- పర్యాటకులను ఆకర్షించేలా టూరిజం అభివృద్ధి
- ఒబెరాయ్ ప్రతినిధులతో మంత్రి దుర్గేష్ చర్చ
ఆత్రేయపురం (చైతన్య రథం): సహజసిద్ధ పకృతి రమణీయత ప్రాంతంగా విరాజిల్లుతున్న పిచ్చుకలంకకు పర్యాటక శోభనిచ్చేలా అడుగులు వేస్తున్నామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. సోమవారం ఆత్రేయపురం మండలం పిచ్చుకలంకలో పర్యాటకరంగ అభివృద్ధిపై ఒబెరాయ్ ప్రతినిధులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఓబెరాయ్ హోటల్స్ ప్రతినిధులు పిచ్చుకలంక గ్రామాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారన్నారు. కొద్దిరోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన ఒబెరాయ్ ప్రతినిధులు.. పిచ్చుకలంక పర్యాటక అభివృద్ధిపై చర్చించారన్నారు. ఇప్పటికే గండికోట, తిరుపతి, విశాఖపట్నం ప్రాంతాల్లో రిసార్టుల నిర్మాణంతో ఏపీ పర్యాటక అభివృద్ధిలో భాగస్వాములయ్యేందుకు సీఎంతో చర్చించారన్నారు.
అలాగే, రాజమండ్రి వద్ద పిచ్చుకలంకలో పర్యాటకులను ఆకర్షించేలా ప్రకృతి సంపద ఉందని, ఈ ప్రాంతాన్నీ పరిగణనలోకి తీసుకోవాలని ఒబెరాయ్ ప్రతినిధుల బృందానికి అప్పుడే సూచించానని, ఈమేరకు ప్రతినిధి బృందం నేడు పిచ్చుకల్లంక గ్రామాన్ని సందర్శించినట్టు మంత్రి వివరించారు. కార్యక్రమంలో బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందం, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్యచౌదరి, ఒబెరాయ్ హోటల్స్ ప్రతినిధులు ఆర్ శంకర్, నవీన్ గోస్వామి, మాలూన్ తానేజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో పెద్దస్థాయిలో రిసార్టులు నిర్మించి టూరిజాన్ని అభివృద్ధి చేస్తే ఉభయగోదావరి జిల్లాలోని దేవాలయాలకు వచ్చే యాత్రికులు అన్నవరం సత్యనారాయణ స్వామి, సామర్లకోట భీమేశ్వరస్వామి, ధవళేశ్వరంలో లక్ష్మిజనార్ధనస్వామి, అంతర్వేది, కోరుకొండలలో లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాలు టెంపుల్ టూరిజంగా ఉన్నాయని ఈ సందర్భంగా ప్రతినిధుల బృందానికి మంత్రి, ఎమ్మెల్యేలు, కలెక్టర్ వివరించారు.
మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో పర్యావరణానికి హితమైన ఎకో టూరిజం, రాజమహేంద్రవరంలో గోదావరితీరం, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కేరళను తలపించే విధంగా ప్రకృతి అందాలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. కేవలం టెంపుల్ టూరిజానికే పరిమితం కాకుండా పర్యాటకులను ఆకర్షించేలా టూరిజాన్ని అభివృద్ధి చేయవచ్చన్నారు. ఈ ప్రాంతాన్ని సందర్శించే పర్యాటకులు కేవలం ఒక్కరోజు మాత్రమే కాకుండా రెండు మూడు రోజులు ఉండేలా గోదావరి జిల్లాలోని అన్ని ప్రాంతాలనూ పర్యాటక అభివృద్ధి దిశగా చర్యలు చేపడుతున్నట్టు మంత్రి దుర్గేష్ వివరించారు. కడియం నర్సరీ ఆసియాలోనే ద్వితీయస్థానాన్ని ఏర్పరచుకుందని, దాన్ని అభివృద్ధి చేసేదిశగా కెనాల్ బోట్ షికార్ ఏర్పాటు దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు.
ఈ ప్రాంతంలో పర్యాటక రంగ అభివృద్ధికి ఒబెరాయ్ సంస్థ భాగస్వాములవుతారని, వారికి ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, పర్యాటక మంత్రిగా తాను అన్ని విధాల సంపూర్ణ సహకారాన్ని అందించడం జరుగుతుందని దుర్గేష్ వివరించారు. కార్యక్రమంలో పర్యాటక శాఖ ప్రాంతీయ సంచాలకులు వి. స్వామినాయుడు, జిల్లా పర్యాటక అభివృద్ధికారి పి వెంకటాచలం, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జిఎస్‌వివి సత్యనారాయణ, స్థానిక నాయకులు బండారు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.