- రిజర్వాయర్లు, చెరువులు నింపేందుకు కార్యాచరణ
- ప్రతి నీటి బొట్టూ వినియోగించుకోవాలి
- అధిక దిగుబడినిచ్చే సాగు ప్రోత్సహించండి
- అన్ని తాగునీటి ట్యాంకులను సకాలంలో నింపాలి
- చివరి ఆయకట్టుకూ నీరివ్వడమే లక్ష్యం కావాలి
- అది.. నదుల అనుసంధానంతోనే సాధ్యం
- జలవనరుల సమీక్షలో సీఎం చంద్రబాబు
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో రిజర్వాయర్లు, చెరువులు, తాగునీటి ట్యాంకులు నింపేందుకు జల ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్లను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో జలవనరుల శాఖను సమీక్షించిన అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో 5 ముఖ్య నదులు (కృష్ణా, గోదావరి, పెన్నా, నాగావళి, వంశధార) ఉన్నాయని, మరో 35 చిన్న నదులున్నాయన్నారు. అదేవిధంగా 38,422 మైనర్ ఇరిగేషన్ వనరులున్నాయని అంటూ.. మొత్తంగా 26 జిల్లాల్లో 4 కోట్ల ఎకరాల ఆయకట్టు ఉందన్నారు. ఈ నేపథ్యంలో రిజర్వాయర్లు, చెరువులు నింపేందుకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. ప్రస్తుత వర్షాకాల/ వరద సీజన్‌లో ముందుగా వరద నీరు వృథాకాకుండా రిజర్వాయర్లు, చెరువులు నింపేందుకు సీఈలు, ఎస్‌ఈలతో సమీక్షించాలన్నారు. వరద నీటిని ఒడిసిపట్టి తక్షణమే ఎగువనున్న రిజర్వాయర్లను నింపాల్సిన అవసరాన్ని వివరించారు. చుక్క నీటినీ వృధా కాకుండా వినియోగించాలన్నారు.
తక్కువ వ్యయంతో పూర్తయ్యే ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణపై దృష్టి పెట్టాలన్నారు. అలాగే, తక్కువ నీటి వినియోగం, ఎక్కువ దిగుబడినిచ్చే పంటలను ప్రోత్సహించేలా వ్యవసాయ శాఖతో కలిసి పని చేయాలన్నారు. టెయిల్ ఎండ్‌తోపాటు నీటి పారుదల ప్రాజెక్టుల క్రింద స్థిరీకరించబడిన ప్రతి ఎకరాకూ నీరందాలని సూచిస్తూ.. కాలువలకు నీటి విడుదల ప్రక్రియను కలెక్టర్లు సునిశితంగా పరిశీలించాలన్నారు. ఈ ప్రక్రియలో నీటి పారుదల శాఖ, రెవెన్యూ, పోలీస్, ఆర్‌డబ్ల్యూఎస్ తదితర శాఖలు పాలుపంచుకోవాలన్నారు. అన్ని త్రాగునీటి ట్యాంకులను సకాలంలో నింపాలని, ప్రతి ఎకరాకూ నీరివ్వడమే లక్ష్యం కావాలన్నారు. గత ప్రభుత్వం ప్రాజెక్టుల్లో గేట్లు పెట్టడానికీ నిధులివ్వలేకపోయిందని గుర్తు చేశారు. ఎక్కడైనా గేట్ కొట్టుకుపోతే తక్షణమే ఏఈ, డీఈని డీమ్డ్ సస్పెన్షన్ చేస్తామని, డ్రోన్‌లను పెట్టి కెనాల్స్, ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలన్నారు. నదుల అనుసంధానంపై దృష్టి పెట్టాలని కలెక్టర్లకు సూచించారు. ఏ ఒక్క వ్యక్తి తప్పు చేసినా, విఫలమైనా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని గుర్తు పెట్టుకోవాలని సీఎం సూచించారు.