- ప్రజా రాజధానిని పరిశీలించిన ముఖ్యమంత్రి
- అడుగడునా కనిపించిన జగన్‌రెడ్డి విధ్వంసం
- నాలుగు గంటల పాటు సాగిన పర్యటన
అమరావతి, చైతన్యరథం: నాలుగోసారి ముఖ్వమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా నారా చంద్రబాబు నాయుడు గురువారం రాజధాని అమరావతిలో పర్యటించారు. మొదట జగన్‌రెడ్డి విధ్వంసపు పాలనకు తొలి చిహ్నమైన కూల్చబడ్డ ప్రజావేదిక నుండి పర్యటన ప్రారంభమైంది. 2019లో జగన్‌రెడ్డి అధికారంలోకి రాగానే మొదటిగా చంద్రబాబు నివాసం పక్కన ఉన్న ప్రజా వేదికను కూల్చేశారు. దాదాపు ఎనిమిది కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్మును వృథా చేశారు. ప్రజా వేదిక విధ్వంసం తర్వాత ఆ ప్రాంతాన్ని చంద్రబాబు గురువారం సందర్శించారు. ఆయన వెంట మున్సిపల్ శాఖా మంత్రి కె.నారాయణ, ఎమ్మెల్యేలు దూళిపాళ్ల నరేంద్ర, కొలికలపూడి శ్రీనివాస్, స్థానిక నాయకురాలు ఉండవల్లి శ్రీదేవితోపాటు సిఆర్‌డీఎ నూతన కమిషనర్ కాటంనేని భాస్కర్, పాత కమిషనర్ వివేక్ యాదవ్, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అశోక్ సింఘాల్ ఉన్నారు. కూల్చబడ్డ ప్రజావేదిక శిధిలాలను పరిశీలించిన చంద్రబాబు పక్కనే ఉన్న అధికారి వివేక్ యాదవ్‌ను కూల్చమని ఎవరు ఉత్తర్వులు ఇచ్చారు అని అడిగారు. తనకు పై అధికారులు నోటి ద్వారా మాత్రమే ఉత్తర్వులిచ్చారని చెప్పారు. కట్టేటప్పుడు నిబంధనల ప్రకారం కట్టారు కదా..కూల్చేటప్పుడు కూడా ఒక ప్రొసీజర్‌ను అనుసరించి కూల్చాలి కదా అని అడిగారు. దానికి వివేక్ యాదవ్ నీళ్లు నమిలారు. ఆ తర్వాత అక్కడ నుండి రాజధానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ఉద్దండరాయనిపాలెంలోని ప్రాంతానికి వెళ్లారు.
పవిత్ర మట్టికి ప్రణమిల్లిన చంద్రబాబు
ఉద్దండరాయని పాలెంలో రాష్ట్రంలోని 171 పవిత్ర దేవాలయాల నుండి తీసుకొచ్చిన మట్టి, దేశంలోని 35 పవిత్ర నదుల నుండి తీసుకొచ్చిన నీరు కలిపి ఉంచిన పవిత్ర మట్టి దగ్గరకు రాగానే చంద్రబాబు బావోద్వేగానికి గురయ్యారు. ముందుగా అక్కడ పూజలు చేసి కొబ్బరి కాయ కొట్టారు. ఆ తర్వాత ఆ మట్టికి మోకాళ్ల మీద ప్రణమిల్లారు. దాదాపు ఒక నిమిషం పాటు ఉద్విగ్నతకు గురై పవిత్ర మట్టికి నమస్కారం చేస్తూనే ఉండిపోయారు. ఆ తర్వాత అక్కడే ఉన్న యజ్ఞశాలను సందర్శించారు. అప్పటికే అక్కడ యజ్ఞం నిర్వహిస్తున్న మహిళలు చంద్రబాబుకు హరతులు ఇచ్చారు. ఆ తర్వాత అమరావతి మాస్టర్ ప్లాన్ నమూనాను సందర్శించారు. గతంలో అల్లరి మూకలు ఈ మాస్టర్ ప్లాన్ నమూనాను ధ్వంసం చేశారు. సిఆర్‌డిఏ అధికారులు తిరిగి బాగు చేశారు.
పాడుపడిన భవనాలు…పెరిగిపోయిన తుమ్మ చెట్లు
ఆ తర్వాత చంద్రబాబు నిర్మాణం ఆగిపోయిన భవనాలను సందర్శించారు. ఈ భవనాల్లో చంద్రబాబు కాలంలో నిర్మించినవే తప్ప గత ఐదేళ్లలో అదనంగా ఒక తట్ట మట్టి కూడా వేయలేదు. ఒక ఇటుక కూడా పెట్టలేదు. చంద్రబాబు హయాం నాటికే కొన్ని భవనాలు 50 శాతం, మరికొన్ని 70 శాతం, మరికొన్ని 90 శాతం పూర్తయ్యాయి. అయితే గత ఐదేళ్ల కాలంలో జగన్‌రెడ్డి వీటిని పాడు బెట్టాడు. ఎక్కడపట్టినా తుమ్మ కంప పెరిగిపోయి ఉంది. భవనాలు పాడుపడిపోయి ఉన్నాయి. బూజుపట్టి ఉన్నాయి. కొన్ని భవనాల తలుపులను పగల కొట్టారు. కొన్నింటినీ దొంగిలించుకెళ్లారు. కొన్ని భవనాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా నిలిచాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్లు, ఐఏఎస్, జూనియర్ అధికారుల క్వార్టర్లు, కార్యదర్శుల బిల్డింగ్‌లు, అసెంబ్లీ, సచివాలయం నిర్మాణం కోసం మొదలు పెట్టిన ఐకానిక్ భవనాల నిర్మాణాలు, జడ్జీల బంగ్లాలు, హైకోర్టు కాంప్లెక్స్ నిర్మాణ ప్రదేశం, ఉద్యోగుల క్వార్టర్లు ఇలా వరుసగా ఒక్కొ నిర్మాణం వద్దకు వెళ్లి చంద్రబాబు పరిశీలించారు. అన్ని చోట్లా గత ఐదేళ్లలో జగన్‌రెడ్డి చేసిన విధ్వంసమే కనిపించింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన పర్యటన మధ్యాహ్నం మూడు గంటల వరకు సాగింది.