- మంత్రి లోకేష్ సమక్షంలో సుజ్లాన్-ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎంఓయూ
- అంతర్జాతీయస్థాయి అవకాశాలకు దోహదం: మంత్రి లోకేష్
అమరావతి (చైతన్యరథం): ఏపీలో దేశంలోనే అతిపెద్ద విండ్ ఎనర్జీ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఎస్డీసీ) నడుమ ఒప్పందం కుదిరింది. రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఉండవల్లి నివాసంలో మంగళవారం ఇరుపక్షాలు ఎంఓయు చేసుకున్నారు. వచ్చే 4 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్‌ను విండ్ ఎనర్జీ నైపుణ్యాల కేంద్రంగా మార్చడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా సుజ్లాన్ సహకారంతో యాంత్రిక, ఎలక్ట్రికల్, బ్లేడ్ టెక్నాలజీ, సివిల్, లైసనింగ్ వంటి కీలక రంగాల్లో 12వేల మందికి శిక్షణ ఇస్తారు. యువత, మహిళలు, ఎస్‌టీఈఎం గ్రాడ్యుయేట్స్ చురుకైన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం ఒప్పందం ముఖ్యోద్దేశం.
క్లీన్ ఎనర్జీలో జాతీయ, అంతర్జాతీయ అవకాశాల కోసం గ్లోబల్ నైపుణ్యాలను పెంపొందించడమే ఈ ఎంఓయు ప్రధాన లక్ష్యం. విండ్ ఎనర్జీలో పేరొందిన సుజ్లాన్ సంస్థ ఇప్పటికే భారతదేశం, ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో శిక్షణార్థులకు ప్రత్యక్ష ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ విండ్ ఎనర్జీ రంగంలో ఏపీ యువతకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలు పొందేందుకు సుజ్లాన్‌తో చేసుకున్న ఒప్పందం దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సుజ్లాన్ గ్రూప్ సీఇఓ జేపీ చలసాని, సిహెచ్ ఆర్‌ఓ రాజేంద్ర మెహతా, టాలెంట్ మేనేజ్మెంట్ లీడ్ కమిలిని సన్యాల్, ఏపీ పాఠశాల విద్య, స్కిల్ డెవలప్‌మెంట్ కార్యదర్శి కోన శశిధర్, స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ గణేష్ కుమార్, స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దినేష్ కుమార్ పాల్గొన్నారు.
శిక్షణ కోసం ఎక్సలెన్స్ సెంటర్లు
ఒప్పందంలో భాగంగా 3 నుంచి 12 నెలల షార్ట్-టర్మ్, 12 నెలలకు పైగా లాంగ్-టర్మ్ శిక్షణ ఇస్తారు. విండ్ ఎనర్జీ రంగ అవసరాలకు అనుగుణంగా ఐటీఐ, డిప్లొమా, ఇంజినీరింగ్ కాలేజీల్లో వృత్తి కోర్సులు, ఎలెక్టివ్ ప్రోగ్రాములు నిర్వహిస్తారు. ఎంపిక చేసిన ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీల్లో స్కిల్ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తారు. విండ్ ఎనర్జీ టెక్నాలజీలలో అధునాతన పరిశోధన, ఆవిష్కరణ, అనుభవజ్ఞులైన వారితో శిక్షణ కోసం ఎక్సలెన్స్ సెంటర్లు (జూజుం) స్థాపిస్తారు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ఉపాధికి తోడ్పడే గ్లోబల్ సర్టిఫికేట్లు ప్రవేశపెడతారు. శిక్షణా కార్యక్రమాలు, పరిశోధనా ల్యాబ్‌లలో ఆధునిక టెక్నాలజీలను అమలుచేస్తారు. సుజ్లాన్ భాగస్వామ్యం ఆంధ్రప్రదేశ్‌ను విండ్ ఎనర్జీ నైపుణ్యాల కేంద్రంగా అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది, గ్లోబల్ స్థాయిలో ప్రతిభావంతులను తయారు చేసి, భారతదేశ క్లీన్ ఎనర్జీ రంగ ఆవిష్కరణలలో ఏపీని ముందు వరుసలో నిలబెడుతుంది.
సుజ్లాన్ ఎనర్జీ స్కిల్ డెవలప్‌మెంట్ ఎండ్-టు-ఎండ్ డెవలప్‌మెంటల్, ఆపరేషన్ ఫ్రేమ్‌వర్క్‌ను సమీకృతం చేసి విండ్ ఎనర్జీ సెగ్మెంట్ లో నైపుణ్యం, సామర్థ్యాలను మెరుగుపరస్తుంది. స్కిల్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయడం, సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (జూజుం) ఏర్పాటుకు ఏపీలోని ఐటీిఐలు, పాలిటెక్నిక్‌ల్లో తగిన మౌలిక సదుపాయాల కల్పనకు సుజ్లాన్ సహకారాన్ని అందిస్తుంది. పరికరాలను సేకరించడం, ఇన్‌స్టాల్ చేయడం, పరిశ్రమకు సమకాలీనమైన పాఠ్యాంశాలను అభివృద్ధి చేయడం, గుర్తింపు పొందిన శిక్షకులను సమీకరించడం. శిక్షకుల కోసం సామర్థ్య-నిర్మాణాన్ని అమలు చేయడం వంటి కార్యక్రమాలను సుజ్లాన్ చేపడుతుంది. పరిశ్రమ ప్రమాణాలకు అనుగుణంగా వరల్డ్ క్లాస్ సర్టిఫికేషన్ అందజేస్తుంది. పవన విద్యుత్ రంగంలో నైపుణ్యం కలిగిన ప్రతిభావంతులకు మార్గం సుగమం చేస్తుంది.
ఏపీఎస్‌ఎస్‌డీసీ కీలక సహకారం
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఎస్‌డీసీ).. సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్‌కు సహకారం అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రాష్ట్రంలోని విండ్ పాకెట్ జిల్లాలు, చుట్టుపక్కల ఉన్న ఐటీిఐలు, పాలిటెక్నిక్‌ల నుండి సరైన ఇన్‌స్టిట్యూట్‌లను గుర్తించి స్కిల్‌ల్యాబ్‌ల ఏర్పాటును సులభతరం చేస్తుంది. అవసరమైన కోర్సు కంటెంట్, ఇతర సంబంధిత అనుమతులపై రాష్ట్ర, కేంద్ర అధికారుల నుండి అవసరమైన అనుమతుల కోసం సహకారం అందిస్తుంది. జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమాల కోసం విద్యార్థుల సమీకరణలో సుజ్లాన్‌కు మద్దతు ఇస్తుంది. ప్రతిపాదిత సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌ల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి పర్యావరణ వ్యవస్థలను ప్రోత్సహిస్తుంది, అప్రెంటిస్‌షిప్, ఉద్యోగ అవకాశాలను అందించడానికి విద్యార్థులను స్థానిక పరిశ్రమలతో అనుసంధానిస్తుంది.