అమరావతి: హత్యాయత్నం కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. సోమవారం ఇరువైపులా వాదనలు విన్న కోర్టు.. తీర్పును మంగళవారం ఇస్తామని తెలిపింది. ఎన్నికల పోలింగ్ సమయంలో పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేయగా.. అడ్డుకోబోయిన తెదేపా ఏజెంట్ నంబూరి శేషగిరిరావు పై దాడి చేసి, హత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. అలాగే, ఈవీఎం ధ్వంసం చేసి బయటకు వస్తున్న సమయంలో ఓ మహిళపైనా దుర్భాషలాడారు. కారంపూడిలో సీఐపై దాడి చేసిన ఘటనలో ఎమ్మెల్యే పిన్నెల్లిపై హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి.
ఈ మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పిన్నెల్లి పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈవీఎంను పగలగొట్టిన కేసులో జూన్ 6 వరకు అరెస్టు చేయవద్దంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు నెరవేరకుండా పోలీసులు చూస్తున్నారన్నారు. పోలీసుల తరపున పీపీ వై నాగిరెడ్డి వాదనలు వినిపించారు. ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించే సమయంలో హైకోర్టు విధించిన షరతులను పిన్నెల్లి ఉల్లంఘించారన్నారు. అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వుల ఎత్తివేతకు చర్యలు తీసుకోవాలని పల్నాడు ఎస్పీ నుంచి తనకు సూచనలు అందాయన్నారు. పిన్నెల్లి తీవ్ర నేరాలకు పాల్పడ్డారని కోర్టుకు తెలిపారు. మధ్యంతర బెయిలు మంజూరు చేయవద్దని కోరారు. ఓట్ల లెక్కింపు రోజున అల్లర్లు సృష్టించే అవకాశం ఉందన్నారు.
పిన్నెల్లి దాడి బాధితుడు సీఐ నారాయణస్వామి తరపు న్యాయవాది అశ్వనీకుమార్ వాదనలు వినిపించారు. హత్యాయత్నం వంటి తీవ్ర నేరాలకు సంబంధించిన కేసుల్లో అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడాన్ని ఓ కేసులో సుప్రీంకోర్టు తప్పుపట్టిందని గుర్తు చేశారు. బెయిలు మంజూరు సమయంలో పిన్నెల్లి పూర్వ నేర చరిత్రను సైతం పరిగణనలోకి తీసుకోవాలని కోర్టును కోరారు. 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లోనూ పిన్నెల్లి ఇదే తరహా నేరాలకు పాల్పడ్డారని కోర్టు దృష్టికి తెచ్చారు. అలాంటి వ్యక్తికి బెయిల్ మంజూరు చేయొద్దని కోరారు.