- అమరావతి అసైన్డ్ భూముల పేరుతో అక్రమ అరెస్టులు
అమరావతి: అమరావతి రైతుల పాదయాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల నుంచి వస్తున్న అద్భుత స్పందన చూసి వైసీపీ ప్రభుత్వం దుష్ప్రచారానికి మళ్లీ తెరతీసిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. 2014లో ప్రభుత్వ నిర్ణయాలపైన, 2020లో నమోదు చేసిన కేసులపైన కోర్టులు స్టే ఇచ్చినట్లు మంగళవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. అయితే, ఇప్పుడు ఆ కేసుల్లో మరికొంత మందిని అరెస్టు చేసి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం జగన్ సర్కారు చేస్తోందన్నారు. అమరావతి నిర్మాణం, ల్యాండ్ పూలింగ్ విధానం పై విషం చిమ్మడం వైసీపీ ప్రధాన అజెండాగా పేర్కొన్నారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా 33 వేల ఎకరాలు సేకరించడంపై అసత్య ప్రచారం చేస్తూనే ఉందన్నారు. ముందుగా ఇన్ సైడర్ ట్రేడిరడ్ అని చేసిన ఆరోపణలను హైకోర్టు కొట్టివేసిందని గుర్తు చేశారు. అనంతరం వేల ఎకరాల అసైన్డ్ భూములు చేతులు మారాయని, వేల కోట్ల అవినీతి జరిగిందని ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దానిని నిజమని నమ్మించడానికి రెండేళ్ల క్రితమే (27.02.2020) అక్రమ కేసులు పెట్టించేందుకు ఒక వైసీపీ సానుభూతి పరుడితో తప్పుడు ఫిర్యాదు చేయిం చినట్లు వివరించారు. ఈ కేసుపై కోర్టుకు వెళ్లిన కొందరికి స్టే ఆర్డర్ ద్వారా ఊరట లభించిందన్నారు. ఆ తరువాత రెండు ఏళ్ల నుంచి ఈ కేసుపై ఏం విచారణ జరిగిందో కూడా తెలియదని పేర్కొన్నారు. ప్రభుత్వం, విచారణ అధికారులు కూడా దీనిపై మౌనంగానే ఉండిపోయినట్లు తెలిపారు.
పాదయాత్ర సందర్భంగా పాత కేసుల్లో అరెస్టులు
అమరావతి పాదయాత్ర సందర్భంగా పాత కేసులో ఉన్న కొందరిని ఉద్దేశ్య పూర్వకంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. అమరావతి రైతులకు వివిధ వర్గాల నుంచి వస్తున్న మద్దతును నీరుగార్చడం కోసమే ఈ ప్రయత్నాలన్నీ అని తెలిపారు. అప్పటి ల్యాండ్ పూలింగ్‌లో పురపాలక శాఖా మంత్రిగా కీలక పాత్ర వహించిన నారాయణను లక్ష్యం చేసుకుని ఈ అరెస్టు లతో కొత్త ప్రచారానికి తెర తీశారన్నారు. తన విద్యా సంస్థల అవసరాల కోసం రామకృష్ణా హౌసింగ్ లిమిటెడ్‌కు నారాయణ కొంత మొత్తం చెల్లించినట్లు తెలిపారు. అధికారికంగా, నిబంధనల ప్రకారం ఈ చెల్లింపులు జరిగాయన్నారు.ఈ వివరాలు ఐటీశాఖతో పాటు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌లో కూడా నమోదు అయినట్లు వివరించారు. అయితే, ఆ లావాదేవీలకు రాజధాని భూ వ్యవహారాలకు ముడివేసి అక్రమాలు అంటూ బోడగుండుకు మోకాలికీ ముడివేసి అక్రమ కేసు పెట్టారని ధ్వజమెత్తారు. అక్రమంగా తమ భూమిని తీసుకున్నారని గాని, తమకు నష్టం కలిగిందని గాని ఒక్కరు కూడా ఫిర్యాదు చేయలేదన్నారు. బలహీ న వర్గాలకు లబ్ది చేకూర్చాలనే ఉద్దశంతో సంబంధిత శాఖల అభిప్రాయాలు కూడా తీసుకుని ఇచ్చిన జీవో నెంబర్ 41కు వక్రభాష్యాలు చెపుతూ రాజధాని నిర్మాణానికి అడుగడుగునా అడ్డుపడుతున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ అధికారి అభిప్రాయం మాత్రమే రాయాలి
ఒక ప్రభుత్వ ఉన్నతాధికారి తన అభిప్రాయాలను ఫైల్‌పై రాయాలని, పోలీసుల ఒత్తిడితో ఇచ్చిన స్టేట్మెంట్ చట్టం ముందు నిలబడదని తెలుసుకోవాలని హితవు పలికారు. మీపై వచ్చిన క్విడ్ ప్రో కో ఆరోపణ లకు ఈ రోజుకూ మీ నుంచి సమాధానం లేదన్నారు. భూమి పుత్ర బ్రహ్మానందరెడ్డి అనే వ్యక్తి మీ పార్టీకి చెందిన వ్యక్తి అని, మొత్తం వ్యవహారం నడిపించిన వ్యక్తి అతనేనని పోలీస్ రిపోర్టులో ఉన్నా, అతనిని ఎందుకు అరెస్టు చెయ్యలేదని ప్రశ్నించారు. అమరా వతిని దెబ్బతీయడానికి మీరు చేసే కుట్రలు, కుతంత్రా లు ఫలించవని అచ్చెన్న స్పష్టం చేశారు.
ఇడుపులపాయలో కాజేసిన భూములపై విచారణకు సిద్ధమా?
ఇడుపలపాయలో ఏళ్ల తరబడి 700 ఎకరాల అసైన్డ్ భూమి జగన్ రెడ్డి కుటుంబం స్వాధీనంలో ఉన్న చరిత్రను గుర్తుకు తెచ్చుకోండన్నారు. రాజధాని అసైన్డ్ భూములు, ఇడుపులపాయలో కాజేసిన అసైన్డ్ భూములపైనా జ్యుడీషియల్ విచారణ జరిపే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. ల్యాండ్ పూలింగ్‌లో భాగంగా రిజిస్ట్రేషన్ కు ముందు ఒక వేళ ఎవరైనా అసైన్డ్ భూములు కొనుగోలు చేసినా వారి పేరుతో ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చెయ్యలేదన్నారు. అసైన్మెంట్ దారుల అయిన దళితుల, బడుగుల పేరుతోనే ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలిపారు. అసైన్మెంట్ భూము లకు రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించమని రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అగ్రకుల పేదలు ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాలను అభ్యర్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ న్యాయమైన కోరికను గౌరవించి చంద్రబాబు ప్రభుత్వం 2015లో జీవో నెంబర్ 1, 2016లో జీవో నెంబర్ 41 విడుదల చేసినట్లు తెలిపారు. 2019లో ఏపీ అసైన్మెంట్ యాక్ట్ 1977కు సవరణలు చేసి రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించినట్లు పేర్కొన్నారు. గతంలో కొందరు అధికారుల చేత తప్పుడు పనులు చేయించి జైళ్ల పాలు చేశారని, ఇప్పుడు మరికొందరు అధికారులను బెదిరించి తప్పుడు నివేదికలు ఇప్పిస్తున్నారన్నారు.