అమరావతి (చైతన్యరథం): ఉద్యోగుల సంక్షేమంతో పాటు వాళ్ల మంచి కోరుకునే ప్రభుత్వం తమదని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి ఎస్ సవిత స్పష్టం చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏపీ బీసీ, ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ క్యాలెండర్ను శుక్రవారం మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మంత్రి సవిత మాట్లాడుతూ, ఉద్యోగుల సంక్షేమానికి సీఎం చంద్రబాబునాయుడు పెద్దపీట వేస్తుంటారన్నారు. 2014లో రాష్ట్రం విడిపోయి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంతో క్లిష్టంగా ఉన్నా ఉద్యోగులకు సీఎం చంద్రబాబు 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చారన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఉద్యోగులకు వసతి సౌకర్యాలు కల్పించారన్నారు. తరవాత వచ్చిన జగన్ ఉద్యోగులను అన్ని విధాలా అన్యాయం చేశారన్నారు. ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్ ఖాతాల్లోని నిధులను సైతం పక్కదారి పట్టించారన్నారు. జీతాలు సైతం ఒకటో తేదీన ఇవ్వకుండా ఉద్యోగులను తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురిచేశారన్నారు. ఇదేమిటని ప్రశ్నించిన ఉద్యోగులను తప్పుడు కేసులతో వేధింపులకు గురిచేశారన్నారు. సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది.. మీ మంచి కోరుకునే ప్రభుత్వ మాదని మంత్రి తెలిపారు. చంద్రబాబు సీఎం అయిన తరువాత ఒకటో తేదీనే జీతాలు, పెన్షన్లు చెల్లిస్తున్నారన్నారు. ఉద్యోగులు తన వద్ద ప్రస్తావించిన తీసుకొచ్చిన సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషిచేస్తానని మంత్రి సవిత హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి సవితను ఏపీ బీసీ, ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు దుశ్శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీసీ, ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్పీఆర్ విఠల్, ఆ సంఘ ప్రతినిధులు పామర్తి ఏసురాజు, ప్రసాద్, శ్రీనివాసరావు, రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.