- ఐదేళ్లలో నీటిపారుదల శాఖ 20 ఏళ్లు వెనక్కి..
- సాగు, తాగునీటి రంగాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు
- 2019లో టీడీపీ ప్రభుత్వం మారడమే ప్రాజెక్టుకు శాపం
- పోలవరంపై వరుస సమీక్షలు చంద్రబాబు చిత్తశుద్ధికి నిదర్శనం
- నీటిపారుదల రంగానికి కె.ఎల్.రావు సేవలు అనితర సాధ్యం
- కూటమి వచ్చాక ఆయన జయంతి వేడుకలు ఆనందంగా ఉంది
- ఇకపై ఏటా కె.ఎల్.రావు, కాటన్, మోక్షగుండం, శ్రీరామకృష్ణయ్య
జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తాం - జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు
విజయవాడ(చైతన్యరథం): గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో పోలవరం ప్రాజెక్టు విధ్వం సానికి గురైందని, వారి నిర్లక్ష్యంతోనే డయాఫ్రం వాల్ కొట్టుకుపోయిందని రాష్ట్ర జలవనరు ల మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. సోమవారం విజయవాడలోని కె.ఎల్.రావు ఘాట్‌లో రాష్ట్ర జలవనరులశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘పద్మభూషణ్’ కానూరి లక్ష్మణ రావు 122వ జయంతి కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కె.ఎల్.రావు చిత్రపటానికి, విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 50 ఏళ్ల క్రితమే నదుల అనుసంధానాన్ని ప్రతిపాదించిన దార్శనికుడు, తెలుగుజాతి గర్వించదగిన ఇంజనీర్ కె.ఎల్.రావు అని, ఆయన జయంతి వేడుకలు నిర్వహించడం శుభ పరిణామమన్నారు. నీటి పారుదల రంగానికి విశేష సేవలు అందించి భావితరాలకు స్ఫూర్తిగా నిలిచిన సర్ ఆర్థర్ కాటన్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, కె.ఎల్.రావు, శ్రీరామకృష్ణయ్య వంటి మహనీయుల జయంతి వేడుకలను 2014-2019 టీడీపీ పాలనలో ఎంతో ఘనంగా నిర్వహించామని తెలిపారు. గత ప్రభుత్వం నిర్వహించక పోవడం బాధాకరమన్నారు. నాగార్జున సాగర్ రూపశిల్పి, కృష్ణా డెల్టాను సస్యశ్యామలం చేసిన కె.ఎల్.రావు విగ్రహానికి కనీసం రంగు వేసిన పాపాన కూడా పోలేదన్నారు. గత ఐదేళ్ల పాలనలో వారు చూపిన నిర్లక్ష్యంతోనే పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ కొట్టుకుపోయిందన్నారు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సాగు, తాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్నారు. సీఎం చంద్రబాబు తొలి పర్యటనగా పోలవరం వెళ్లారని, ప్రతి సోమవారం పోలవరంపై సమీక్షలు నిర్వహిస్తున్నారని ఇది ఆయన చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు.
అపర భగీరథుడు కె.ఎల్.రావు
నీటిపారుదల రంగంలో దేశాన్ని కె.ఎల్.రావు తన దేశభక్తి, మేధాసంపత్తితో స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దారని తెలిపారు. గ్రావిటీ డ్యాములు, ఆర్చి డ్యాములు, కాంక్రీట్ డ్యాములు, రాతి ఆనకట్టలు, విద్యుదుత్పాదక కేంద్రాలు, పులిచింతల వంటి ఎన్నో బహు ళార్థక సాధక ప్రాజెక్టుల నిర్మాణాలు ఎటువంటి విదేశీ నిపుణుల సహకారం లేకుండా రూపొందాయంటే అది కె.ఎల్.రావు ఘనతే అని ప్రశంసించారు. చంబల్ లోయలోని ఆనకట్టలు, మహానది మీద హిరాకుడ్, గంగానది మీద ఫరక్కా బ్యారేజ్, తరచూ వరదలతో బీభత్సం సృష్టిస్తూ భారత దుఃఖనదిగా పేరుబడ్డ దామోదర నదిపై కోసీ బ్యారేజ్, తపతీ నది మీద ఉకై, కర్ణాటకలో సర్వాధి ప్రాజెక్ట్, మేఘాలయలో ఉనియం, కృష్ణా నది మీద శ్రీశైలం, నాగార్జున సాగర్ ఆనకట్టల నిర్మాణాలకు ఆద్యుడు, అపర భగీరథుడు కె.ఎల్.రావు అని కొనియాడారు. అటువంటి మహనీయుని సేవలను గుర్తు చేసుకుంటూ కూటమి ప్రభుత్వం లో నేడు 122వ జయంతి వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. కె.ఎల్.రావు కలల సాకారం దిశగా సీఎం చంద్రబాబు అడుగులు వేస్తున్నారని, నదుల అనుసంధానానికి పెద్దపీట వేసేలా పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు ఎనలేని కృషి చేస్తున్నారని తెలిపారు. పోలవరం ఏడు ముంపు మండలాలను ఏపీలో విలీనం చేసేందుకు ఎంతో శ్రమించారని..వాటి వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని గుర్తు చేశారు.
పోలవరం సవాళ్లను పరిష్కరించుకుంటూ ముందుకువెళతాం
2014-19 ప్రభుత్వ కాలంలోనే పోలవరం పనులను 72 శాతం చంద్రబాబు పూర్తి చేశారన్నారు. కానీ 2019లో ప్రభుత్వం మారడం పోలవరం ప్రాజెక్టుకు శాపం అయింద న్నారు. ఏజెన్సీలను మార్చడం, రద్దు చేయడం వంటి కార్యక్రమాలతో దాదాపు 13 నెలలు ప్రాజెక్టులో పనులు చేయకుండా ఖాళీగా ఉంచారన్నారు. ఐఐటీ హైదరాబాద్ నిపుణులు కూడా గత ప్రభుత్వ విధ్వంసర, నష్టాల మీద రిపోర్టు కూడా ఇచ్చారని తెలిపారు. గత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో నెలకొన్న సవాళ్లను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళతామని వివరించారు. ఇకపై ప్రతి ఏటా సర్ ఆర్థర్ కాటన్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, కె.ఎల్.రావు, శ్రీరామకృష్ణయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.
సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం
ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. కె.ఎల్.రావు ఇంజనీర్‌గా మాత్ర మే కాకుండా దేశం అన్ని విధాలా అభివృద్ధి చెందాలని తపించారని ప్రశంసించారు. అనం తరం నీటిపారుదల శాఖ రిటైర్డ్ సీనియర్ ఇంజనీర్లు ఆర్.సతీష్‌కుమార్, బి.ఎస్.ఎస్.శ్రీని వాస్ యాదవ్, ఎం.వి.కృష్ణారావు, కె.వి.కృష్ణారావు, మారుతి ప్రసాద్‌లను మంత్రి శాలువాల తో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అడ్వైజర్ ఎం.వెంకటేశ్వరరావు, ఇంజనీర్ చీఫ్ అడ్మిన్ కె.శ్రీనివాస్, హైడ్రాలజీ సీఈ కుమార్, మైనర్ సీఈ సాయిరామ్ ప్రసాద్, ఎస్‌ఈ టి.జె.హెచ్.ప్రసాద్‌బాబు, డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ ఎస్.తిరుమలరావు, అపెక్స్ కమిటీ మాజీ చైర్మన్ ఎ.గోపాలకృష్ణ పాల్గొన్నారు.