- తెలంగాణలో కొనసాగించాలన్న అభ్యర్థనకు తిరస్కృతి
- ఏపీకి వెళ్లాలని 11 మంది అధికారులకు ఆదేశాలు
ఢల్లీి: తెలంగాణలోనే కొనసాగించాలన్న పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల అభ్యర్థనలను కేంద్రం తోసిపుచ్చింది. ఆమ్రపాలి, వాకాటి కరుణ, రొనాల్డ్ రోస్, వాణీ ప్రసాద్, మల్లెల ప్రశాంతి, అంజనీకుమార్, అభిషేక్ మహంతి, తదితర అధికారులు తమను తెలంగాణకు కేటాయించాలని కేంద్రాన్ని కోరారు. కానీ వారి విజ్ఞప్తిని తిరస్కరించిన కేంద్రం… ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలని వారికి ఆదేశాలు జారీ చేసింది.
ప్రస్తుతం ఆమ్రపాలి కాటా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా, రొనాల్డ్ రోస్ విద్యుత్ శాఖ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. వారితో పాటు వాణీ ప్రసాద్, వాకాటి కరుణ, మల్లెల ప్రశాంతితో పాటు పలువురు అధికారులను ఏపీ కేడర్‌కు కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
మొత్తం 11 మంది అధికారులు తెలంగాణ కేడర్ కావాలంటూ కేంద్రాన్ని కోరారు. కానీ వారి విజ్ఞప్తిని తిరస్కరించింది. అధికారులు అందరూ సొంత రాష్ట్రంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఐఏఎస్ అధికారుల పేరుతో లేఖను రాస్తూ… వాటి కాపీలను తెలంగాణ, ఏపీ చీఫ్ సెక్రటరీలకు కేంద్రం పంపించింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో అధికారులను ఏపీ, తెలంగాణలకు కేంద్రం సర్దుబాటు చేసింది. అయితే వారిలో కొందరు మాత్రం అభ్యంతరాలను వ్యక్తం చేశారు. వివిధ కారణాలను చూపిస్తూ తమను తెలంగాణ కేడరు మార్చాలని కోరారు. ఇదే విషయంపై గతంలో క్యాట్‌ను కూడా ఆశ్రయించారు. వారి అభ్యర్ధనను అంగీకరించిన క్యాట్.. వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. క్యాట్ తీర్పును వ్యతిరేకిస్తూ తెలంగాణ హైకోర్టులో కేంద్రం పిటిషన్ దాఖలు చేసింది.
గత మార్చి నెలలో దీనిపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. అభ్యర్థనలను మరోసారి పరిశీలించి, నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు ఆదేశం ప్రకారం.. అభ్యంతరాల పరిశీలనకు విశ్రాంత ఐఏఎస్ అధికారి దీపక్‌ను కేంద్రం నియమించింది. ఆయన ఇచ్చిన నివేదిక ప్రకారం.. అధికారుల అభ్యర్థనలను తోసిపుచ్చుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది.