అమరావతి, అక్టోబరు 11: రాష్ట్రంలో ఏ పేదవాడూ నాకు ఇల్లు లేదనే మాట అనకుండా వచ్చే ఐదేళ్లలో నిరుపేదలందరికీ శాశ్వత గృహ వసతి కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశా నిర్థేశం చేశారని, ఆ లక్ష్య సాధన దిశగా గృహనిర్మాణ శాఖ ముందుకు అడుగులు వేస్తోందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. రాష్ట్ర సచివాలయం నాల్గవబ్లాక్ మొదటి అంతస్తులో ఆధునీకరించబడిన తన చాంబరులోకి శాస్త్రోత్తంగా శుక్రవారం ఆయన ప్రవేశించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ తనకు మంత్రిగా అవకాశమిచ్చి సీఎం చంద్రబాబు, నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు, దేశ ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు మేలు చేయడానికి, పాదర్శక పాలన అందించడానికి తమ ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. ఆ దిశలోనే రాష్ట్రంలోని నిరుపేదలందరికీ నాణ్యమైన ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. గత పాలకుల హయాంలో గృహ నిర్మాణ శాఖలో ఎన్నో అవకతవకలు జరిగాయని, నిరుపేదల గృహ నిర్మాణాలకై కేంద్రమిచ్చిన దాదాపు రూ.4.5వేల కోట్ల నిధులను పక్కద్రోవపట్టించి నిరుపేదలకు అన్యాయం చేశారన్నారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కొక్క యూనిట్‌కు రూ.2.5లక్షల ఋణ సాయమందిస్తే.. దాన్ని రూ.1.8 లక్షలకు తగ్గించడమే కాకుండా ఎస్సీ, ఎస్టీల గృహ నిర్మాణానికై రూ.50 వేల నుండి లక్ష వరకు అదనంగా అందజేసే ఆర్థిక సాయాన్నీ పూర్తిగా రద్దు చేసిన ఘనత గత ప్రభుత్వానిదేనన్నారు. రాష్ట్రాభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలిచ్చే విషయంలోనే కాకుండా, ఇంకా వారికి ఏవిధంగా మేలు చేకూర్చగలమో అనే కోణంలో ఆలోచించి ప్రతిపాదనలు రూపొందించాలని ఈమధ్య జరిగిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలమేరకు తగు చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో ఎన్నో తప్పిదాలు జరిగాయని, రాష్ట్రాన్ని రూ.10.50 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి దింపడమే కాకుండా, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్ధితికి రాష్ట్రాన్ని తెచ్చారన్నారు. రాష్ట్రంలో ఎటువంటి ఆదాయ వనరులు, అభివృద్ది లేకుండా చేశారని అంటూనే.. ఆ తప్పిదాలను చక్కదిద్ది రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు తమ ప్రభుత్వ వంద రోజుల పాలనలో పంతో కృషి చేసిందన్నారు. యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు లేకుండా చేశారని, అభివృద్ధిని అందిపుచ్చుకునేలా యువతీ యువకులను సిధ్దం చేయాలనే లక్ష్యంతో రాష్ట్రంలో స్కిల్ సెన్సెస్ ద్వారా ఉపాధి అవకాశాలు పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రజలు కేవలం సంక్షేమ పథకాలపైనే ఆధారపడకుండా వారికి బంగారు భవిష్యత్తు కల్పించే దిశగా కృషి జరుగుతోందని, 2029నాటికి రాష్ట్ర జిడిపి, ప్రతి పౌరుడి తలసరి ఆదాయం పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హమీలన్నింటినీ దశల వారీగా అమలు చేస్తున్నామని, సామాజిక భద్రతా పింఛన్లను రూ.4 వేలకు పెంచి, మూడు నెలల బకాయిలను కలిపి రూ.7 వేలు చెల్లించిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రానికి మంచి నాయకత్వముంటే ప్రభుత్వ ఉద్యోగులు కూడా మంచి ఫలితాలు చూపగలరనే విధంగా ఒకేరోజున 65 లక్షల మందికి పెన్షన్‌ను ప్రభుత్వోద్యోగులు పంపిణీ చేశారన్నారు. గత ప్రభుత్వ బకాయిలతో మాకు సంబంధం లేదని భావించకుండా గత ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.1600 కోట్ల ధాన్య కొనుగోలు బకాయిలను రైతులకు చెల్లించామన్నారు. కేంద్రం మంచి ఉద్దేశంతో భూహక్కుల చట్టాన్ని తేవాలని ఆలోచన చేస్తే.. ఆ చట్టంలో నిబంధనలను అనుకూలంగా మార్చుకుని దోపిడీకి దారులు వెతుక్కున్నారని, వారి ఆటలు సాగకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేశామన్నారు. విద్య అంటే భవనాలు నిర్మించడం, రంగులు దిద్దడమే కాదని, విద్యార్థులకు చక్కని చదువు, జ్ఞానం, విజ్ఞానం అందజేయాలనే లక్ష్యంతో 16,700 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ వేశామన్నారు. ఈ దీపావళి నుండి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల పంపిణీని అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ.. గత ప్రభుత్వ హయాంలో ప్రకటనల జారీలో ఇష్టానుసారంగా ప్రవర్తించడమే కాకుండా.. నచ్చిన పేపర్లకు పెద్దఎత్తున ప్రకటనలిచ్చి.. నచ్చని పేపర్లు వాటంతట అవే విత్ డ్రా అయ్యేలా చేశారన్నారు. సొంత పత్రికను ప్రభుత్వ సొమ్ముతో కొనుగోలు చేయించిన అక్రమాలపై విచారణ జరుగుతుందని, అందుకు సంబంధించిన జీవోను ఇప్పటికే రద్దు చేశామన్నారు. రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు హిమాన్షు శుక్లా, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఎండి కె.రాజబాబు, సమాచార శాఖ అదనపు సంచాలకులు ఎల్ స్వర్ణలత, సంయుక్త సంచాలకులు పి కిరణ్ కుమార్ తదితరులతో పాటు పలువురు అధికారులు, అనధికారులు మంత్రికి పుష్పగుచ్చాలిచ్చి అభినందనలు తెలిపారు.