అమరావతి: ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇంకా కడప స్టీల్ ప్లాంట్ నిర్మించలేదా అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యంగ్యంగా అడిగారు. ఈ మేరకు శనివారం లోకేష్ ఒక ప్రకటన విడుదల చేశారు. జగన్మోహన్ రెడ్డి మాటలను క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే మనకు జబర్దస్త్ బిల్డప్ బాబాయి గుర్తొస్తారు.. ఆయన మాటలు మాత్రమే కోటలు దాటుతాయి, పనులు గడపదాటవు. సొంత ఇలాకా కడప జిల్లాలో మూడేళ్లలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం పూర్తిచేస్తానని చెప్పి తొలిసారి శిలాఫలకం వేసి నేటికి నాలుగేళ్లయింది. రూ.15వేల కోట్లతో స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టి పాతికవేలమందికి ఉద్యోగాలిస్తానంటూ ఆనాడు కోతలు కోశాడు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ప్లాంట్ నిర్మాణం చేపట్టాల్సి ఉండగా, కనీసం తుప్పలు తొలగించేందుకు సైతం నిధులు కేటాయించకపోవడంతో తొలుత ఒప్పందం చేసుకున్న లిబర్టీ స్టీల్స్ పరారైపోయింది. దీంతో జెఎస్డబ్ల్యు అనే మరో కంపెనీని బతిమాలుకొని ఏడాది క్రితం మరోమారు శంకుస్థాపన చేశాడు. మరో మూడునెలల్లో పదవీకాలం పూర్తి కావస్తున్నా కడప స్టీల్ ప్లాంట్ పనులు అంగుళం కూడా ముందుకు సాగలేదు. పులివెందులలో రోడ్ల నిర్మాణానికి బిల్లులు ఇవ్వకపోవడంతో కంకరపర్చి తారువేయకుండా కాంట్రాక్టర్ పరారయ్యాడు. ఇలాంటి దివాలాకోరు ముఖ్యమంత్రిని నమ్మి వేలకోట్లు పెట్టుబడి పెట్టడానికి ఎవరైనా ముందుకు వస్తారా అని ఆ ప్రకటనలో లోకేష్ ప్రశ్నించారు.