అమరావతి: తనపై నమ్మకంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని రాష్ట్ర చిన్న, మధ్య, సూక్ష్మ పరిశ్రమల, సెర్ప్, ఎన్నారై సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర సచివాలయంలోని ఐదవ భవనంలో గురువారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. కుటుంబ సమేతంగా సచివాలయం చేరుకున్న మంత్రి.. వేద పండితుల ఆశీర్వచనాల మధ్య శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం బాధ్యతలు చేపట్టి తొలుత శాఖాపరమైన ఫైల్స్ పై సంతకాలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఆశీస్సులతో తనకు అప్పగించిన ఈ బాధ్యతలను అత్యంత క్రమశిక్షణతో నిర్వహిస్తానన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపేందుకు ముఖ్యమంత్రి కొత్తగా మూడు శాఖలను సమన్వయం చేస్తూ ఏర్పాటు చేసిన ఈ శాఖల ద్వారా రాష్ట్రంలో చిన్న పరిశ్రమల ఏర్పాటు, ఎన్నారైల సహకారంతో యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడానికి, డ్వాక్రా గ్రూప్ మహిళల పారిశ్రామిక ఎదుగుదలకు ఒక రోడ్ మ్యాప్‌ను త్వరలోనే రూపొందిస్తామని మంత్రి తెలిపారు. ఇరవై ఆదర్శ మండలాలకు పది లక్షల రూపాయల చొప్పున నిధులు, ఎస్సీ, ఎస్టీ, ఎస్‌హెచ్‌జి లకు అందుబాటులో ఉన్న నిధులతో వడ్డీలేని రుణాలు మంజూరు చేస్తూ రెండు ఫైళ్ల పై బాధ్యతలు స్వీకరిస్తూ తొలి సంతకాలు చేశానని మంత్రి శ్రీనివాస్ తెలిపారు. ప్రిన్సిపల్ కార్యదర్శి శశి భూషణ్ కుమార్, పరిశ్రమలశాఖ కార్యదర్శి డాక్టర్ ఎన్. యువరాజ్, సంబంధిత శాఖల అధికారులు, ఉద్యోగులు మంత్రిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు.