- ఎర్రచందనం స్మగ్లింగ్‌కు అడ్డొచ్చినోళ్లను నరికేస్తున్నారు
- ఏ పెత్తందారుకీ యువత భయపడాల్సిన పని లేదు
- ధైర్యం లేని సమాజంలో మార్పు రాదు
- కూటమి గెలుపుతోనే వాళ్ల ఆటలు కట్టు
- రైల్వేకోడూరు ఉమ్మడి సభలో పవన్ కళ్యాణ్ పిలుపు
రైల్వేకోడూరు (చైతన్యరథం): ‘కష్టాలు, త్యాగాలు, బలిదానాలు మనవి. సంపద జగన్ రెడ్డి, మిథున్‌రెడ్డి, పెద్దిరెడ్డిదా..? వీళ్లకు దోపిడీ మీద ఉన్న ధ్యాస పాలన మీద లేదు. ఈ ఐదేళ్ల కాలంలో 30 వేలమంది ఆడబిడ్డలు రాష్ట్రం నుంచి అదృశ్యమైతే వీళ్లకు పట్టదు. రాయలసీమ ఏమైనా జగన్ గుత్తాధిపత్యమా..?’ అని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఎర్రచందనాన్ని ఇంధనంలా వాడుకుంటున్నారని, అడ్డొచ్చినోళ్లను నరికేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చేది కూటమి ప్రభుత్వమే. ప్రజలను బాధిస్తున్న ప్రతి ఒక్క వైసీపీ గూండాన్ని వీధుల్లోకి లాక్కొస్తామని హెచ్చరించారు. గురువారం రైల్వే కోడూరులో నిర్వహించిన కూటమి బహిరంగ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ‘వైసీపీ పాలనతో ప్రజలు విసిగిపోయారు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా మార్పు కోసం రోడ్ల మీదకు వస్తున్నారు. నిజంగా యువత ధైర్యం చేసి రోడ్లమీదకు వస్తే జగన్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, పెద్దిరెడ్డి రోడ్ల మీదకు రాగలరా..? నేను వచ్చినప్పుడు బయటకు రావడం కాదు. తప్పు జరిగినప్పుడు బయటకు రావాలి’ అని ఆవేశంగా నిలదీశారు. జగన్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, గంగిరెడ్డి, పెద్దిరెడ్డివంటి వారికి భయపడతారా..? మనం గొడవలకు దిగనక్కర్లేదు. కత్తులు, కర్రలు తీయనక్కర్లేదు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించండి చాలు. వీరి అరాచకాలకు చరమగీతం పాడుదాం అని పవన్ యువతకు పిలుపిచ్చారు.
ధైర్యంగా ఉంటేనే మార్పు వస్తుంది
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందిస్తామని, సీపీఎస్‌కు బలమైన పరిష్కారం చూపిస్తామని పవన్ హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం పోలీసు శ్రమను దోపిడీ చేసింది. కూటమి అధికారంలోకి రాగానే పోలీసులకు టీఏ, డీఏలు సకాలంలో ఇవ్వడంతో పాటు వారంతపు సెలవులు ఇస్తామన్నారు. రాజంపేట లోక్ సభ స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, రైల్వే కోడూరు శాసనసభ కూటమి అభ్యర్థి అరవ శ్రీధర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని పవన్ విజ్ఞప్తి చేశారు.