- టౌన్ ప్లానింగ్‌లో నిబంధనలపై ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం
- ఇకపై ప్రతివారం దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్
- ప్రత్యేక వెబ్‌సైట్‌లో ప్రజలకు అనధికార లేఅవుట్ల వివరాలు
- రెవెన్యూ శాఖతో టౌన్ ప్లానింగ్ అనుసంధానం వల్ల మేలు
- ఆర్ 5 జోన్‌లో పట్టాలు పొందిన వారికి సొంత ప్రాంతాల్లో ఇళ్లు
- నేటి నుంచి అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనుల ప్రారంభం
- బిల్డర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం
విజయవాడ(చైతన్యరథం): రాష్ట్రంలో లేఅవుట్లు, భవన నిర్మాణాలకు అనుమతులను నిబంధనలను సరళీకృతం చేస్తామని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఇదే సమయంలో నిబంధనలను ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహ రిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పలు బిల్డర్ల అసోసియేషన్ ప్రతినిధులతో విజయ వాడలోని సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో మంగళవారం మంత్రి నారాయణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సీఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్, అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్ పర్సన్ లక్ష్మీ పార్ధసారథిóతో పాటు క్రెడాయ్, నరెడ్కో, బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు హాజరయ్యారు.
2014 నుంచి 2019 వరకూ బిల్డర్లకు స్వర్ణయుగమని, గత ప్రభుత్వం తీరుతో తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో మళ్లీ రియల్ ఎస్టేట్ రంగానికి ఊపు వచ్చేలా నిర్ణ యాలు తీసుకోవాలని అసోసియేషన్ల ప్రతినిధులు కోరారు. నాలా ట్యాక్స్, వేకెంట్ ట్యాక్స్, ఫైర్ అనుమతులు, ఎయిర్ పోర్ట్, టీడీఆర్ బాండ్ల విషయాల్లో తమకు ఎదుర వుతున్న ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఆన్‌లైన్ అనుమతుల జారీలో ఉన్న సమస్యలను కూడా మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సమావేశం ముగిసిన తర్వాత మంత్రి పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు.
టౌన్ ప్లానింగ్‌లో దరఖాస్తుల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్
టౌన్ ప్లానింగ్ విభాగం ద్వారా నిబంధనల జారీని సరళీకృతం చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామని వివరించారు. అనుమతుల విషయంలో ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న నిబంధనలను అధ్యయనం చేసేందుకు టౌన్ ప్లానింగ్ విభాగం నుంచి అధికారుల బృందాలను పంపిస్తున్నామని తెలిపారు. టౌన్ ప్లానింగ్ విభాగంపై సీఎం చంద్రబాబు స్పెషల్ డ్రైవ్ చేయాలని తనకు చెప్పారని, ఇప్పటికే నెల్లూరు కార్పొరేషన్‌లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించామని తెలిపారు.
ఇకపై ప్రతి వారం ఒక మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ దరఖాస్తుల పరిష్కారానికి డ్రైవ్ చేస్తామన్నారు. బిల్లర్లకు రెవెన్యూ పరమైన అం శాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నందున టౌన్ ప్లానింగ్ విభాగాన్ని రిజిస్ట్రేషన్ విభాగంతో అనుసంధానం చేస్తామని చెప్పారు. ఇప్పటికే దీనికి సంబంధించి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌తో చర్చించినట్లు తెలిపారు. రెండు శాఖలను ఇంటిగ్రేట్ చేయడం ద్వారా ప్రజలకు సౌలభ్యంగా ఉంటుందన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిబంధనలు సరళీకృతం చేస్తామని…ఇదే సమయంలో రూల్స్‌ను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
అనధికార లేఅవుట్లపై స్పెషల్ ఫోకస్
రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా కొంతమంది లేఅవుట్లను నిర్మిస్తున్నారని మంత్రి తెలిపారు. ఇలాంటి చోట్ల ప్లాట్లను కొనుగోలు చేయడం, భవన నిర్మాణాలు చేయడం ద్వారా ప్రజలు మోసపోతున్నారని చెప్పారు. అందుకే అనధికార లేఅవుట్ల సర్వే నెంబర్లను పేపర్‌లు, టీవీల ద్వారా ప్రజలకు తెలియజేస్తామన్నారు. ఆయా సర్వే నెంబర్లు రిజిస్ట్రార్ ఆఫీస్‌కు ఇవ్వడం ద్వారా ప్లాట్లు కొనుగోలు చేయాలనుకునే వారికి పూర్తి వివరాలు తెలుస్తాయని, దీని కోసం రాబోయే మూడునెలల్లో ప్రత్యేక వెబ్‌సైట్ రూపకల్పన చేస్తామని వివరించారు.
అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు
అమరావతిలో దట్టంగా పేరుకుపోయిన జంగిల్ క్లియరెన్స్ పనులు బుధవారం నుంచి ప్రారంభిస్తామని చెప్పారు. మొత్తం 58 వేల ఎకరాల్లో ఉన్న తుమ్మ చెట్లు, ముళ్ల కంపలను నెలరోజుల్లోగా తొలగించేలా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. దీని ద్వారా భూములు కేటాయించిన వారికి తమ స్థలంపై అవగాహన వస్తుందన్నారు. మొత్తం 99 డివిజన్లలో ఒకేసారి పనులు ప్రారంభం అవుతాయని తెలిపారు.
ఆర్ 5 జోన్ వారికి సొంత ప్రాంతాల్లో ఇళ్లు
రాజధానిలోని ఆర్ 5 జోన్‌లో గతంలో స్థలాలు పొందిన వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్టు చెప్పారు. ఎవరికైతే అక్కడ స్థలాలు కేటాయించారో వారిని గుర్తించి వారి వారి సొంత ప్రాంతాల్లో స్థలాలు ఇవ్వడం లేదా టిడ్కో ఇళ్లు కేటాయిస్తామని చెప్పారు. సీఆర్డీఏలో లబ్ధిదారులు ఉంటే వారికి అక్కడే ఇళ్లు కేటాయిస్తామని తెలిపారు.