- నమ్యశక్యంగా లేని సీఐడీ అధికారుల వివరణ
- జగన్‌కు ఓటమి తప్పదని తెలిసి అక్రమార్కులైన అధికారుల్లో మెదలైన భయం
- ప్రభుత్వ కార్యాలయాల్లో కీలక పత్రాలు మాయం చేసే అవకాశం
- ఈసీ గట్టి నిఘా ఏర్పాటు చేయాలి
అమరావతి (చైతన్యరథం): రానున్న ఎన్నికల్లో జగన్‌రెడ్డి ఓటమి తథ్యమని నిర్ధారణకు వచ్చిన సీఐడీ అధికారులు గతంలో చంద్రబాబు, లోకేష్‌లపై నమోదు చేసిన తప్పుడు కేసుల కోసం సృష్టించిన ఫేక్ డాక్యుమెంట్లను దగ్ధం చేశారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. ప్రభుత్వం మారాక ఈ తప్పుడు పత్రాలపై విచారణ జరుగుతుందనే భయంతోనే వాటిని దగ్ధం చేశారని విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో పట్టాభి మాట్లాడుతూ ఈ పత్రాల దగ్ధంపై సీఐడీ అధికారులు ఇచ్చిన వివరణ హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇదే మాదిరిగా సెక్రటేరియట్, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో కీలక పత్రాలను మాయం చేసే అవకాశం ఉన్నందున ఆయా కార్యాలయాల వద్ద ఎన్నికల సంఘం గట్టి నిఘా ఏర్పాటు చేసి భద్రత కల్పించాలని కోరారు.
సాక్ష్యాలు రూపుమాపే కుట్ర
సిట్ కార్యాలయం వద్ద హెరిటేజ్‌కు సంబంధించిన పత్రాలను కట్టలు కట్టలు తగలబెడుతూ అధికారులు అడ్డంగా దొరికారు. తాము నమోదు చేసిన తప్పుడు కేసుల కోసం సృష్టించిన ఫేక్ డాక్యుమెంట్లను ఎలా తగలబెట్టింది రాష్ట్ర ప్రజలందరూ చూశారు. అసలు హెరిటేజ్ డాక్యుమెంట్లను ఎందుకు తగలబెట్టాల్సి వచ్చింది? గతంలో చంద్రబాబు మొదలుకొని లోకేష్, అచ్చెన్నాయుడు, ధూళిపాళ్ల నరేంద్ర, దేవినేని ఉమా తదితరులపైన తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపారు. ఆ కేసులకు సంబంధించి తాము చేస్తున్న నిరాధారమైన ఆరోపణలు బలపర్చడానికి అనేక ఫేక్ డాక్యుమెంట్లను సైతం సిట్, సీఐడీ అధికారులు సృష్టించారు. అటువంటి ఫేక్ డాక్యుమెంట్లను సిట్ కార్యాలయం వద్ద తగలబెట్టారు. గతంలో నమోదు చేసినవన్నీ తప్పుడు కేసులు కాబట్టే అవి న్యాయస్థానాల్లో నిలబడలేదు. ఈ ఫేక్ ప్రభుత్వం కింద రఘురామ రెడ్డి వంటి కొంత మంది ఐపీఎస్ అధికారులు ఊడిగం చేస్తూ.. ఇటువంటి తప్పుడు పనులకు పాల్పడుతున్నారు. ఈ ప్రభుత్వానికి ప్రజల చేతిలో ఘోర ఓటమి తప్పదని తెలిసి తాము చేసిన చట్ట వ్యతిరేక పనులకు సంబంధించిన సాక్ష్యాలను రూపు మాపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు, లోకేష్ తదితరులపై మోపిన తప్పుడు కేసులు, ఫేక్ డాక్యుమెంట్లపై విచారణ జరుగుతుందని భయం ఏర్పడిరది. అందుకే ఫేక్ డాక్యుమెంట్లు లేకుండా చేసేందుకు సిట్ అధిపతి కొల్లి రఘురామ రెడ్డి, పోలీసు అధికారులు కుట్ర పన్నారని పట్టాభి విమర్శించారు.
ఈసీ గట్టి నిఘా ఏర్పాటు చేయాలి
డాక్యుమెంట్ల దగ్ధంపై సీఐడీ, సిట్ అధికారుల వివరణ హాస్యాస్పదంగా ఉంది. ప్రింటింగ్ లోపాలతో పనికిరాకుండా పోయిన వృథా పత్రాలను మాత్రమే దగ్ధం చేశామని అధికారులు చెప్పిన మాటలు నమ్మశక్యంగా లేవన్నారు. జిరాక్స్ మిషన్‌లో ఇరుక్కు పోయిన పేపర్లు, ప్రింటర్లో ఇంక్ అయిపోయి అస్పష్టంగా ప్రింట్ అయిన పత్రాలు అంటూ అధికారలు రకరకాల కారణాలు చెప్పడం నిజంగా సిగ్గుచేటు. ప్రింటింగ్ సరిగా రాని పత్రాలను తక్షణం చెత్త బుట్టలో వేస్తాం. అంతే కానీ.. వాటిని నెలలపాటు భద్రపరిచి ఆ తరువాత తగులబెడతారా ? ఇంతకంటే విడ్డూరమైన వాదన మరొకటి ఉంటుందా? చంద్రబాబు, లోకేష్‌లపై మోపిన తప్పుడు కేసులకు సంబంధించిన ఫేక్ డాక్యుమెంట్లు బయట పడితే మూల్యం చెల్లించుకోక తప్పదనే జగన్ సేవలో తరిస్తున్న అధికారులు వాటిని తగులబెట్టించారు. ఫెక్ డాక్యుమెంట్ల దగ్ధాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం. డాక్యుమెంట్ల దగ్ధంపై ఈసీ లోతైన విచారణ చేయాలి. సైకో పాలనలో సెక్రటేరియట్లో ఉన్న ఫైళ్లకు కూడా నేడు భద్రత లేదు. ప్రధానమైన ప్రభుత్వ కార్యాలయాల్లో సైతం ఇదే విధంగా ఫైళ్లు దగ్ధం కావని గ్యారెంటీ ఏంటి? అందుకే తక్షణం సెక్రటేరియట్, ఇతర ప్రభుత్వ కార్యాలయాల వద్ద కేంద్ర ఎన్నికల కమిషన్ గట్టి నిఘా ఏర్పాటు చేసి భద్రత కల్పించాలి.
బాబాయి గొడ్డలివేటు రక్తపు మరకలను రూపుమాపి సాక్ష్యాలను చెరిపి వేయించిన జగన్ రెడ్డి అదేవిధంగా చంద్రబాబు, లోకేష్ తదితరులపై ఉద్దేశపూర్వకంగా పెట్టించిన తప్పుడు కేసుల ఫేక్ డాక్యుమెంట్లను ఇతర సాక్ష్యాధారాలను రూపుమాపుతున్నాడు. సాక్ష్యాలను రూపు మాపడంలో తాడేపల్లి సైకో గతంలోనే పీహెడీ తీసుకున్న విషయం మనకు తెలిసిందే. ఆ ప్రావీణ్యంతోనే ఈ ఐదు సంవత్సరాలకాలంలో మద్యం, ఇసుక, మైనింగ్ తదితర వ్యవహారాల్లో తాను దోచుకున్న లక్షల కోట్లకు సంబంధించిన అనేక సాక్ష్యాలను సెక్రటేరియట్, ప్రభుత్వ కార్యలయాల్లో రూపు మాపే కార్యక్రమానికి తెరలేపాడు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకు వెళ్లి కఠిన చర్యలకు పట్టుబడతాం. లక్షల కోట్ల దోపిడీకి సంబంధించిన కీలక డాక్యుమెంట్లను మాయం చేసేందుకు జరుగుతున్న ఈ కుట్రను అడ్డుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంది. ఈ కుట్రకు ప్రత్యక్ష ఉదాహరణే సిట్ కార్యాయం వద్ద ఫైళ్ల దగ్ధం. హెరిటేజ్ ఫైళ్ల దగ్ధంపై ఎన్నికల సంఘం లోతైన విచారణ చేపట్టాలి. వైసీపీ కోసం తప్పుడు పనులు చేస్తున్న అధికారులకు కచ్చితంగా శిక్ష తప్పదు. ఇకనైనా అధికారులు పద్ధతి మార్చుకోవాలి. రెడ్ బుక్ లో పేరు ఉన్న ప్రతి అధికారిపై చర్యలు ఉంటాయని పట్టాభి హెచ్చరించారు.