- విద్యుత్ కొనుగోలుపైనా అధికారులతో విస్తృత చర్చలు
- ప్రజలపై భారం పడకుండా చూడాలని ఆదేశం
- విద్యుత్ డిమాండ్, సప్లయి అంచనాలపై మంత్రి దిశానిర్దేశం
అమరావతి (చైతన్య రథం): గత ప్రభుత్వ పాలనలో నిర్వీర్యమైన విద్యుత్‌రంగాన్ని గాడిలో పెట్టేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నట్టు విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. సచివాలయంలో గురువారం విద్యుత్ రంగానికి సంబంధించి ట్రాన్స్ కో, జెన్ కో, డిస్క్ంల సీఎండీలతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాబోయే 6 నెలలకు సంబంధించి విద్యుదుత్పత్తి, వినియోగం, సరఫరాతోపాటు పలు అంశాలను చర్చించారు. ఆరు నెలలకు సంబంధించి విద్యుత్ వినియోగం, డిమాండ్లకు అనుగుణంగా ఏవిధంగా విద్యుదుత్పత్తి చేపట్టాలనే దానిపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. గత ప్రభుత్వ తప్పిదాలు ప్రజలకు భారంకాకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రజలకు భారంలేకుండా విద్యుత్ కొనుగోలు ఉండాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులకు సూచించారు. గత ఐదేళ్లపాటు చేసిన చారిత్రక తప్పిదాలు ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు గుదిబండగా మారాయని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు అన్నివిధాలా అండగా ఉంటుందని, అందుకు అనుగుణంగానే విద్యుత్ రంగానికి సంబంధించి ఎటువంటి సమస్యలూ ఎదురు కాకుండా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. సోలార్, విండ్వంటి పునరుత్పాదక విద్యుత్‌రంగాల్లో ఉత్పత్తిని… డిమాండ్ మేరకు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి గొట్టిపాటి ఆదేశించారు.
ఏయేప్రాంతాల్లో, ఏయేకాలాల్లో విద్యుత్ వినియోగం పెరుగుతుందో.., ఎప్పుడు తగ్గుతుందో పరిశీలించి దానికి తగినట్లు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులకు సూచించారు. అదేవిధంగా లోఓల్టేజ్ సమస్యలు తలెత్తకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆక్వా, ఫౌల్ట్రీ రంగాలకు ఇచ్చే రాయితీలపై అధికారులతో మంత్రి చర్చించారు. అర్హులైన ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు అందించే ఉచిత విద్యుత్‌పై చేస్తున్న దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలన్నారు. రాబోయే 6 నెలల కాలానికి విద్యుత్ రంగానికి సంబంధించి ఎటువంటి సమస్యలూ లేకుండా పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని మంత్రి పేర్కొన్నారు. సమీక్ష సమావేశంలో విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్, జెన్ కో ఎండీ చక్రధర్ బాబు, ట్రాన్ కో జేఎండీ కీర్తీ చేకూరితోపాటు డిస్క్ంల సీఎండీలు, పలువురు విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.