పాదయాత్రకు సంఘీభావం తెలిపి యువనేతకు కృతజ్ఞతలు
ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో విద్యనభ్యసించి వివిధ రంగాల్లో స్థిరపడిన 35 మంది పూర్వ విద్యార్థులు యువనేత నారా లోకేష్ ను కలిశారు. 151వ రోజు యువగళం పాదయాత్ర చేస్తున్న లోకేష్ ను నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం బంగారుపాలెం క్యాంప్ సైట్ లో ఆదివారం కలిసి సంఘీభావం తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలు, సాఫ్ట్ వేర్, వివిధ రంగాల్లో స్థిరపడిన వారిని లోకేష్ అభినందనలు తెలిపారు. పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ… తల్లిదండ్రులను కోల్పోయిన తమను ఎన్టీఆర్ మోడల్ స్కూలు అమ్మలా అక్కున చేర్చుకుందని తెలిపారు.
మంచి హాస్టల్ తో పాటు, కార్పొరేట్ స్థాయి విద్యను ఎన్టీఆర్ మోడల్ స్కూల్ తమకు అందించడంతో ఇప్పుడు జీవితంలో సెటిలయ్యామని అన్నారు. ఈరోజు మెరుగైన జీతాలు అందుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నామని తెలిపారు. ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో చదివే వారిలో 80 శాతం మంది ఐఐటీ, నీట్ లో ప్రవేశాలు పొందుతున్నారని చెప్పారు. మరికొందరు క్యాంపస్ సెలక్షన్లలో ఎంపికై విదేశాల్లో ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. భవిష్యత్ లో మరింత ఉన్నత స్థానానికి చేరుకొని, మీలాంటి మరికొందరికి చేయూత నందించాలని లోకేష్ పేర్కొన్నారు.