.చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణతో సహా పలువురి సంతాపం
హైదరాబాద్: ఎన్టీఆర్ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి (52) హఠాన్మరణం చెందారు. జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ఉమా మహేశ్వరి కన్నుమూశారు. కొంతకాలంగా ఉమామహేశ్వరి అనారోగ్యంతో బాధపడుతున్నారు. వార్త తెలిసిన వెంటనే ఉమామహేశ్వరి ఎన్టీఆర్ కుటుంబీకులు ఆమె నివాసానికి చేరుకున్నారు. ఇటీవలే ఉమామహేశ్వరి చిన్న కుమార్తె వివాహం జరిగింది. ఉమామహేశ్వరి మృతి వార్త తెలిసిన వెంటనే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. కుటుంబ సభ్యులు బాలకృష్ణ, రామకృష్ణ, సుహాసిని ఆమె నివాసానికి చేరుకున్నారు. విదేశాల్లో ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా, వారంతా హుటాహుటిన బయలుదేరారు. ఉమామహేశ్వరి అంత్యక్రియలు బుధవారం నిర్వహించనున్నట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి.
చంద్రబాబునాయుడు సంతాపం
ఎన్టీఆర్ చిన్నకుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఇటీవలే కుటుంబసభ్యులందరం కలసి ఆనందంగా గడిపామని, ఇంతలోనే ఇంతటి విషాదవార్త వినాల్సి రావడం బాధాకరమని ఆయన అన్నారు. ఎన్టీఆర్ క్రమశిక్షణను పుణికి పుచ్చుకున్న ఉమామహేశ్వరి ఎంతో హుందాగా, శాంతంగా ఉండేవారని అంటూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.
చిన్నమ్మ మృతి కలచివేసింది: లోకేష్
చిన్నమ్మ కంఠమనేని ఉమామహేశ్వరి ఇకలేరు అన్న వార్త తనను తీవ్రంగా కలచివేసిందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆవేదన వ్యక్తంచేశారు. సమాచారం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. కుటుంబంలో ఏ శుభకార్యమైనా చిన్నమ్మ ఎంతో పెద్ద మనసుతో దగ్గర ఉండి జరిపించేవారు. మార్గదర్శిగా నిలిచిన చిన్నమ్మ మృతి మా కుటుంబానికి కోలుకోలేని విషాదం. చిన్నమ్మ ఆత్మకి శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని లోకేష్ పేర్కొన్నారు.