- ఘటనపై ప్రభుత్వం సీరియస్
- బాధ్యులపై కఠిన చర్యలకు రంగం సిద్ధం
- ఫైళ్లపై పెద్దిరెడ్డి, సమీర్‌శర్మ ఫొటోలు
- గత ప్రభుత్వ సీఎంవో లేఖలు లభ్యం
- సమీర్‌శర్మ సూచనతో కాల్చినట్లు చెబుతున్న డ్రైవర్
- పెద్దిరెడ్డి అనుచరులు, అప్పటి ఓఎస్డీల ఆదేశాలతోనే దహనం
- ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన అధికారులు
- కాలుష్య నియంత్రణ మండలి అధికారుల పాత్రపైనా దర్యాప్తు
- అక్రమాలు బయటపడతాయనే సాక్ష్యాలు ధ్వంసం చేసే యత్నం
- దస్త్రాలు పెద్దిరెడ్డి హయాంలో ఒప్పందాలు, అనుమతుల పత్రాలేనా?
- ఘటనా స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ బాలాజీ, ఎస్పీ నయీం అస్మీ
విజయవాడ: నగర శివారులోని విజయవాడ – అవనిగడ్డ కరకట్టపై కృష్ణానది కరక ట్టపై బుధవారం రాత్రి రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, ప్రణాళిక శాఖల దస్త్రాలను బస్తాల కొద్దీ కారులో తీసుకెళ్లి తగులబెట్టిన ఉదంతంపై పూర్తిస్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. రాత్రి వేళ రహస్యంగా ప్రభుత్వ వాహనంలో తరలించి తగులబెట్టడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. కాగితాలతోపాటు హార్డ్ డిస్కులు, గుర్తింపు కార్డులు కూడా ఉండటంతో కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. దహనం చేసిన దస్త్రాల్లో ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థకు చెందిన ఫైళ్లు కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. దస్త్రాలపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి మాజీ చైర్మన్ సమీర్‌శర్మ ఫొటోలు ఉండడంతో పాటు సీఎంఓ లేఖలు ఉండటాన్ని చూసి వెంటనే పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌కు సమాచారం అందించారు. ఆయన కాలిపోయిన దస్త్రాలను పరిశీలించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. దహనమైన డాక్యుమెంట్లపై సమీర్‌శర్మ పేరు కూడా ఉంది. సమీర్‌శర్మ సూచనలతో దస్త్రాలు తీసుకొచ్చి తగలబెట్టినట్లు ఇన్నోవా డ్రైవర్ నాగరాజు చెబుతున్నారు. ఫైళ్ల దహనం గురించి తెలియగానే కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ, ఎస్పీ నయీం అస్మీ ఘటనా స్థలానికి వచ్చారు. పోలీసు పికెట్‌ను ఏర్పాటు చేశారు. కాగితాలు చాలా వరకు గుర్తు పట్టలేని రీతిలో కాలిపోవడంతో వాటిని బయటకు తీసుకొ చ్చేందుకు అవకాశం లేకుండా పోయింది. కారును టీడీపీ శ్రేణులు వెంబడిరచడంతో మరి కొన్ని ఫైళ్లను వేరే ప్రాంతాల్లో పడవేసి ఉంటారని అనుమానిస్తున్నారు. హార్ట్ డిస్క్‌లతో పాటు వీహెచ్ఎస్ క్యాసెట్లు కూడా మంటల్లో దగ్ధమయ్యాయి.
సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నాలు
మంత్రిగా పెద్దిరెడ్డి హయాంలో 2022-2023 సంవత్సరాలలో చేసిన ఒప్పందాలు, ఇచ్చిన అనుమతుల పత్రాలు దగ్ధం చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెద్దిరెడ్డి అనుచరులతో పాటు, ఓఎస్డీలుగా పనిచేసిన అధికారుల ఆదేశాలతోనే డ్రైవర్ నాగరాజు ఈ పని చేసినట్లు ప్రాథమికంగా అధికారులు ఓ నిర్ధారణకు వచ్చారు. సీఎంఓ లో పనిచేసిన ముత్యాలరాజు వద్ద ఓఎస్డీ సాయి గంగాధర్, కాలుష్య నియంత్రణ మండలి మాజీ చైర్మన్ సమీర్‌శర్మ వద్ద ఓఎస్డీగా చేసిన రామారావు, సెక్షన్ హెడ్ శ్రీనివాస్ పాత్రలపై అధికారులు విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై శాఖాపరంగా అంతర్గత విచారణ జరుగుతోంది. ఫైళ్లు తగలబెట్టిన ఘటనలో భాగస్వాములు అయిన వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర కూడా ప్రకటించారు. ఇదిలా ఉంటే వైసీపీ ప్రభుత్వం అవినీతిలో కురుకుపోయింది కాబట్టే అక్రమాల గుట్టు బయటకొస్తుందనే భయం తోనే సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నాలు చేసిందని టీడీపీ ఆరోపించింది.