- అవ్వాతాతలపై ప్రభుత్వ కక్షకు అధికారుల వత్తాసు
- నగదు లేక సచివాలయాల వద్ద వృద్ధుల పడిగాపులు
- ఈసీ ఆదేశాలు ధిక్కరిస్తున్న వైసీపీ కార్యకర్తలు
- లబ్ధిదారులను మంచాలపై మోసుకొస్తున్నా పట్టించుకోని అధికారులు
అమరావతి: వైసీపీ కార్యకర్తలు ఎన్నికల కమిషన్ ఆదేశాలను ధిక్కరిస్తూ పింఛన్‌దారులను మంచాలపై మోసుకొస్తుంటే అధికారులు, పోలీసులు చోద్యం చూస్తున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీ ఆదేశాలను ప్రభుత్వం పాటించకుండా పెన్షన్ దారులను సచివాలయాలకు వచ్చి పెన్షన్ తీసుకోవాలని చెప్పడం దుర్మార్గమైన రాజకీయ కుట్ర అన్నారు. దీనిపై బుధవారం ఎన్నికల కమిషన్‌కు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)కి వర్ల రామయ్య లేఖ రాశారు. పేదలపై ప్రభుత్వం కక్ష పట్టినట్లుగా వ్యవహరిస్తుంటే, దీనికి అధికారులు వత్తాసు పలకడం దుర్మార్గమన్నారు. సచివాలయాల్లో పింఛన్లు ఇస్తారని ప్రభుత్వం చెప్పటంతో లబ్ధిదారులు ఉదయం నుంచే అక్కడకు చేరుకుని పడిగాపులు కాస్తున్నా సాయంత్రం వరకు సచివాలయాలకు నగదు చేరలేదన్నారు. మరోపక్క కదలలేని పరిస్థితుల్లో ఉన్న వృద్ధులకు ఇళ్లవద్దకే వెళ్లి పింఛన్ పంపిణీ చేయాలని ఆదేశాలు ఉన్నప్పటికీ, వైసీపీ కార్యకర్తలు మంచాలపై వృద్ధులను మోసుకువస్తూ.. ఈసీ ఆదేశాలను ధిక్కరిస్తుంటే అధికారులు, పోలీసులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే నగదు విడుదల చేసి ఇళ్ళ వద్దనే పింఛన్ ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని తెలుగుదేశం డిమాండ్ చేస్తోందన్నారు. లబ్ధిదారులకు జరిగే కష్ట నష్టాలకు ప్రభుత్వానిదే బాధ్యత అని వర్ల రామయ్య అన్నారు.