- పండుటాకుల ఉసురు సీఎం, సీఎస్‌కు తగలకపోదు
- డబ్బులు అకౌంట్లో వేస్తే వృద్ధులు తీసుకోగలుగుతారా?
- పెన్షన్ల కోసం బ్యాంకులు చుట్టూ తిప్పి అవస్తలు పెట్టారు
- అధికారంలోకి రాగానే రూ.4వేలు పింఛను ఇంటిదగ్గరే ఇస్తా
- ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు చేసి భూములు రక్షిస్తా
- మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తాం
- వెలిగొండను పూర్తి చేసి, పొదిలికి నీరు అందిస్తాం
- ఎర్రచందనం స్మగ్లర్ చెవిరెడ్డిని తరిమికొట్టండి
- పొదిలి ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు
- ఎన్నికల సభకు పోటెత్తిన ప్రజా కెరటం
మార్కాపురం/పొదిలి (చైతన్య రథం): రాష్ట్రంలో పింఛను లబ్దిదారుల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రకాశం జిల్లా పొదిలి చిన్నబజారు కూడలిలో శుక్రవారం నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో 1.5లక్షల మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారని, ఒక్కో ఉద్యోగి 40మందికి పింఛను అందించినా.. లబ్దిదారులకు ఇంటిదగ్గర పింఛను అందించే అవకాశం ఉండేదన్నారు. సులువుగా పూర్తి చేసే పనిని కష్టతరం చేస్తూ.. పండుటాకుల్లాంటి ముసలివాళ్లను బ్యాంకుల చుట్టూ తిప్పుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సైకో జగన్ పెన్షన్ తీసుకునే పేదవారిని, వృద్ధులను రోడ్డు మీదకు తెచ్చి పొట్టనపెట్టుకున్నాడు. ఈనెలలో అయినా పెన్షన్లను ఇంటి వద్దకు వెళ్లి అందించాలని ప్రభుత్వాన్ని కోరితే ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి కుదరదని ఎన్నికల అధికారికి లేఖ రాశాడు. ఇప్పుడు పెన్షన్లను బ్యాంకు ఖాతాల్లో వేసి వృద్ధులను బ్యాంకుల చుట్టూ తిప్పి వేధిస్తున్నారు. అకౌంట్లో డబ్బులు వేస్తే వృద్ధులు తీసుకోగలరా? అని చంద్రబాబు నిలదీశారు. పాలకపక్షం రాజకీయ కుట్రలో సీఎస్ భాగం కావడం దారుణమని, పేదల ఉసురు తగలకపోదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పింఛనుదారులకు తాను పెద్ద కొడుకులా ఉంటానని అంటూ.. కూటమి ప్రభుత్వం రాగానే నెలకు రూ.4వేల పింఛను ఇంటి వద్దే ఇచ్చే బాధ్యత తమదేనని చంద్రబాబు హామీ ఇచ్చారు.
ఎర్రచందనం స్మగ్లర్‌తో జాగ్రత్త
‘‘40 ఏళ్లుగా ప్రజా సేవలో ఉన్న మాగుంట కుటుంబాన్ని కాదని, తిరుపతి నుంచి ఎర్రచందనం స్మగర్‌ను వైసీపీ ఎంపీ అభ్యర్థిగా తీసుకొచ్చింది. ఒంగోలు ప్రాంతానికి నాయకుడు కావాలా? స్మగ్లర్ కావాలా? అని వైసీపీ ఎంపీ అభ్యర్థి భాస్కర్‌రెడ్డిని విమర్శించారు. నల్లమల ఫారెస్ట్‌లో ఎర్రచందనం మొత్తం మాయమయ్యే పరిస్థితి వచ్చింది. అందుకు కారకుడు భాస్కర్‌రెడ్డి. అలాంటి వ్యక్తి ఇక్కడికి వస్తే ఏం జరుగుతుందో ప్రజలు ఆలోచించాలి అని చంద్రబాబు సూచించారు. సీఎం జగనుకు మంచి చేయడం తెలీదుకానీ, మాఫియాలు నడపడంలో సిద్ధహస్తుడని, ఇసుక, మద్యం గనుల మాఫియా సొమ్మంతా జగను ప్యాలెసుకే చేరుతోందని చంద్రబాబు దుయ్యబట్టారు. ఉద్యోగులపై 1500 కేసులుపెట్టి వేధించిన సైకో ముఖ్యమంత్రి, 2014లో తండ్రిలేని బిడ్డనని చెప్పి ఓట్లు వేయించుకున్నాడు. 2019లో చిన్నాన్నను చంపేశారని సానుభూతి నాటకమాడి ఓట్లు కొట్టేశాడు. ఇప్పుడు గులకరాయి డ్రామా ఆడుతున్నారు. నాటకాల జగన్ రాష్ట్రానికి అవసరమా? అని చంద్రబాబు ప్రశ్నించారు.
వెలిగొండ పూర్తిచేసి మార్కాపురం, పొదిలిని ఆదుకుంటాం
మార్కాపురం నియోజకవర్గంలో సాగునీరు లేదు, త్రాగునీరు లేదు, బోరుపడే పరిస్థితి లేదు. ఉపాధి పనులు లేక వలసలు వెళ్లాల్సిన పరిస్థితులు. ఈ ప్రాంతంలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి ప్రత్యేకంగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతంలో వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేసి నీరు ఇవ్వాలని గతంలో మీరు నన్ను అడిగితే ఆ పనులు పరుగులు పెట్టించాను. మెయిన్ ఛానల్ పనులు 80శాతం పూర్తిచేశాను. రెండో ఛానల్ 60శాతం పూర్తి చేశాను. అధికారంలో ఉండి ఉంటే 2020నాటికి వెలిగొండను పూర్తిచేసి నీళ్లను అందించేవాడిని అని చంద్రబాబు వివరించారు. ఈ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి రిబ్బన్ కత్తిరించాడుగానీ, నీళ్లివ్వలేకపోయాడని, జగన్‌ని అంతా డ్రామాయేనన్నారు. తాను అధికారంలోకి వచ్చాక వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి అన్ని విధాలా ఆదుకుంటానన్నారు. పొదిలి మండలాన్ని వెలిగొండ ఆయకట్టులో చేరుస్తానని, దొనకొండ అందుబాటులో ఉంది కనుక పరిశ్రమలు వచ్చే పరిస్థితి ఉందని, రామాయపట్నం పోర్టు వస్తే చాలా ఆదాయం వస్తుందని బాబు వివరించారు. జగన్ పాలనలో ఇవేమీ చేయకున్నా, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పడు ఇండోనేషియాకు చెందిన ఏషియా పల్ప్ అండ్ పేపర్ పరిశ్రమ రూ.25వేల కోట్ల పెట్టుబడితో వస్తే దాన్ని జగన్ రెడ్డి తరిమేశాడన్నారు. జిల్లాకు న్యాయం జరగాలంటే టీడీపీతోనే సాధ్యమని చంద్రబాబు అన్నారు.
జగన్ ఫోటోలు పిచ్చి పరాకాష్టకు చేరింది
భూమి మనది. చుట్టూ ఉన్న హద్దు రాళ్లు, పట్టాదార్ పాసు పుస్తకంపై ఫొటోలు జగన్‌వి. ఒక మనిషి అరాచకానికి పరాకాష్ట ఇది. రేపటినుంచి మీ భూమికి ఒరిజినల్ దస్తావేజులు, పాస్ బుక్, అడంగల్స్ ఉండవు. అన్నీ ఆన్లైన్లోనే. ఇదంతా జగన్ మాయ. మీ ఆస్తి ఇతరులకు రాయొచ్చు. తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకోవచ్చు. జవాబుదారీ తనం ఉండదు. మీరు ఆత్మహత్యలు చేసుకున్నా పట్టించుకునే వారే ఉండరు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు వల్ల ఉపయోగం లేదు. ఈ చట్టం రైతు మెడకు ఉరితాడుగా మారుతుంది. ప్రమాదకరమైన చట్టాన్ని రద్దు చేయాలని వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. భయంకర చట్టం తెచ్చిన జగన్‌రెడ్డిని, వైసీపీని బంగాళాఖాతంలో కలిపేయాలి. దీనికి మార్కాపురం ప్రజలు సిద్ధం కావాలి. నేను ముఖ్యమంత్రి అయ్యాక పెట్టే రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు మీదే అని చంద్రబాబు ప్రకటించారు.
సూపర్ సిక్స్‌తో అభివృద్ధి, సంక్షేమం
టీడీపీ, జనసేన, బీజేపీలు డబుల్ ఇంజిన్ సర్కార్ స్థాపనకు కృషి చేస్తున్నామని చంద్రబాబు అన్నారు. రాష్ట్రం, కేంద్రం కలిసి ఏపీని అభివృద్ధి చేస్తామని, కేంద్రం, రాష్ట్ర ప్రణాళికలు కలిపి అమలు చేస్తే ప్రజలందరికీ మేలు కలుగుతుందన్నారు. తాను ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు సిసలైన సంక్షేమానికి ప్రతీకలంటూ, రాష్ట్ర మహిళలకు 4 ప్రత్యేక కార్యక్రమాలు ప్రకటించామన్నారు. ప్రతి మహిళకు నెలకు రూ.1,500, ఐదేళ్లలో 90వేలు అందిస్తామని, తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్థికి సంవత్సరానికి రూ.15వేలు చొప్పున ఎందరుంటే అందరికీ ఇస్తామని, ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు అందిస్తామన్నారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెబుతూ, కేంద్రం నారీశక్తి పేరుతో 3కోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా తీర్చిదిద్దనుందని వివరించారు. రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాలకు రూ.10లక్షలు వడ్డీలేని రుణాలు ఇవ్వనున్నామన్నారు.
జాబు రావాలంటే బాబు రావాలన్న యువత కాంక్షను గెలిపిస్తూ సీఎంగా తొలి సంతకం మెగా డీఎస్సీపైనేనని చంద్రబాబు వెల్లడిరచారు. రాష్ట్ర యువతకు 5ఏళ్లలో 20లక్షల ఉద్యోగాలు అందిస్తామని, నిరుద్యోగులకు ప్రతినెల రూ.3వేలు భృతి అందిస్తామన్నారు. చంద్రన్న బీమాను పునరుద్ధరిస్తామని, మరణానికి రూ.5లక్షలు, ప్రమాదంలో మరణిస్తే రూ.10లక్షలు ఇస్తామన్నారు. ఆరోగ్య బీమా ద్వారా ప్రతి కుటుంబానికి రూ.20లక్షలు వరకు ఉచిత వైద్యం అందించే ఏర్పాటు చేస్తామన్నారు.
బీసీ, ఎస్సీ ఎస్టీ, మైనారిటీలను ఆదుకుంటాం
మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్లు అందివ్వనున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. ఖబరస్తాన్, ఈద్గాలకు స్థలాలు కేటాయిస్తామని, ప్రభుత్వోద్యోగాల్లో 4శాతం రిజర్వేషన్ అమలు చేస్తామన్నారు. హజ్ యాత్రకు లక్ష ఆర్థికసాయం, రూ.5లక్షల వడ్డీలేని రుణాలు ఇప్పించే బాధ్యత తనదన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేసామని, బీసీలకు బీసీ డిక్లరేషన్ ప్రకటించామన్నారు. ఎస్సీలకు జిల్లాల వారీగా రిజర్వేషన్ క్యాటగిరీ అమలు చేస్తామని మాదిగలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మార్కాపురం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థులు నారాయణ రెడ్డిని ఎమ్మెల్యేగా, మాగుంట శ్రీనివాసులురెడ్డిని ఎంపీగా గెలిపించాలని చంద్రబాబు కోరారు.
మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటుకు హామీ
మార్కాపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. పొదిలి మండలానికి తాగు, సాగు నీరు అందించే బాధ్యత నేను తీసుకుంటానన్నారు. రింగ్ రోడ్డు ఏర్పాటుతో ట్రాఫిక్ సమస్యను పరిష్కరిసానని, డ్రైనేజీ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీ, ఎమ్మార్పీఎస్ నాయకులంతా కలిసి మే 13న రాష్ట్ర ప్రజల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలను విజయవంతం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.