- బాధితులను సీఎం చంద్రబాబు అన్ని విధాలా ఆదుకున్నారు
- అయినా తప్పుడు లెక్కలతో వైసీపీ బురద రాజకీయం
- సహాయక చర్యల్లో కనిపించని వైసీపీ నేతలు.. ఇప్పుడు ధర్నాల పేరిట డ్రామాలు
- వైసీపీ నేతల తీరుపై బాధితుల ఛీత్కారాలు
- సీఎం చంద్రబాబు సాయంపై వరద బాధితుల్లో సంతృప్తి
- తీరు మారకుంటే వైసీపీకి ఒక్క సీటూ రాదు
- ధ్వజమెత్తిన ఎంపీ కేశినేని శివనాథ్
అమరావతి(చైతన్యరథం): గతంలో ఎన్నడూ లేని విధంగా విజయవాడను బుడమేరు వరదలు ముంచెత్తితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొని బాధితులను అన్ని విధాలా ఆదుకుంటే వైసీపీ పేటీఎం బ్యాచ్ మాత్రం విష ప్రచారం చేస్తోందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) మండిపడ్డారు. వరద ముంచెత్తిన సమయంలో సీఎం చంద్రబాబు 12 రోజలు పాటు కలెక్టరేట్‌లోనే ఉండి, సహాయ కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షించి తమకు ఆహారం, తాగునీరు, ఇతర సరుకులు, సామగ్రి సక్రమంగా పంపిణీ అయ్యేలా చర్యలను తీసుకున్నారని బాధితులు సంతృప్తి వ్యక్తం చేస్తుంటే..వైసీపీ పేటీఎం బ్యాచ్ మాత్రం వరద సాయం కోసం చేసిన ఖర్చుపై తప్పుడు ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. వరద సహాయక చర్యల్లో ఎక్కడా కనిపించని వైసీపీ పేటీఎం బ్యాచ్ నేతలు ఇప్పుడు మాత్రం గోబెల్స్ ప్రచారంతో విజయవాడ వరద బాధితులపై కపట ప్రేమ కనబరుస్తూ ధర్నాలు చేయటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ వరద బాధితులను సీఎం చంద్రబాబు అన్ని విధాలా ఆదుకున్నారన్నారు. బాధితులందరూ తమకు సీఎం చంద్రబాబు అన్ని విధాలా అండగా ఉన్నారని ముక్తకంంఠంతో చెబుతుంటే..ప్రజలు ఛీకొట్టిన కొంత మంది నేతలు మాత్రం మొసలి కన్నీరు కారుస్తూ డ్రామాలు అడుతున్నారన్నారు. ఈ పేటీఎం బ్యాచ్ వరద సమయంలో ఒక్కరు కూడా కనిపించలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిద్రాహారాలు లేకుండా నిర్విరామంగా శ్రమించి విజయవాడ వరద బాధితులను ఆదుకున్నారు. ముంపునకు గురైన ప్రతి వీధికి వెళ్లి ప్రజలను ఓదార్చి, ధైర్యం చెప్పి, సహాయం అందించి కృషి చేశారు. విజయవాడ ప్రజలు చంద్రబాబు నాయుడు చేసిన వరద సహాయం గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. చంద్రబాబుని గెలిపించుకోవడం వల్లనే వరద విపత్తు నుంచి త్వరగా బయటపడ్డాం అని 98 శాతం విజయవాడ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఎంపీ కేశినేని తెలిపారు.
జనం చీదరించుకుంటున్నారు
ప్రజలు గట్టిగా బుద్ధిచెప్పి ప్రతిపక్ష హోదా లేకుండా చేసినా కూడా వైసీపీ నేతలు ఇంకా ఆబద్ధాలు చెప్పడం మానలేదు. వాళ్లు పొరపాటున కూడా ఒక్క నిజం చెప్పరు. వరద సాయం గురించి వైసీపీ నేతలు మాట్లాడే మాటలను చూసి విజయవాడ ప్రజలు అస్యహించుకుంటున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. కాని ప్రజలెవ్వరూ వాటిని నమ్మే పరిస్థితి లేదు. ఇదే విధంగా వ్యవహరిస్తే భవిష్యత్‌లో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదని ఎంపీ కేశినేని చిన్ని స్పష్టం చేశారు.
దేశంలోనే కొత్త ఒరవడి
వరదల వల్ల మొత్తం రూ.7,600 కోట్లు నష్టం వచ్చింది. అంతపెద్ద వరద వచ్చినా ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా ప్రజలకు మనోధైర్యాన్ని పెంచి చంద్రబాబు ప్రభుత్వం సాయం అందించింది. వరద సమయంలో 18 గంటలు పని చేసిన ఏకైన వ్యక్తి సీఎం చంద్రబాబు. వరద నీరు తగ్గిన తరువాత 350 ఫైర్ ఇంజిన్లు పెట్టి ఇళ్లు, రోడ్లు శుభ్రం చేయించి సీఎం చంద్రబాబు దేశంలోనే కొత్త ఒరవడి సృష్టించారు. 78,000 ఇళ్లను ఫైర్ ఇంజిన్లు పెట్టి శుభ్రం చేయించారు. మేం అడగకుండానే వరద బాధితులను ఆదుకోవడానికి చంద్రబాబుపై ఉన్న నమ్మకంతో ప్రజలు స్వచ్ఛందంగా రూ.450 కోట్లకు పైగా విరాళాలు అందించారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికి పరిహారం అందించాం. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మంది వరద బాధితులకు కూటమి ప్రభుత్వం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో రూ.600 కోట్లు జమ చేసింది. పేటీఎం బ్యాచ్ మాత్రం అసత్య ప్రచారంతో ప్రజలను మోసం చేస్తోంది. వీళ్లు ఏ విషయంలోనూ నిజం చెప్పరు. వీళ్లు బ్లూ బుక్ ఒకటి పెట్టారు.. వైసీపీ నేతల్లో ఎవరైతే అబద్ధాలు ఎక్కువ చెబుతారో, స్థలాలు ఆక్రమించుకుంటారో వారి పేర్లు ఆ బ్లూ బుక్ లో రాసుకుంటారట అని ఎంపీ కేశినేని ఎద్దేవా చేశారు.
సాక్షిలో తప్పుడు రాతలు
వరద బాధితులకు ఆహారం కోసం రూ.57.4 కోట్లు ఖర్చు చేశారు..కానీ సాక్షి పత్రికలో రూ. 368 కోట్లు ఖర్చు చేశారని రాసుకున్నారు. అగ్గిపెట్టెలకు రూ.23 లక్షలు అయితే.. రూ.23 కోట్లు అని వేశారు. మంచి నీళ్ల బాటిల్స్‌కు రూ.26 కోట్లు అయ్యాయి అని రాశారు. కానీ చేసిన ఖర్చు రూ.11.22 కోట్లు మాత్రమే. శానిటేషన్, క్లీనింగ్ రూ.51 కోట్లు అని రాశారు. కాని ఖర్చు చేసింది రూ.18.34 కోట్లు. నిత్యావసరాల పంపిణీకి రూ.61.28 కోట్లు అన్నారు. కాని ప్రభుత్వం ఖర్చు చేసింది రూ.63 కోట్లు. వరదల వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు చంద్రబాబు ప్రభుత్వం హెక్టార్‌కు రూ.25 వేలు ఇస్తే… వైసీపీ హయాంలో రూ.15 వేలు మించి ఏ రోజూ ఇవ్వలేదు. నీట మునిగిన ఇళ్లకు ఇప్పుడు రూ.25 వేలు ఇస్తే.. వైసీపీ హయాంలో రూ.2 వేలు నుంచి రూ.4 వేలు మాత్రమే ఇచ్చారు. అది కూడా నీతిగా, న్యాయంగా జరగలేదు. వరదల్లో దెబ్బతిన్న చిన్న, దెబ్బతిన్న మధ్య తరహా పరిశ్రమలకు రూ.50 వేల నుంచి లక్షన్నర రూపాయల వరకు ఆర్థిక సాయం అందించాం. చేనేతలకు మేము రూ.25 వేలు ఇస్తే.. వైసీపీ హయాంలో రూ.10 వేలు మాత్రమే ఇచ్చారని ఎంపీ కేశినేని వివరించారు.
జగన్ ప్రచార పిచ్చికి, విలాసాలకు రూ.4.8 వేల కోట్లు తగలేశారు
వైసీపీ హయాంలో ప్రజలకు సాయం చేయటానికి చేతులు రాలేదు కానీ, జగన్ రెడ్డి ప్రచార పిచ్చికి, విలాసాలకు మాత్రం రూ.4,878 కోట్ల ప్రజా ధనాన్ని వృథాచేశారు. వీటిలో సచివాలయాలకు రంగులు వేయడానికి రూ.3000 కోట్లు, సర్వే రాళ్ల మీద జగన్ బొమ్మ వేయడానికి రూ.700 కోట్లు, రుషి కొండమీద విలాసవంతమైన రాజ భవనానికి రూ.600 కోట్లు, ఐదేళ్లలో సాక్షి పత్రికలో జగన్ బొమ్మను చూపించడానికి రూ.500 కోట్లు, పట్టాదారు పాస్ పుస్తకం మీద జగన్ బొమ్మకు రూ.13 కోట్లు, తాడేపల్లి ప్యాలెస్ వసతుల కోసం రూ.16 కోట్లు, జగన్ ఎగ్ పఫ్‌లు తినడానికి రూ.3.5 కోట్లు, మద్యం దుకాణాల్లో ఎలుకలు పట్టడానికి రూ.కోటి 36 లక్షలు, జగన్ కుటుంబ వ్యక్తిగత పర్యటనలకి రూ.25 లక్షలు, తాడేపల్లి ప్యాలెస్‌లో తాత్కాలిక ఖర్చులకు రూ.22.5 లక్షలు ఖర్చు చేశారు. ఇదంతా ప్రజాధనం. దీన్ని దుర్వినియోగం చేశారు. ప్రజల ఆస్తులను లూటీ చేశారు. కాని కూటమి ప్రభుత్వం మాత్రం ప్రజల కోసం కష్ట పడుతోందని ఎంపీ కేశినేని అన్నారు.
ప్రజల విశ్వాసం కోల్పోయిన వైసీపీ
వరద ప్రభావిత ప్రాంతాల్లో జగన్ 15 నిమిషాలు మాత్రమే పర్యటించారు. ప్రజలు తిరగబడటంతో వెంటనే వెనుదిరిగారు. విజయవాడలో ఇప్పుడు వరద బాధితులపై లేని ప్రేమ నటిస్తూ ధర్నా చేసిన వైసీపీ నేతల్లో ఒక్కరు కూడా కష్టంలో ఉన్నప్పుడు వరద బాధితులను పరామర్శించలేదు. వైసీపీ నేతలకు తెలిసింది శవ రాజకీయాలు మాత్రమే. ప్రజల ఆస్తులు దోచుకోవడం.. దాచుకోవడం తప్ప ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం వైసీపీ నేతలకు లేదు. వరద సమయంలో మీరంతా ఏమైపోయారు. వైసీపీ నేతల గోబెల్స్ ప్రచారాన్ని ప్రజలు నమ్మరు. ఇలాంటి డ్రామాలు వేస్తే ఈ సారి ఒక్క సీటు కూడా రాదు. వైసీపీ ప్రజల విశ్వాసం కోల్పోయింది. విజయవాడను వరద విపత్తు నుంచి కాపాడిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాష్ట్ర ప్రజల తరుపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వంలో దసరా ఉత్సవాలను బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నామని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తెలిపారు.