- అనుమానం ఉంటే తనిఖీ చేసుకోవచ్చు
- పేర్ని నాని విమర్శలను తిప్పికొట్టిన మంత్రి పయ్యావుల
అమరావతి (చైతన్యరథం): రేషన్ బియ్యంతో తన వియ్యంకుడి వ్యాపారానికి ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర అర్థికమంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. బియ్యం రవాణాకు సంబంధించి మంత్రి కేశవ్ వియ్యంకుడిపై వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి పేర్నినాని పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి పయ్యావుల స్పందిస్తూ పేర్ని నాని విమర్శలను గట్టిగా తిప్పికొట్టారు. మంగళవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో పయ్యావుల మాట్లాడుతూ.. మా వియ్యంకుల కుటుంబం మూడు తరాలుగా బాయిల్డ్ రైస్ ఎగుమతి వ్యాపారం చేస్తున్నారు. ముడి బియ్యం వ్యాపారం చేయరు.. స్టీమ్డ్ రైస్ మాత్రమే ఎగుమతి చేస్తారు. రేషన్ బియ్యంతో నా వియ్యంకుడి వ్యాపారానికి సంబంధం లేదు. రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసి సొంత ఫ్యాక్టరీలో మిల్లింగ్ చేసుకుని ఎగుమతి చేస్తారని స్పష్టం చేశారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోనే తన వియ్యంకులు వ్యాపారం చేస్తున్నారని… ఏపీలో గింజ కూడా కొనుగోలు చేయలేదన్నారు. మాజీ మంత్రులు పేర్ని నాని, అంబటి రాంబాబుకు అనుమానం ఉంటే చెక్‌పోస్ట్ పెట్టుకుని ప్రతి బ్యాగ్‌ను తనిఖీ చేసుకోవచ్చని, అందుకు తానే అనుమతులు ఇప్పిస్తానన్నారు. వాళ్లు చేసేది పారాబాయిల్డ్ రైసు వ్యాపారం మాత్రమే అని మంత్రి స్పష్టం చేశారు. అలాగే గత ఐదేళ్లలో ఇసుక, మద్యం, బియ్యంలో అనేక అవకతవకలు జరిగాయని.. వాటిని సరిచేస్తున్నామన్నారు. దీనిపై కేబినెట్‌లో చర్చించినట్లు తెలిపారు. గతంలో జరిగిన తప్పుడు విధానాలను సరిదిద్దుతున్నట్లు చెప్పారు. కాగా.. ఇటీవల కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణా చేస్తున్న షిష్‌ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనిఖీ చేసిన విషయం తెలిసిందే. పవన్ తనిఖీలపై మాజీ మంత్రి పేర్ని నాని విమర్శిస్తూ, మంత్రి పయ్యావుల వియ్యంకులపైనా పలు ఆరోపణలు గుప్పించారు.