- చకచకా పనులు చక్కబెడుతున్న ఐటీ మంత్రి
- సహాయక చర్యలపై అనుక్షణం పర్యవేక్షణ
- ఫ్లడ్ సిట్యుయేషన్‌పై అధికారులకు డైరెక్షన్
అమరావతి (చైతన్య రథం): భారీ వరదల్లో చిక్కుకున్న విజయవాడ పరిరక్షణకు ప్రజా ప్రభుత్వం తీసుకున్న చర్యలను ముందుండి నడిపిస్తున్నారు ఐటీ మంత్రి నారా లోకేష్. సీపం సీబీఎన్ టీంలో మంత్రి లోకేష్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా సాగుతున్న సహాయ చర్యలను అనుక్షణం పర్యవేక్షిస్తూ.. చకచకా పనులు చక్కబెట్టడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆదివారం సైతం వరద సహాయ చర్యలపై మంత్రి నారాయణ, కలెక్టర్ సృజనతో సమీక్ష నిర్వహించడంతో మొదలుపెట్టిన మిషన్‌ను.. అవిశ్రాంతంగా నడిపించారు. కోతకు గురైన బుడమేరు గట్లను చక్కదిద్ది.. మూడు గండ్లను పూడ్చడంలో మంత్రి నిమ్మల రామానాయుడితో కలిసి కీలక బాధ్యతలు నిర్వర్తించిన లోకేష్.. బుడమేరు గట్ల పటిష్టతపై డ్రోన్ లైవ్ ద్వారా సమీక్షిస్తూ.. ఇరిగేషన్ అధికారులకు కీలక సూచనలు చేశారు.
మరోపక్క.. ఎగువ నుంచి వరదనీరు చేరుతుండటంతో అధికారుల అప్రమత్తం చేస్తూనే.. వరద ముంపు ప్రాంతాల ప్రజలకు ఆహారం, తాగునీటికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందేలా టీంలకు ఆదేశాలిస్తూ ముందుకు నడిపించారు. ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలిస్తూ.. పరిస్థితిని సమీక్షిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు అప్పగించిన బాధ్యతల నిర్వహణలో లోకేష్ కీలకంగా వ్యవహరించారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుత వరద ప్రవాహం 4,06,198 క్యూసెక్కులు ఉందని తెలుసుకున్న లోకేష్.. ఎగువ ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలిచ్చారు. బుడమేరుగట్ల పటిష్టతపై డ్రోన్ లైవ్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్న మంత్రి లోకేష్, భారీవర్షం కురుస్తున్నా క్షేత్రస్థాయిలో ఉండి పనులను కొనసాగిస్తున్న మంత్రి నిమ్మల రామానాయుడికి సహకరించారు.
లోకేష్ వద్దకు దాతలు
ఇదిలావుంటే, ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం మంత్రి లోకేష్‌ను కలిసిన దాతలు.. తమ శక్తికొలదీ విరాళాలు అందించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త గుత్తా బాలాజీ రూ.15 లక్షలు, విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్త మైనేని శ్రీనివాస్ రూ.10 లక్షలు, నిమ్మకూరుకు చెందిన వజ్ర ట్రాన్స్‌పవర్ అధినేత డాక్టర్ యోనిత్య, అశ్వంత్ రూ.5 లక్షలు విరాళాలు అందచేశారు. వరద బాధితులను ఆదుకునేందుకు పెద్దమనసులతో ముందుకు వచ్చిన దాతలకు మంత్రి నారా లోకేష్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.