అమరావతి(చైతన్యరథం): ప్రస్తుతం రాష్ట్రంలో పంచ భూతాలకు సైతం పార్టీ రంగులు దుర్మార్గం రాజ్యమేలుతోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. తాగు నీళ్ళు పట్టుకొనేందుకు కూడా పార్టీల లెక్కల చూసే పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మల్లవరంలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన బాణావత్ సామినిబాయిని ట్రాక్టర్తో తొక్కించి చంపిన ఘటన కలచి వేసిందని పవన్ అన్నారు. గ్రామంలోకి వచ్చిన ట్యాంకర్ దగ్గరకు తాగునీరు పట్టుకొనేందుకు వెళ్తే టీడీపీ వాళ్లు పట్టుకోరాదని అడ్డుపడటం దారుణమన్నారు.
ఇంట్లో నీళ్ళు లేవని ఆమె ప్రాధేయపడ్డా వినకుండా ట్రాక్టర్తో ఢీ కొట్టి చంపడం చూస్తే.. రాష్ట్రంలో ఎలాంటి దుర్మార్గపు పాలన నడుస్తుందో అందరూ అర్థం చేసుకోవాలని పవన్ అన్నారు. వైసీపీ వాళ్ళే నీళ్లు తాగాలి… గాలి పీల్చాలని జీవో ఇవ్వడం ఒక్కటే మిగిలి ఉందన్నారు. మల్లవరం ఘటనపై పోలీసులు నిష్పక్షపాతంగా, అధికార పార్టీ ఒత్తిళ్లకు లొంగకుండా విచారణ చేయాలన్నారు.
మూడేళ్ళ కిందట ఇదే తరహాలో పల్నాడు జిల్లాలోనే నకరికల్లు ప్రాంతంలో ఎస్టీ మహిళను వైసీపీ నాయకుడు ట్రాక్టర్ తో తొక్కించి చంపేశాడని పవన్ అన్నారు.
జగన్రెడ్డి మాట్లాడితే ‘నా ఎస్టీలు… నా ఎస్సీలు…” అంటాడని.. ఎస్సీలను చంపి డోర్ డెలివరీ చేస్తూ, ఎస్టీ మహిళలను ట్రాక్టర్లతో తొక్కించేస్తూ.. హత్యాకాండ సాగించేవాళ్ళను వెనకేసుకొచ్చే వ్యక్తికి ‘నా ఎస్టీ, నా ఎస్సీ’ అనే అర్హత ఉందా? అని పవన్ ప్రశ్నించారు.