- జగన్ రెడ్డి ఇప్పటికైనా తెలుసుకోవాలి
- ప్రభుత్వం మారినా.. అభివృద్ధి, సంక్షేమాలు కొనసాగించటం పాలకుల బాధ్యత
- ఆ ప్రజాస్వామ్య స్ఫూర్తిని జగన్ విధ్వంసపాలనతో బ్రేక్ చేశారు
- వైసీపీ ప్రభుత్వం పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు మేము చెల్లిస్తున్నాం
- చివరి రూపాయి వరకూ మొత్తం చెల్లిస్తాం
- మంత్రి నారా లోకేష్ స్పష్టీకరణ
అమరావతి (చైతన్యరథం): ప్రభుత్వం మారినా..అభివృద్ధి, సంక్షేమాలు కొనసాగించే ప్రజాస్వామ్య స్ఫూర్తిని మీ విధ్వంసపాలనతో బ్రేక్ చేశారని వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డిపై విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ పాలనలో అంతా విధ్వంసానికి పాల్పడ్డారన్నారు. గత ప్రభుత్వ బకాయిలు మేమెందుకు చెల్లించాలనే విధంగా వైసీపీ పాలన సాగిందన్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన మీరు గత ప్రభుత్వ బకాయిలు మేమెందుకు చెల్లించాలి అంటూ మొండికేశారు. టీడీపీ హయాంలో ప్రారంభమైన అభివృద్ధి పనులను నిలిపేశారు. మరికొన్ని ధ్వంసం చేశారు. ఈ నిరంకుశ మనస్తత్వం ప్రజాస్వామ్యానికి ప్రమాదం. కానీ గత వైసీపీ ప్రభుత్వం ప్రవర్తించిన విధంగా తాము ప్రవర్తించడం లేదన్నారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత ప్రభుత్వం వదిలిపెట్టి పోయిన బకాయిలను విడతల వారీగా చెల్లిస్తున్నామని చెప్పారు. మా విద్యాశాఖలో మీరు పెట్టి వెళ్లిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.4271 కోట్లు. ఇవి విడతల వారీ చెల్లిస్తామని మాట ఇచ్చాను. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.788 కోట్లు గతంలోనే విడుదల చేసిన మా ప్రభుత్వం తాజాగా రూ.600 కోట్లు విడుదల చేసింది. త్వరలో మరో రూ.400 కోట్లు విడుదల చేస్తాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, మీరు పెట్టిన బకాయిలు ఆర్థిక భారంగా మారినా, చివరి రూపాయి వరకూ బకాయిలు చెల్లించడం, విద్యార్థులు, తల్లిదండ్రుల పై ఎటువంటి ఒత్తిడి లేకుండా చేయడమే మా బాధ్యతగా భావిస్తున్నాం. రాజకీయాలు ఎన్నికలకే పరిమితం.. ప్రభుత్వం శాశ్వతమనే విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి తెలుసుకోవాలని మంత్రి లోకేష్ హితవు పలికారు.