలికి వదిలేశాడని దేవినేని విమర్శించారు.
2022-23లో పట్టిసీమ పంపులు ఆడిస్తే 110 టీఎంసీల నీళ్లు వచ్చేవి. ఆ పని చేస్తే చంద్రబాబుకు పేరొస్తుందని 50 టీఎంసీలు కూడా తీసుకోలేదు. పట్టిసీమ నుంచి కృష్ణాడెల్టాకు మొత్తం 110 టీఎంసీలు గోదావరి జలాలు తెప్పించి ఉంటే, ఆ మేరకు కృష్ణాజలాల్లో ఆదా అయిన నీటిని హంద్రీనీవా కాలువల ద్వారా కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు అందించేందుకు వీలయ్యేది. రాయలసీమను రత్నాల సీమను చేసేందుకు చంద్రబాబు హంద్రీనీవా పనులు పూర్తిచేస్తే, తానే చేశానని జగన్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నాడు. గాలేరునగరి సుజల స్రవంతి, తెలుగుగంగ పనులు గాలికి వదిలేశాడు. రాయలసీమ లిఫ్ట్ పనులు ఏమయ్యాయి? రాయలసీమ ప్రాజెక్టుల కోసం చంద్రబాబు ఐదేళ్లలో రూ. 12వేల కోట్లు ఖర్చు చేస్తే జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో కేవలం రూ.2వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశాడు. జగన్ రెడ్డికి దమ్ముంటే ఇరిగేషన్ మీద శ్వేతపత్రం విడుదల చేయాలని దేవినేని డిమాండ్ చేశారు.
తప్పుడు జీఓలు
చిత్తూరు జిల్లాలో గణేష్‌పురంలో పాలారు నదిపై రూ.214 కోట్లతో మూడు రిజర్వాయర్లు కడతానని జగన్ తప్పుడు మాటలు చెబుతున్నాడు. పక్కరాష్ట్రం తమిళనాడు సుప్రీంకోర్టులో వేసిన కేసు గురించి జగన్ ఎప్పుడైనా పట్టించుకున్నాడా? అటవీశాఖ అనుమతుల కోసం ప్రయత్నించాడా? చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో డ్రిప్ ఇరిగేషన్, ఇజ్రాయల్ టెక్నాలిజీ, బిందు సేద్యం వంటి వాటిని సమర్థవంతంగా అమలు చేశారు. 2018లో చంద్రబాబు కుప్పం అభివృద్ధికి రూ.1400 కోట్లు విడుదల చేస్తే జగన్ రెడ్డి ఆ పనుల్నింటినీ ఆపేశాడు. ద్రవిడ విశ్వవిద్యాలయం, మెడికల్ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులను అడిగితే తెలుస్తుంది ఎవరు అభివృద్ధి చేశారనేది. కుప్పం గురించి మాట్లాడే నైతిక అర్హత జగన్‌రెడ్డికి లేదని ఉమా అన్నారు.
జగన్ చరిత్ర ముగిసినట్లే
బాబాయ్ హత్య కేసులో అవినాష్ రెడ్డిని కాపాడుతున్న జగన్ హత్యా రాజకీయాల గురించి మాట్లాడం సిగ్గుచేటు. కోర్టులు కొట్టేసిన కేసుల గురించి సీఎం హోదాలో మాట్లాడటం హేయం. జగన్‌రెడ్డికి సీబీఐ, ఈడీ కేసుల్లో కనీసం ఆరేళ్లు శిక్ష పడుతుంది. శిక్షాకాలం పూర్తయ్యాక 6 ఏళ్లు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత జగన్ రెడ్డి కోల్పోతాడు. 2024 ఎన్నికల్లో ఓటమితో జగన్ రెడ్డి రాజకీయ చరిత్ర ముగిసిపోతుందని దేవినేని స్పష్టం చేశారు.