- ఆరు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం
- అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలి
- అధికారులకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశం
విజయనగరం(చైతన్యరథం): పైడితల్లి అమ్మవారి పండగ, విజయనగరం ఉత్సవాల నిర్వహణపై శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమన్వయ సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే విజయనగరం ఉత్సవాలు, పైడితల్లి అమ్మవారి పండుగ ప్రజలు, భక్తులలో ఒక మధుర స్మృతిగా నిలిచిపోయేలా విధంగా నిర్వహించాలని ఆదేశించారు. ఇందుకు అన్ని శాఖల అధికారులు సమర్థవంతంగా పనిచే యాలని సూచించారు. సుమారు రూ.2 కోట్లు పండుగ నిమిత్తం ఖర్చు చేస్తామని తెలిపారు. పండుగకు సుమారు ఆరు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ అంబేద్కర్ మాట్లాడుతూ ఉత్సవాలు, పండుగ నిర్వహణకు అన్ని శాఖలు తాము నిర్వహించాల్సిన పనులను ఒక ప్రణాళిక రూపొందించుకుని పనిచేయాలని సూచించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా శానిటేషన్, తాగునీరు, విద్యుత్, భద్రత, వైద్యం, రవాణా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. పట్టణంలో 11 ప్రాంతాల్లో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తామని, కమిటీలను ఏర్పాటు చేసి ఒక్కొక్క అధికారి ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ పని చేయాలని వివరించారు.
పండుగ నిర్వహణపై మరో రెండు సమావేశాలు నిర్వహించి అధి కారులకు దిశా నిర్దేశనం చేస్తామన్నారు. జిల్లా ఎస్పీ వకుల్‌జిందాల్ మాట్లాడుతూ విజయ నగరం ఉత్సవాలు, పైడితల్లి అమ్మవారి పండుగ, సిరిమాను ఉత్సవాల్లో ప్రజలకు, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సుమారు రెండు వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. పట్టణంలో ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా ఇతర శాఖల సమన్వయంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని వివరించారు. ఈ సమావేశంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, స్థానిక ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతిరాజు, నగర మేయర్ విజయలక్ష్మి, వివిధ శాఖలకు చెందిన అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.