సమాజానికి నిస్వార్థ సేవ చేయడమే నిజమైన రాజకీయం అన్నది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు శ్రీ నందమూరి తారక రామారావు (అన్న ఎన్టీఆర్) గారి మూల సిద్ధాంతం. “సంఘం శరణం గచ్ఛామి” అన్న బుద్ధ భగవానుని సూక్తి నుండే తాను స్ఫూర్తిని పొంది “సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్ళు” అన్న నినాదాన్ని తెలుగుదేశం పార్టీకి అందించానని అన్న ఎన్టీఆర్ చెప్పారు.
అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించేనాటికి దేశంలో అనేక రాజకీయ పార్టీలు వివిధ సిద్ధాంతాలతో పనిచేస్తున్నాయి. అలాంటి సమయంలో “నేను సోషలిస్ట్ నో, కమ్యూనిస్టునో, కాపిటలిస్టునో కాదు.. నేను హ్యూమనిస్టుని” అన్నారు ఎన్టీఆర్. అంటే తెలుగుదేశం పార్టీ రాజకీయాలకు మానవత్వమే అసలైన పునాది.
“పేదలకు పట్టెడన్నం పెట్టగలిగిన నాడే దేశానికి నిజమైన స్వాతంత్య్రం” అన్నది అన్న ఎన్టీఆర్ భావన. కండలు కరిగించి, ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, రక్తాన్ని చెమరిస్తూ కూడా అర్థాకలితో అలమటించే కార్మిక సోదరులు… మట్టిలో మాణిక్యాలు పండించినా తన పంటకు తగినంత విలువ లభించక ముడుచుకుపోతున్న కర్షక సోదరులు… ఇటువంటి సామాన్యులందరికీ కేవలం ప్రాథమిక అవసరాలైన తిండి, గుడ్డ, నీడ అందివ్వడమే కాకుండా… అభివృద్ధి కార్యక్రమాలతో వారి బ్రతుకులు పండించాలి. పేదలకు సైతం మెరుగైన, ఆరోగ్యకరమైన జీవన సౌకర్యాలను… విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించి పేదరికం నుండి వారికి విముక్తిని కల్పించాలి అన్నదే తెలుగుదేశం సిద్ధాంతం.
స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు దాటినా సామాజిక రక్షణ కరువై ధన బలవంతులు, కుల అహంకారుల చేత అణగదొక్కబడుతున్న అల్ప సంఖ్యాకులకు, హరిజన, గిరిజన, వెనుకబడిన తరగతుల వారికి….
జనాభాలో దాదాపు సగభాగమైనప్పటికీ సమాన హక్కులకు నోచుకోలేక … వరకట్నం వంటి అనాగరిక సంప్రదాయాలలో, సాంఘిక దురాచారాలలో మగ్గిపోతూ అవమానాల పాలై నలిగిపోతున్న ఆడపడుచులకు… ఆర్థిక స్వేచ్ఛ లేక పురుష అహంకారానికి తలొగ్గి బతుకీడుస్తున్న స్త్రీలకు…
వీరందరికీ స్వతంత్ర జీవనం కల్పించడం… సమాజంలో సమాన హోదా కోసం ఆర్థిక పుష్టిని, సాధికారతను కలిగించడం… విద్యా ఉద్యోగ ఉపాధి రంగాలలో సమానావకాశాలు అందించడం… రాజకీయ ప్రాతినిధ్యానికి చోటివ్వడం … తెలుగుదేశం సిద్ధాంతం. అంతేకాదు బడుగులకు, మహిళలకు అత్యాచారాలు, హత్యాచారాలు, దాడుల నుండి రక్షణ కల్పించడం, నిర్భయంగా బతికే, స్వేచ్ఛగా ఎదిగే వీలు కల్పించడం తెలుగుదేశం పరమావధి.
తెలుగుదేశం ఒక పార్టీ కాదు, ఒక మహా ఉద్యమం. తెలుగువారి ఆత్మగౌరవం అవమానింపబడుతున్న దశలో తెలుగు ప్రజల ఆవేదన నుంచి పుట్టుకొచ్చిన ఆవేశం తెలుగుదేశం. తెలుగువారి సేవలో తరిస్తూ… తెలుగునేలకు ఖండాంతర ఖ్యాతిని తేవడం తెలుగుదేశం సిద్ధాంతం. ప్రతి తెలుగువాడినీ అన్నిరకాలుగా సమర్థుడిగా తీర్చిదిద్ది.. తాను ఏదైనా సాధించగలననే ఆత్వవిశ్వాసాన్ని వారిలో కలిగించడం తెలుగుదేశం సిద్ధాంతం. తెలుగు నేలపై మమకారాన్ని పెంచి, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షింపజేయడం… రానున్న తరాలకు ఆ ఘన వారసత్వాన్ని సంక్రమింపజేయడం తెలుగుదేశం పార్టీ తన నైతిక బాధ్యతగా స్వీకరించింది.
ప్రజాస్వామ్యాన్ని ఒక విశిష్ట జీవన విధానంగా, చారిత్రక పరిణామక్రమంలో మానవజాతి అశేష త్యాగాలు చేసి సాధించుకున్న వరంగా భావిస్తుంది తెలుగుదేశం. ప్రజాస్వామ్యాన్ని కంటికి రెప్పలా కాపాడటం… ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించడం తెలుగుదేశం పార్టీ పవిత్ర కర్తవ్యం.
© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.