- వర్షాలపై విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలి
- ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలి
- విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
- బాపట్ల జిల్లాలో పరిస్థితిపై కలెక్టర్‌తో సమీక్ష
అమరావతి(చైతన్యరథం): ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సూచించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని, ప్రమాదాల నివారణపై అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు అవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని కోరారు. విద్యుత్ తీగలు తెగిపడినా, కిందకు జారిన వెంటనే సమీప అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. తాకడం, పక్కకు నెట్టడం లాంటి పనులు చేయవద్దని కోరారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపైన అధికారులు తక్షణమే స్పందించి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని, అలసత్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు సీఎంతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడిన మంత్రి బాపట్ల జిల్లాలో పరిస్థితిని వివరించారు. సీఎం సూచనలతో జిల్లా కలెక్టర్‌ను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలను తరలించేలా చర్యలు తీసు కోవాలని సూచించారు. బాపట్ల జిల్లాలో జరుగుతున్న పెన్షన్ల పంపిణీపైనా కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. పింఛన్ల పంపిణీ విషయంలో సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం వెసులు బాటు కల్పించిందని, వచ్చే రెండు మూడురోజుల్లో పింఛన్ల పంపిణీ పూర్తి చేయవచ్చని తెలిపారు.