ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో త్వరలో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయా..? టీడీపీతో జనసేన పార్టీ పొత్తు దిశగా అడుగులు వేస్తోందా..? వైసీపీకి వ్యతిరేకంగా ఇరు పార్టీలు పోరాటాల్ని ఉధృతం చేయనున్నాయా..? ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారా..? అంటే రాజకీయ పరిశీలకుల నుంచి ఔననే సమాధానాలే వస్తున్నాయి. తాజా పరిణామాలపై చర్చించేందుకే చంద్రబాబుతో.. పవన్ కళ్యాణ్ భేటీ అయినప్పటికీ.. ఇరు పార్టీల మధ్య పొత్తుల ప్రస్తావనకు వచ్చినట్టు చెబుతున్నారు. దీనిపై తగిన సమయంలో ఓ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఇటీవలే ఢిల్లీలో బీజేపీ పెద్దలతో భేటీ అయిన పవన్ కళ్యాణ్.. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి స్వయంగా వెళ్ళటం..ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం ఏపీలో నెలకొన్న పరిణామాలు.. వివేకా హత్య కేసు తదితర అంశాలపై ఇరువురు నేతలు చర్చించినట్టు తెలుస్తోంది. అదే విధంగా పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన వివరాలను కూడా చంద్రబాబుతో షేర్ చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే.. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్, చంద్రబాబు మూడు సార్లు భేటీ అయ్యారు. వైసీపీ అప్రజాస్వామిక విధానాలపై పోరాటాలకు పరస్పరం సంఘీభావం ప్రకటించుకున్నారు. ఈ క్రమంలోనే ఇరు పార్టీల మధ్య పొత్తు కన్ఫామ్ అనే టాక్ కూడా వచ్చింది. కానీ.. వ్యూహాత్మకంగా ఇరు వైపుల నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు.
అయితే.. తాజాగా పవన్ కళ్యాణ్ మరోసారి చంద్రబాబుతో భేటీ కావటం రాజకీయంగా కీలక పరిణామంగా భావిస్తున్నారు. ఇటీవల మిత్రపక్షాలు, భావ సారూప్య పార్టీల పట్ల సంయమనం పాటించాలని జనసైనికులకు పవన్ అప్పీల్ చేశారు. వైసీపీ ట్రాప్‌లో చిక్కుకోవద్దని హితవు పలికారు. తెలుగుదేశం పార్టీ నేతలపై జనసైనికులు చేస్తున్న కామెంట్స్‌ను దృష్టిలో పెట్టుకునే పవన్ ఆ ప్రకటన చేశారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఇరు పార్టీల మధ్య గ్యాప్ పెరగకుండా చూడటమే పవన్ కళ్యాణ్ ఉద్దేశంగా కనిపిస్తోంది. అదే సమయంలో పొత్తులపై తేల్చాలని జనసేన శ్రేణుల నుంచి కూడా ఆయనపై ఒత్తిడి వస్తోందని అంటున్నారు. దీంతో.. అన్ని విషయాలపై చంద్రబాబుతో చర్చించేందుకు పవన్ భేటీ అయినట్టు చెబుతున్నారు. మొత్తం మీద.. టీడీపీ అధినేత చంద్రబాబుతో పవన్ భేటీతో.. ఆ రెండు పార్టీల మధ్య పొత్తు కన్ఫార్మ్ అయినట్టేనని అంతా భావిస్తున్నారు.