- కడప జిల్లాలో దారుణం
- వివరాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి
- విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై ఆరా
- ఘటనా స్థలికి జిల్లా ఎస్పీ, అధికార్లు
బద్వేల్: కడప జిల్లా బద్వేలు సమీపంలో విద్యార్థినిపై పెట్రోల్ దాడి ఘటన కలకలం రేపింది. బద్వేలు పట్టణంలోని రామాంజనేయనగర్‌కు చెందిన విద్యార్థిని స్థానిక ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. అదే కాలనీకి చెందిన విఘ్నేశ్ తరచూ ఆమె వెంటపడుతుండేవాడు. బాలికను 8వ తరగతి నుంచే ప్రేమ పేరుతో వేదిస్తున్నాడు. ఇటీవలే విఘ్నేష్‌కు వివాహం కాగా.. అతని భార్య గర్భవతి కూడా. అయినా విద్యార్థిని వెండపడటం ఆపలేదు. శనివారం మధ్యాహ్నం కళాశాలలో ఉన్న విద్యార్థినికి ఫోన్ చేసి కలవాలని చెప్పాడు. ఈరోజు తనను కలవకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఫోన్లో బెదిరించాడు. దీంతో గత్యంతరం లేని స్థితిలో బాలిక కళాశాల నుంచి ఆటోలో బయలుదేరింది. బద్వేలు పాలిటెక్నిక్ కళాశాల వద్ద నిందితుడు కూడా ఆటో ఎక్కాడు.
ఇద్దరూ బద్వేలుకు పది కిలోమీటర్ల దూరంలోని సెంచురీ ప్లైవుడ్ పరిశ్రమ సమీపంలోని ముళ్లపొదల్లోకి వెళ్లారు. అక్కడ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు విఘ్నేశ్. కాలిన గాయాలతో కేకలు వేస్తుండగా.. సమీపంలోని పొలాల్లో పని చేస్తున్న కూలీలు వచ్చి ఆమెను రక్షించారు. నిందితుడు పరారయ్యాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాహనంలో బద్వేలు ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు తరలించారు. 80 శాతం కాలిన గాయాలతో ఇంటర్ విద్యార్థిని ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థిని నుంచి జిల్లా జడ్జి వాంగ్మూలం నమోదు చేసుకున్నారు.
వివరాలు తెలుసుకున్న సీఎం చంద్రబాబు
కడప జిల్లాలో చోటుచేసుకున్న దారుణ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారుల నుంచి ఫోన్ సమాచారం తీసుకున్న సీఎం.. కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వెంటనే నిందితుడిని అరెస్టు చేయాలని ముఖ్యమంత్రి పోలీస్ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఘటనా స్థలికి చేరిన జిల్లా ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.