- ప్రతి బాధితునికీ ప్రభుత్వ సాయం..
- పరిహారంపై శాస్త్రీయంగా జాబితా
- ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం
- మంత్రులు, అధికారులతో సీఎం సమీక్ష
- 17న సాయం అందజేతకు ఏర్పాట్లు
అమరావతి (చైతన్య రథం): భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిదమవుతోంది. ఇప్పటికే మొదలైన నష్టం వివరాల సేకరణ ప్రక్రియపై సీఎం చంద్రబాబు రివ్యూ చేశారు. సచివాలయంలో మంత్రులు, అధికారులతో సమీక్ష చేసిన ముఖ్యమంత్రి.. ప్రతి బాధితుడికి ప్రభుత్వ సాయమందేలా చూడాల్సిన అవసరముందని చెప్పారు. ఎన్యుమరేషన్ పక్కాగా జరగాలని… నష్టపోయిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వసాయం చేరాలన్నారు. సహాయక చర్యలపై ప్రజలు సంతృప్తితో ఉన్నారని.. పరిహారం విషయంలో శాస్త్రీయంగా ఆలోచనచేసి జాబితా రూపొందించాలని సీఎం అన్నారు. నష్టం అంచనాలు పూర్తి చేస్తే…. 17న బాధితులకు సాయం అందిద్దామని సీఎం పేర్కొన్నారు. ఎన్యూమరేషన్ జరుపుతున్న విధానాన్ని, వివరాలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు.
ఇల్లు పూర్తిగా మునిగి ఆస్తినష్టం జరిగిన వారితోపాటు.. మొదటి ఫ్లోర్‌లో ఉన్నవారికి సైతం సాయం ప్రకటించాలని ప్రభుత్వం యోచిస్తోంది. వరద కారణంగా ఇంట్లో వస్తువులన్నీ పాడైపోయిన మొదటి అంతస్తువారికి ఒక మొత్తం, రెండో ఫ్లోర్‌నుంచి ఆపైన ఉన్నవాళ్లకి కొంత మొత్తం ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. అలాగే దెబ్బతిన్న ద్విచక్రవాహనాలకూ పరిహారమిచ్చే ఆలోచన చేస్తున్నారు. పూర్తిగా ఇల్లు దెబ్బతిన్న వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొత్త ఇల్లు నిర్మించి ఇవ్వనున్నారు. ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తైన తరువాత ఆర్థికసాయంపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోనుంది. వరదల కారణంగా రూ.2,13,456 ఇళ్లు నీటమునిగినట్టు ప్రభుత్వం అంచానా వేస్తోంది.
ఇందులో ఇప్పటి వరకు 84,505 ఇళ్లలో నష్టం అంచనా లెక్కలు పూర్తయ్యాయి. వేలాది ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు దెబ్బతిన్నాయి. 2,14,698 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. వీటికీ పరిహారం అందిచనున్నారు. ఎన్యూమరేషన్‌లో రీ వెరిఫికేషన్ జరిపి ప్రతి బాధితుడికి జరిగిన నష్టాన్ని సేకరిస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. సమీక్షలో మంత్రులు వంగలపూడి అనిత, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, పి నారాయణ, నాదెండ్ల మనోహర్‌తో పాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.