అమరావతి (చైతన్య రథం): టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మళ్లీ కేంద్రంలో కీలక పాత్ర పోషించవచ్చన్న చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు.. లోక్‌సభ స్థానాల్లో సైతం టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభంజనం సృష్టించింది. ఈ నేపథ్యంలో హస్తిన రాజకీయ పరిణామాల్లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పాత్ర కీలకం కానుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. గతంలోనూ ఎన్డీయేలో టీడీపీ కీలక భాగస్వామ్య పక్షంగా వ్యవహరించింది. దేశ ప్రధానులుగా వాజపేయ్, హెచ్‌డి దేవగౌడ, ఐకే గుజ్రాల్‌ను ఎంపిక చేయడంలో ఎన్డీయే కన్వీనర్‌గా చంద్రబాబు అత్యంత కీలకంగా వ్యవహరించడం తెలిసిందే. ఆ సమయంలో ఏపీ సీఎంగావున్న నారా చంద్రబాబు నాయుడుకు… ప్రధాని పీఠం అధిష్టించే అవకాశం వెతుక్కుంటూ వచ్చిందని.. కానీ స్వర్ణాంధ్రప్రదేశ్ కల సాకారమైతే చాలని ఆయన సున్నితంగా తిరస్కరించిన అంశాన్ని గుర్తు చేస్తున్నారు.
ఇక ఎన్డీయే తరఫున రాష్ట్రపతిగా భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాంను ఎంపిక చేయడంలో చంద్రబాబు తన మార్క్ రాజకీయాన్ని ప్రదర్శించారు. అయితే ఏపీజే అబ్దుల్ కలాం.. రాజకీయాలకు అతీతమైన వ్యక్తి. అలాంటి వ్యక్తిని రాష్ట్రపతిగా తెరపైకి తీసుకొచ్చి గెలిపించిన ఒకే ఒక్కడు చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఇక అమలాపురం ఎంపీ, టీడీపీ నాయకుడు జీఎంసీ బాలయోగిని లోక్‌సభ స్పీకర్ అభ్యర్థిగా ఖరారు చేయడంలో సైతం చంద్రబాబు క్రియాశీలకంగా వ్యవహరించారు. అయితే తాజాగా జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఆంధ్రప్రదేశ్‌లో కొలువు తిరింది. దీంతో భవిష్యత్తులో చంద్రబాబు సేవలను కేంద్రంలో ఏర్పాటు కానున్న ప్రభుత్వం ఉపయోగించు కుంటుందనడంలో ఎటువంటి సందేహం లేదని ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
నేడు ఢల్లీికి చంద్రబాబు
ఆంధ్రరాష్ట్రంలో కూటమి విజయం అంబరాన్నంటింది. తెదేపా అధినేత చంద్రబాబు తన కుప్పం నియోజకవర్గం నుంచి భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, వైకాపా అభ్యర్థి కెఆర్‌కె భరత్‌పై 47 వేల ఓట్లతో విజయం సాధించారు. వైసీపీని పది అసెంబ్లీ స్థానాలకు పరిమితం చేస్తూ.. కూటమి పక్షాలైన తెలుగుదేశం, జనసేనలు అప్రతిహత విజయం సాధించాయి. క్రమంలో బుధవారం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నట్టు సమాచారం. బుధవారం ఢల్లీిలో జరగనున్న ఎన్డీయే కూటమి సమావేశంలో చంద్రబాబు పాల్గొననున్నారు.