- నీతి ఆయోగ్ ప్రతినిధులతో భేటీ
అమరావతి(చైతన్యరథం): పేదరిక నిర్మూలన, రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ‘విజన్ డాక్యుమెంట్ 2047’ను రూపొందించేందుకు సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం సీఎం చంద్రబాబుతో నీతిఆయోగ్ ప్రతినిధులు భేటీ అయ్యారు. వికసిత్ ఏపీ -2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పనపై చర్చించారు. 2047 నాటికి ఏపీని 2 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని నీతి ఆయోగ్ ప్రతినిధులకు సీఎం స్పష్టం చేశారు. అందుకే ఏపీ విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. మాక్రో టు మైక్రో విధానం అవలంబించేలా చర్యలు తీసుకోనున్నట్లు సీఎం వెల్లడిరచారు. వచ్చే ఐదేళ్లకు జిల్లాల వారీగా విజన్ డాక్యుమెంట్లు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఏపీని అత్యుత్తమ ఆహార శుద్ధి పరిశ్రమల కేంద్రంగా రూపొందించేందుకు ప్రణాళికలు..
రూపొందించడంతోపాటు పారిశ్రామికంగా యువతలో నైపుణ్యం పెంచేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్టు చెప్పారు. దేశ తూర్పుతీరానికి ఏపీని లాజిస్టిక్ హబ్‌గా తీర్చిదిద్దనున్నట్లు వెల్లడిరచారు. పరిశ్రమలు, పునరుత్పాదక విద్యుదుత్పత్తి కేంద్రంగా ఏపీని తీర్చి దిద్దేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఏపీని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని వివిధ నగరాలను గ్రోత్ సెంటర్లుగా మారుస్తామని, అందరికీ అత్యాధునిక వైద్యసేవలు అందేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. పర్యావరణ అనుకూల అభివృద్ధిపై దృష్టిపెట్టేలా ప్రణాళికలను సీఎం వివరించారు. డిజిటల్ గవర్నెన్స్, ఆర్థికాభివృద్ధికి ఏపీని ఓ నమూనాగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
పేదరికం లేని సమాజం, జనాభా సమతుల్యతపై కసరత్తు చేసి ప్రణాళికలు రూపొందిస్తామని ఇప్పటికే చంద్రబాబు తెలిపారు. అన్ని రంగాల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనుసంధానం చేస్తామని గతంలో వెల్లడిరచారు. ఏపీలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్శిటీ ఏర్పాటు చేసే యోచన చేస్తున్నట్టు కూడా చంద్రబాబు తెలిపారు. వికసిత్ ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్‌లో రాష్ట్రస్థాయి నుంచి కుటుంబస్థాయి వరకు ప్రణాళికలు రూపొందించేలా ప్లాన్ చేస్తున్నారు. వ్యవసాయ రంగంలో కొత్త ఆవిష్కరణలు తీసుకువచ్చేందుకు సైతం కృషి చేస్తున్నారు. మొత్తానికి 15శాతం గ్రోత్ రేట్ సాధించడమే ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సీఎం చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. అనుకున్న విధంగా గ్రోత్ రేట్ సాధిస్తే తలసరి ఆదాయం కూడా పెరిగి ప్రజల ఆర్థిక స్థితిగతులు మారతాయని.. తద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని సీఎం భావిస్తున్నారు.
`