- భూసమస్యల పరిష్కారానికి వినూత్న విధానం
- నెల్లూరు మోడల్‌కు సీఎం చంద్రబాబు ప్రశంసలు
- కలెక్టర్ హిమాన్షు శుక్లాకు ప్రత్యేక అభినందనలు
అమరావతి (చైతన్య రథం): నెల్లూరు జిల్లాలో భూసమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా “వన్ మంత్.. వన్ విలేజ్.. ఫోర్ విజిట్స” కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయడంపట్ల జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాను ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల రూపొందించిన వినూత్న విధానాన్ని సదస్సులో ప్రజెంటేషన్ ఇస్తూ.. గ్రామస్థాయిలోనే భూవివాదాలను గుర్తించి, దశలవారీగా పరిష్కరించేలా చర్యలు చేపడుతున్నట్టు వివరించారు. ఈ విధానంలో భాగంగా ఒక గ్రామాన్ని ఎంపికచేసి ఒక నెలలో నాలుగు విడతలుగా అధికారులు గ్రామానికివెళ్లి ప్రజల భూసమస్యలను పరిశీలించి పరిష్కారం చూపడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. భూ రికార్డులు, మ్యూటేషన్లు, సాదాబైనామా, డీకేటీ పట్టాలు, హౌస్ సైట్స్‌వంటి అంశాలపై వస్తున్న ఫిర్యాదులను సమగ్రంగా పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతోంది.
ఇప్పటి వరకు భూ సమస్యల పరిష్కారంలో ప్రజలు పలుమార్లు కార్యాలయాలు చుట్టూ తిరగాల్సి రావడం, సమస్యలు కోర్టులకు వెళ్లడంవంటి ఇబ్బందులను ఈ విధానం తగ్గిస్తుందని వివరించారు. గ్రామస్థాయిలోనే సమస్యలను గుర్తించి పరిష్కరించడం ద్వారా ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఇప్పటివరకు డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో జిల్లాలో మొత్తం 110 గ్రామాల్లో కార్యక్రమాన్ని నిర్వహించగా, అందులో 26 గ్రామాల్లో భూసమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యాయి. మిగిలిన గ్రామాల్లోనూ సమస్యల పరిష్కారం దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా భూవివాదాలు తగ్గడంతోపాటు ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతోందని కలెక్టర్ వివరించారు. గ్రామ స్థాయిలోనే సమస్యలను పరిష్కరించే ఈ విధానం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయదగిన మంచి మోడల్‌గా నిలుస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా అమలు చేయవచ్చని సీఎం సూచించారు.












