- గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణం ఫైలుపై మలి సంతకం
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బుధవారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. డిప్యూటీ సీఎం హోదాలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగానూ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన పవన్‌కు అధికారులు, ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు. మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, తదితరులు పవన్‌ను కలిసి అభినందనలు తెలిపారు.
అనంతరం ఉపాధి హామీ పథకాన్ని ఉద్యాన వన సంబంధిత పనులకు అనుసంధానించి నిధుల మంజూరుపై తొలి సంతకం చేశారు. ఆ తర్వాత గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణంపై రెండో సంతకం చేశారు.
బాధ్యతల స్వీకరణ అనంతరం ఐఏఎస్ అధికారులతో ఉప ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పలు కీలక అంశాలపై చర్చించారు. గ్రామాలలో మౌలిక వసతులు, రోడ్లు నిర్మాణం, మంచినీటి ఎద్దడి నివారణ వంటి అంశాలపై ఐఏఎస్ అధికారులకు పవన్ కల్యాణ్ పలు సూచనలు చేశారు. ప్రణాళికలు సిద్ధం చేసి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. మూడు నెలల తర్వాత పనుల పురోగతిపై పునఃసమీక్ష చేస్తానన్నారు. ఈ మూడు నెలల కాలంలో నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశించారు. ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహించవద్దని అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హితవు పలికారు.