- పోటెత్తిన ప్రజాగళంతో వైసీపీలో వణుకు
- విశాఖను నాశనం చేసిన పాపం వైసీపీదే
- ఉత్తరాంధ్రలో 40వేల కోట్లు దోచేశారు
- సింపతీ డ్రామాలు జగన్‌కు అలవాటే..
- గులకరాయి డ్రామాతో అభాసుపాలు
- రాష్ట్రం కోసమే మూడుపార్టీల పోత్తు
- కూటమిని గెలిపిస్తే బంగారు భవిష్యత్తు
- ఎస్.కోటను తిరిగి విశాఖలో కలుపుతా
- ఉత్తరాంధ్ర అభివృద్ధికి కంకణబద్ధుడనవుతా
- ఎస్.కోటకు వరాలిచ్చిన చంద్రబాబు
- జనసంద్రమైన ప్రజాగళం ఎన్నికల సభ
శృంగవరపుకోట (చైతన్యరథం): ‘ప్రజాగళం సభల కోసం ఊళ్లకు ఊళ్లు కదులుతున్నాయి. సభలు జనసంద్రాలవుతున్నాయి. కూటమికి ప్రజాదరణ సంకేతాలు చూస్తుంటే, మే 13 పోలింగ్ తుపాన్‌లో జగన్ బంగాళాఖాతంలోకి కొట్టుకుపోవడం ఖాయం’ అని తెదేపా అధినేత చంద్రబాబు ఉత్సాహంగా ప్రకటించారు. ఎన్నికల సమరానికి శృంగవరపుకోట సై అంటోందని, జగన్‌కు ‘ఒక్కఛాన్స్’ ఇచ్చి.. ఐదేళ్లు యాతనపడిన జనం ఇప్పుడు తరిమికొట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. శృంగవరపుకోటలో సోమవారం రాత్రి పెద్దఎత్తున సాగిన ప్రజాగళం సభలో చంద్రబాబు అమితోత్సాహంతో మాట్లాడారు. ఉత్తరాంధ్రలో పేద పిల్లల ఉన్నత చదువుల కోసం ఏర్పాటైన గీతం వర్శిటీని, జగన్ వ్యక్తిగత దుగ్ధతో ధ్వంసం చేయాలని చూస్తే న్యాయపరంగా భరత్ అడ్డుకున్నాడని చంద్రబాబు వివరించారు. రాష్ట్రంలో చట్టం, న్యాయానికి అతీతంగా సైకో నియంతృత్వ పోకడ సాగుతోందని ధ్వజమెత్తారు.
తెదేపా హయాంలో విశాఖకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని, హుద్‌హుద్ తుపానులాంటి ప్రకృతి వైపరీత్యాలకు ఎదురు నిలబడి.. విశాఖను అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నామని గుర్తు చేశారు. ఇప్పుడు ఒక వ్యక్తి స్వార్థానికి రాష్ట్రమే ధ్వంసమైందని, పరిస్థితిని చక్కదిద్ది రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే కూటమిని గెలిపించడం ఒక్కటే మార్గమని చంద్రబాబు వివరించారు. విశాఖలో ప్రపంచస్థాయి సదస్సులు నిర్వహించి పెద్దఎత్తున పెట్టుబడులు తెచ్చి ఐటీ రాజధాని, ఆర్థిక రాజధానిగా, టూరిజం హబ్‌గా తీర్చిదిద్దాలని తాను సంకల్పిస్తే.. జగన్ తన అసమర్థ పాలనతో గంజాయి, క్రైమ్ క్యాపిటల్‌గా తయారుచేసే పరిస్థితికి తీసుకొచ్చారని దుయ్యబట్టారు. వైసీపీ రాక్షసమూకలు ఉత్తరాంధ్రలో 40వేల కోట్ల విలువైన ఆస్తులు కొట్టేశారని, భూములు కొల్లగొట్టి వైసీపీ మాఫియా అలజడి సృష్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంటు పట్టాల సాకుతో దారుణ దోపిడీకి పాల్పడిన వైసీపీ, కేంద్రం నిధులతో అగ్గిపెట్టెల్లాంటి ఇళ్లుకట్టి మోసం చేయడమే కాకుండా, ఘనకార్యం సాధించినట్టు ప్రచారం చేసుకోవడం దుర్మార్గమని చంద్రబాబు ధ్వజమెత్తారు.
ప్రజలకు సెంటు భూమి చాలంటున్న జగన్, రుషికొండలో 500 కోట్లతో విలాసవంతమైన భవనం నిర్మించుకునే అధికారం ఎవరిచ్చారన్నారు. జగన్ రెడ్డికి హైదరాబాద్, బెంగళూరు, ఇడుపులపాయ, పులివెందుల, చెన్నైలో విలాసవంతమైన ప్యాలెస్‌లు ఉన్నాయని, అవన్నీ చాలవన్నట్టు పర్యావరణాన్ని పూర్తిగా దెబ్బతీసి రుషికొండ ప్యాలెస్ నిర్మించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని సౌకర్యాలు, హంగులతో టిడ్కో ఇళ్లు నిర్మిస్తే.. వాటిని పేదలకు ఇవ్వకుండా నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం తెచ్చిన జగన్ సర్కారు, మరోసారి అధికారంలోకి వస్తే ప్రజల ప్రయివేట్ ఆస్తులను సైతం దోపిడీ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుందన్నారు. రాష్ట్రాన్ని దోచుకోవడమే లక్ష్యంగా వస్తున్న జగన్ `ప్రజల బిడ్డకాదని, రాష్ట్రానికి క్యాన్సర్ గడ్డ అని ఎత్తిపొడిచారు.
గులకరాయి డ్రామా నీచ సంస్కృతి
ఎన్నికల సమయంలో డ్రామాలు కట్టడం జగన్‌కు పరిపాటిగా మారిందని ఎద్దేవా చేస్తూ `తాజాగా ఆడిన గులకరాయి డ్రామా అభాసుపాలైందని ఎద్దేవా చేశారు. సింపతీ ఓట్ల కోసం డ్రామాలు కట్టడం జగన్‌కు అలవాటేనంటూ.. బాబాయ్‌పై గొడ్డలి, కోడికత్తి డ్రామాలను తనపైకి నెట్టాలని చూసి దెబ్బతిన్నాడని దుయ్యబట్టారు. నాపైన, పవన్‌పైన ఎన్నికల సభల్లో రాళ్లు, కర్రలతో దాడులు జరిగితే ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కని వాదించిన వైసీపీ.. గులకరాయి దాడిని మాత్రం హత్యాయత్నంగా ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని, నీచ సంస్కృతిని ప్రజలు సాగనివ్వరని హెచ్చరించారు. అన్ని వ్యవస్థలనూ నిర్వీర్యం చేసిన జగన్, రాష్ట్రాన్ని అప్పులపాలు చేశాడని వివరిస్తూ, జగన్ డ్రామాలను ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు.
బాదుడే బాదుడు
వైసీపీ ఏలుబడిలో నిత్యావసరాల ధరలు, పెట్రోలు విద్యుత్ ఛార్జీలు, పన్నుల భారాలు వేసి ప్రజల నడ్డి విరిచారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా హయాంలో ప్రజలపై భారం వేయకూడదన్న మాటకు కట్టుబడి ఉన్నామని, జగన్ మాత్రం ప్రజలను బాదుడే బాదుడని ఎద్దేవా చేశారు. తండ్రి వైఎస్సార్ సీఎంగా ఉన్నపుడు లక్ష కోట్లు దోచేసిన జగన్ ఈడీ, సీబీఐ కేసులు ఎదుర్కొంటున్నాడని, జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచీ ల్యాండ్, శాండ్, మైన్ రంగాలపైబడి లక్షల కోట్లు దోచేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇసుక, మద్యం కుంభకోణాలు దారుణమన్నారు.
రాష్ట్రం కోసమే పొత్తు
రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఏర్పడిరది. అందరూ కలిసి త్యాగాలు చేసి.. రాష్ట్ర భవిష్యత్తు కోసం పొత్తు కూదుర్చుకున్నాం. దుర్మార్గుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నదే మా సంకల్పం. ఉత్తరాంధ్ర యువత బంగారు భవిష్యత్తు కావాలనుకుంటే కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ సందర్భంలో సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ, వాటివల్ల ప్రజల జీవితాల్లో వెలుగులు చోటుచేసుకుంటాయని హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే డిపస్సీపైనే తొలి సంతకం చేస్తానని, ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, యువత, మహిళలు, రైతాంగానికి ఇతోధిక సాయం అందించే పథకాలను తేనున్నామని చంద్రబాబు వివరించారు. పేదరికం లేని రాష్ట్రాన్ని ఆవిష్కరించాలన్న తపనతో పని చేస్తున్నామని, కూటమి గెలుపు కోసం నిండు మనసుతో ప్రజలంతా కలసిరావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
ధర్మాన్ని మనం కాపాడితే, మనలను ధర్మం కాపాడుతుందని చెబుతూ, కురుక్షేత్ర ఎన్నికల యుద్ధంలో కౌరవుల వధ జరుగుంది. ధర్మాన్ని కాపాడుతాం. నా సతీమణిని శాశనసభలో అవమానకరంగా మాట్లాడితే.. కౌరవ సభగా మారిన అసెంబ్లీని గౌరవ సభగా మార్చిన తర్వాతే క్షేత్రస్థాయిలో గెలిచి అసెంబ్లీలో అడుగుపెడతానని ప్రతిజ్ఞ చేశా. మీ పిల్లల కోసం, భవితరాల భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరుతున్నా అని చంద్రబాబు పిలుపునిచ్చారు.
ఎస్.కోటను విశాఖకు చేరుస్తా
విశాఖ జిల్లాలో ఉండాల్సిన ఎస్.కోటను మంత్రి బొత్స రాజకీయ స్వార్థం కోసం ప్రజాభిష్టానీకి వ్యతిరేకంగా విజయనగరంలో కలిపారని చంద్రబాబు గుర్తు చేశారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే విశాఖ జిల్లాలో చేర్చి అభివృద్ధి చేపడతామని హామీ ఇచ్చారు. విశాఖతో సమానంగా ఎస్.కోటను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానన్నారు. స్థానిక వనరులను వినియోగించుకొని నీరు అందించి పరిశ్రమలు ఏర్పాటు చేసామని, విశాఖ నుంచి అరకుకు జాతీయ రహదారి నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. ఎస్.కోటను టూరిజం హబ్‌గా మార్చి అందరికి న్యాయం చేసే బాధ్యత తీసుకుంటానని, జామీలో జూనియర్ కళాశాల, కొత్తవలసలో డిగ్రీ కళాశాల నిర్మిస్తామన్నారు. ఎస్.కోటలో పుణ్యగిరిక్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామని, భీమ్‌సింగ్ సుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామన్నారు.
వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు
వైసీపీలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు పారిపోయే పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్సీలు పదవులను సైతం వదులుకొని రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించి టీడీపీలో చేరుతున్నారు. ఎమ్మెల్సీ సతీమణి ఇందుకూరి సుధారాజ్ రాష్ట్ర భవిష్యత్‌ను ఆకాంక్షించి టీడీపీలో చేరారు. నాపైనే దాడి చేసి.. నా మీదే కేసులు మోపి నన్నే జైళ్లుకు పంపే పరిస్థితికి వచ్చారంటే మీ జీవితాలు ఏమవుతాయనేది మీరు ఆలోచించుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని కూటమి అభ్యర్థులను గెలిపించే బాధ్యత మూడు పార్టీల నాయకులు తీసుకోవాలన్నారు. ఎస్.కోటను వైసీపీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అవినీతి కోటగా మార్చాడని, కన్నుపడ్డ భూములపై దొంగపత్రాలు సృష్టించి భూములు లాక్కుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. గంజాయి మత్తును తెచ్చి పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నాడని ధ్వజమెత్తారు.
రెల్లి రెవెన్యూ పరిధిలోని గంగా దేవాలయానికి చెందిన వంద ఎకరాలు ఎమ్మెల్యే బినామీల పేర్లతో కొట్టేశాడని వివరించారు. ఇలాంటి దుర్మార్గుడిని ఎన్నికలలో చిత్తుగా ఓడిరచి బుద్ధి చెప్పాలన్నారు. కూటమిలోని మూడు పార్టీలు కలిసి ఎమ్మెల్యేగా కోళ్ల లలితకుమారి, ఎంపీగా శ్రీభరత్‌ను అఖండ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరారు. క్షేత్రస్థాయిలో త్యాగాలు చేసిన ఎవ్వరినీ మర్చిపోను, అందరికీ తగిన ప్రతిఫలం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో అమెరికా నుంచి వచ్చిన గొంప కృష్ణ ప్రజానాయకుడిగా మారాడు. గొంప కృష్ణ, లలితకుమారి, బీజేపీ, జనసేన నాయకులందరూ కలిసి ఎస్.కోటను అభివృద్ధి చేసుకుందామని చంద్రబాబు పిలుపునిచ్చారు.