- ఫైనాన్స్ సెక్రటరీ సత్యనారాయణ, ఓఎస్డీ ధనుంజయరెడ్డిని విధులనుండి తప్పించాలి
- పారదర్శకతకు పాతరేసి కావాల్సిన వారికి చెల్లింపులు
- సీఈఓకు అచ్చెన్నాయుడు లేఖ
అమరావతి (చైతన్యరథం): ఆర్థికశాఖలో అవక తవకలకు పాల్పడుతున్న రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ సత్యనారాయణ, ఓఎస్డీ ధనుంజయ్‌రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. వారిద్దరినీ విధు ల నుండి తప్పించాలని కోరారు. ఈమేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈఓ)కి అచ్చెన్నాయు డు మంగళవారం లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఆర్థిక శాఖలో పారదర్శకత కోసం తెచ్చిన గత టీడీపీ ప్రభుత్వం తెచ్చిన సీఎఫ్ఎంఎస్ వ్యవస్థను నాశనం చేస్తున్నారని లేఖలో అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆర్థికశాఖ ఆధ్వర్యంలో ఉండాల్సిన సీఎఫ్ఎంఎస్ను ముఖ్యమంత్రి కార్యాలయం ఆధీనంలోకి తీసుకుంది. సత్యనారాయణ, ధనుంజయ్ రెడ్డి ఇద్దరూ కలిసి నిధులను దారి మళ్లిస్తున్నారు. ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా వైసీపీకి మద్దతుగా నిలిచే కాంట్రాక్టర్లకు సీఎఫ్ఎంఎస్ ద్వారా డబ్బులు చెల్లిస్తున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో సీఎం కార్యాలయం నుంచే అనేక చెల్లింపులు జరుగుతున్నాయి. వెంటనే ప్రత్యేక స్క్వాడ్‌ను ఏర్పాటు చేసి ఈ అక్రమాలపై విచారణ జరిపించాలి. ఫైనాన్స్ సెక్రటరీ సత్యనారాయణ, ఓఎస్డీ ధనుజయ్ రెడ్డిలను తక్షణమే విధుల నుంచి తప్పించాలని అచ్చెన్నాయుడు కోరారు.
ట్విట్టర్ హ్యాండిల్లో జగన్ ఫోటో, పథకాల సమాచారం తొలగించాలి
ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినా ఇంకా ముఖ్యమంత్రి ట్విట్టర్ హ్యాండిల్లో జగన్ ఫోటో ఉండటంపై అచ్చెన్నాయుడు సీఈఓకు రాసిన మరో లేఖలో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటికీ సీఎం ట్విట్టర్ హ్యాండిల్లో సంక్షేమ పథకాలపై సమాచారం అలాగే కొనసాగిస్తున్నారు. సీఎంకు సంబంధించి అన్ని ఫోటోలు, సంక్షేమ పథకాల సమాచారం మొత్తం ప్రభుత్వ ట్విట్టర్ హ్యాండిల్ నుండి తొలగించాలి. ఎన్నికల కోడ్‌ను విస్మరించినందుకు అధికారులపై చర్యలు తీసుకోవాలని సీఈఓను అచ్చెన్నాయుడు కోరారు.