అమరావతి (చైతన్యరథం): తణుకు అన్న క్యాంటీన్లో ప్లేట్లు శుభ్రం చేసే అంశంపై వైసీపీ విష ప్రచారం చేస్తోందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతులు కడిగే సింక్‌లో తినే ప్లేట్లు పడేసింది వైసీపీ మూకలేనని మండిపడ్డారు. సింక్‌లో నుంచి వాటిని తీస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లపై విష ప్రచారం చేసేందుకే సైకో బ్యాచ్ ఈ పనిచేసింది. సింక్‌లో ఉన్న ప్లేట్లు తీస్తుంటే మురుగునీటిలో శుభ్రం చేస్తున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. రుచి, శుచి, శుభ్రతకు అన్న క్యాంటీన్లో అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. చేతులు కడిగే స్థలంలో వైసీపీ మూకలు అన్నం ప్లేట్లు వేసి వీడియో తీశారు. అన్న క్యాంటీన్లపై సైకో జగన్ విషం చిమ్ముతున్నారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వివరాలు తెలుసుకున్న మంత్రి నారాయణ
తణుకు అన్న క్యాంటీన్ లో శుభ్రత పాటించడం లేదన్న ప్రచారంపై ఏపీ పురపాలకశాఖ మంత్రి నారాయణ ఆరా తీశారు. హరేకృష్ణ మూమెంట్ ప్రతినిధులు, అధికారులు నుంచి వివరాలు తెలుసుకున్నారు. ప్లేట్లను మురికినీటిలో కడుతున్నారనేది పూర్తిగా అవాస్తవమని అధికారులు మంత్రికి తెలిపారు. వాష్ బేసిన్ లోని ప్లేట్లు తీస్తుంటే వీడియో తీసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఎక్కువమంది రావడంతో డస్ట్ బిన్‌కు బదులుగా ప్లేట్లు వాష్ బేసిన్లో పెట్టారని అధికారులు వివరించారు. సోషల్ మీడియాలో పెట్టిన వీడియో వాస్తవం కాదని స్పష్టం చేశారు. పాత్రలు, ప్లేట్లు శుభ్రం చేసేందుకు అన్న క్యాంటీన్లలో ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయని హరేకృష్ణ మూమెంట్ ప్రతినిధులు మంత్రికి వివరించారు.