అమరావతి: ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్ట్‌ను మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధోగతిపాలు చేశాడని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మీడియాతో పంచుమర్తి మాట్లాడుతూ జగన్ తండ్రి వైౖఎస్ రాజశేఖర్ రెడ్డి 20ఏళ్ల క్రితం పోలవరానికి శంకుస్థాపన చేసినా ఒక్క అడుగూ ముందుకు పడలేదన్నారు. కమీషన్ల కోసం జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చారని మండిపడ్డారు. ప్రాజెక్ట్ నిర్మాణం ఊసెత్తకుండా డబ్బులు దోచుకునేందుకు వీలున్న కాలువల నిర్మాణంతో కాలయాపన చేశారన్నారు. 2014`19 మధ్య పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పరుగులు పెట్టించి 72శాతం పనులు పూర్తి చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఒక్క రోజులో 35వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసి గిన్నిస్ రికార్డు సృష్టించారని అనురాధ గుర్తు చేశారు. ఒక్క చాన్స్ అంటూ జగన్ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని ఐదేళ్లపాటు పీక్కు తిన్నారని ధ్వజమెత్తారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో రివర్స్ టెండరింగ్ పేరుతో కమీషన్లు దండుకుని ప్రాజెక్టును గోదాట్లో ముంచారని ఎమ్మెల్సీ అనురాధ ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం పూర్తయితే 7.20 లక్షల ఎకరాలకు సాగునీరందేదని, 23లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగేదని తెలిపారు. ఉత్తరాంధ్రలోని వందలాది గ్రామాలకు తాగునీరు అందేదన్నారు. పోలవరం పూర్తయి ఉంటే విశాఖ పారిశ్రామికి హబ్‌గా ఎదిగేదని, పొరుగు రాష్ట్రాలు ఛత్తీస్‌గఢ్, ఒడిశాకు సైతం నీళ్లు ఇచ్చే స్థితిలో ఉండేవాళ్లమన్నారు. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తానని మోసపు మాటలు చెప్పిన జగన్.. ఆయన కోసం మాత్రం రూ.500 కోట్లతో రుషికొండ ప్యాలెస్ కట్టుకున్నాడని దుయ్యబట్టారు. ఇదేనా మీరు ఉత్తరాంధ్రకు చేసిన అభివృద్ధి అని మండిపడ్డారు. పోలవరం పూర్తి చేసేది ముఖ్యమంత్రి చంద్రబాబే, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేది చంద్రబాబే అని ఎమ్మెల్సీ అనురాధ ఉద్ఘాటించారు.