- విచారణ జరిపించి తొలగించాలి
- ఫేక్ చెక్కు ఇచ్చి పొలం రాయించుకొని బెదిరింపులు
- గ్రీవెన్స్‌లో నేతలకు బాధితుల ఫిర్యాదు
- అర్జీలు స్వీకరించిన జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి
అమరావతి (చైతన్యరథం): అన్నమయ్య జిల్లా కంభంవారి పల్లి మండల తహశీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని ఒకరు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ.. ఆన్‌లైన్‌లో ప్రజల పేర్లు తొలగిస్తున్నారని, ఆమె అవినీతి, అక్రమాలపై విచారణ జరిపి ఉద్యోగం నుండి తొలగించాలని గోవర్ధన్ అనే వ్యక్తి టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో విజ్ఞప్తి చేశారు. వివిధ సమస్యలపై తరలి వచ్చిన వారి నుంచి మాజీమంత్రి, జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్, రాజమండ్రి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (రుడా) చైర్మన్ బొడ్డు వెంకట రమణ చౌదరి అర్జీలు స్వీకరించి, పరిష్కారానికి కృషి చేశారు.
శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలం బంగారు చెన్నెపల్లి గ్రామానికి చెందిన రామిరెడ్డి విజ్ఞప్తి చేస్తూ.. విజయ్ అనే వ్యక్తి తమ వద్ద పొలం కొని అడ్వాన్స్ కింద పది లక్షల రూపాయలకు చెల్లని చెక్కు ఇచ్చి కాగితాలు రాయించుకున్నాడని.. తరువాత ఆ కాగితాలు అడ్డుపెట్టుకుని తమను బెదిరిస్తున్నాడని ఫిర్యాదు చేశాడు.
కడప జిల్లా సింహాద్రిపురం మండలం మద్దలబాయి గ్రామానికి చెందిన బందలదిన్నె మాబి విజ్ఞప్తి చేస్తూ.. తాను సాగు చేసిన చీనీ చెట్లు పూర్తిగా ఎండిపోవడంతో పెట్టుబడి పెట్టిన రూ.7 లక్షలు నష్టపోయానని తనకు ప్రభుత్వం సాయం చేసి ఆదుకోవాలని వేడుకున్నారు.
1986 నుండి దినసరి వేతనంతో వైద్యఆరోగ్య శాఖ ప్రకాశం జిల్లా మలేరియా విభాగంలో పనిచేస్తున్న ఎస్సీ వర్గానికి చెందిన తమను ఖాళీగా ఉన్న నాల్గో తరగతి ఉద్యోగాల్లో భర్తీ చేసి ఆదుకోవాలని ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండలం చిన్న దోర్నాల గ్రామానికి చెందిన ఆర్. వెంకటయ్య, తదితరులు విజ్ఞప్తి చేశారు.
ప్రజల నుండి డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేసిన సిమ్స్ (సెక్యూరిటీ ఇన్వెస్ట్‌మెంట్ మేకింగ్ సర్వీస్) కంపెనీకి సంబంధించిన ఆస్తులను త్వరగా వేలం వేసి మోసపోయిన బాధితులకు పరిహారం అందేలా చూడాలని పలువురు బాధితులు గ్రీవెన్స్‌లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేశారు.
అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన ప్రసాద్ రెడ్డి గ్రీవెన్స్‌లో విజ్ఞప్తి చేస్తూ.. తన స్థలాన్ని కబ్జా నుండి విడిపించాలని కోర్టు ఆదేశించినా కోర్టు ఆదేశాలను అధికారులు పట్టించుకోవడంలేదని.. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకొని తన స్థలాన్ని కబ్జా నుండి విడిపించాలని కోరారు.
కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన తాళ్లూరి నిర్మల విజ్ఞప్తి చేస్తూ.. వంగేవరపు జోషి అనే వ్యక్తి మరణాయుధంతో తనపై దాడి చేస్తే.. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని.. దాంతో వారి కుటుంబ సభ్యులు మళ్లీ తనపై హత్యాయత్నానికి పూనుకున్నారని. వారిపై చర్యలు తీసుకొని తనకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.
అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం యర్లగుంట్ల గ్రామానికి చెందిన కె.మంగమ్మ విజ్ఞప్తి చేస్తూ.. గతప్రభుత్వంలో చేపట్టిన రీ సర్వేలో తాము సాగు చేసుకుంటున్న భూమిని మరోకరి పేరుతో ఆన్ లైన్ చేశారని.. దీనిపై విచారణ జరిపించి, తమకు న్యాయం చేయాలని కోరారు.